breaking news
Rita barnwal
-
ఉన్నత పదవుల్లో ఇండో అమెరికన్లు
వాషింగ్టన్: ముగ్గురు భారతీయ అమెరికన్లను కీలక పరిపాలనా స్థానాల్లో నియమించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేశారు. ప్రస్తుతం గేట్‌వే ఫర్ యాక్సెలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ (గెయిన్) డైరెక్టర్‌గా ఉన్న రీటా బరన్వాల్ను ఇంధన శాఖ (అణు ఇంధన) అసిస్టెంట్ సెక్రటరీగా, న్యాయవాద అధ్యాపకుడిగా ఉన్న ఆదిత్య బమ్జాయ్‌ని ప్రైవసీ అండ్ సివిల్ లిబర్టీస్ ఓవర్‌సైట్ బోర్డు సభ్యుడిగా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్‌సైట్ కౌన్సిల్లో డెప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న బిమల్ పటేల్‌ను ట్రెజరీ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించేందుకు ట్రంప్ ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ట్రంప్ ముందుగానే ప్రకటించినప్పటికీ, నామినేషన్లను బుధవారమే శ్వేతసౌధం నుంచి సెనెట్‌కు పంపారు. ఇప్పటికవరకు మొత్తంగా ట్రంప్ 35 మందికి పైగా భారతీయ అమెరికన్లను కీలక స్థానాల్లో నియమించారు. బరన్వాల్ కొత్త బాధ్యతల్లో భాగంగా అణు ఇంధన కార్యాలయ పాలనా వ్యవహారాలతో పాటు, అణు సాంకేతికత పరిశోధన, అభివృద్ధి విభాగం, మౌలిక సదుపాయాల విభాగ యాజమాన్య బాధ్యతలు కూడా చూడాల్సి వుంటుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ అప్లికేషన్ డైరెక్టర్‌గా, మెటీరియల్స్ టెక్నాలజీ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆమె.. అమెరికా నౌకాదళ రియాక్టర్లకు అవసరమైన అణు ఇంధన మెటీరియల్‌పై పరిశోధన జరిపారు. ఇక యేల్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించిన ఆదిత్యకు సివిల్ ప్రొసీజర్, పాలనాపరమైన శాసనాలు, ఫెడరల్ కోర్టులు, జాతీయ భద్రతా చట్టం, కంప్యూటర్ సంబంధిత నేరాలపై బోధన జరిపిన, రచనలు చేసిన అనుభవముంది. యూఎస్ సుప్రీంకోర్టు జస్టిస్ అంటోనిన్ స్కలియా వద్ద, అప్పీల్స్ కోర్టు (ఆరవ సర్క్యూట్) జడ్జి జెఫ్రీ వద్ద లా క్లర్క్‌గా విధులు నిర్వర్తించారు. అమెరికా న్యాయశాఖలో అటార్నీ అడ్వయిజర్‌గా, ప్రైవేటు రంగంలో అప్పిలేట్ అటార్నీగా కూడా పని చేశారు. మూడో వ్యక్తి బిమల్ పటేల్ ప్రస్తుతం ఆర్థిక స్థిరత్వ వ్యవహారాల పర్యవేక్షణ మండలికి సంబంధించిన ట్రెజరీలో డిప్యూటీ అసిస్టెంటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో పలు సంస్థలకు సలహాలిచ్చిన అనుభవముంది. తొలి దక్షిణాసియా వ్యక్తి డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తికి నిఘాపై ఏర్పాటైన కాంగ్రెషనల్ కమిటీలో చోటు దక్కింది. ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి దక్షిణాసియా వ్యక్తి ఈయనే. అమెరికా జాతీయ భద్రతను పటిష్టం చేయడం ఈ కమిటీ బాధ్యత. కృష్ణమూర్తి (45) ప్రస్తుతం ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ జిల్లాకు ప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కృష్ణమూర్తిని కమిటీలో సభ్యుడిగా నియమిస్తున్నట్లు సభాపతి న్యాన్సీ పెలోసీ బుధవారం ప్రకటించారు. కృష్ణమూర్తి ఢిల్లీలో ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. ఆయనకు మూడు మాసాల వయసున్నప్పుడే ఆయన కుటుంబం న్యూయార్క్‌లోని బఫెలో స్థిరపడింది. -
అమెరికా అణుశక్తి విభాగం చీఫ్‌గా రీటా
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన రీటా బరన్వాల్ త్వరలో అమెరికా అణుశక్తి విభాగం అధిపతి కానున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం ఈమెను ఈ పదవికి నామినేట్ చేశారు. ఈ ప్రతిపాదనపై సెనెట్ ఆమోదముద్ర వేస్తే రీటా ఇంధన విభాగం సహాయ మంత్రి హోదాలో నియమితులవుతారు. ఈ హోదాలో అణు సాంకేతికత పరిశోధన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను రీటా చేపడతారు. ప్రస్తుతం అణు విభాగంలోని గేట్‌వే ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్‌కు డైరెక్టర్‌గా ఉన్న రీటా.. గతంలో అమెరికా నావికాదళ రియాక్టర్లలో వాడే అణు ఇంధన పదార్థాల పరిశోధన, అభివృద్ధి విభాగానికి నేతృత్వం వహించారు. రీటా బరన్వాల్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీఎస్సీ డిగ్రీ, మిచిగాన్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్డీ పొందారు. -
భారతసంతతి మహిళకి అమెరికాలో కీలక పదవి
వాషింగ్టన్: అమెరికాలో ఆధునిక అణు రియాక్టర్ల అభివృద్ధిని వేగవంతం చేయాలని నిర్ణయించిన కొద్ది రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. అణుశక్తి రంగంలో నైపుణ్యం ఉన్న భారత సంతతికి చెందిన రీటా బరన్వాల్ని, అణుశక్తి విభాగంలో కీలకమైన అసిస్టెంట్ సెక్రటరీ పదవికి డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రీటా గేట్‌వే ఫర్ ఆక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ (జీఏఐఎన్)లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రీటా నియామక ప్రతిపాదనను సెనెట్ ఆమోదించాల్సి ఉంది. మెటీరియల్స్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఎంఐటీ (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి రీటా పట్టా పొందారు. మిచిగాన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఎంఐటీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్, బార్క్లీ అణు ఇంజినీరింగ్ విభాగాల సలహాదారుల బోర్డులో గతంలో సేవలందించారు.