అల్లర్ల బాధితులను కలిసిన బెంగాల్ గవర్నర్
మాల్డా/కోల్‌కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్తోపాటు, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ బృందాల సభ్యులు శుక్రవారం మాల్దా జిల్లాలో ఆశ్రయం పొందుతున్న అల్లర్ల బాధితులను కలుసుకున్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్ జిల్లాలోని ముస్లిం మెజారిటీ ఉన్న షంషేర్‌గంజ్, సుటి, ధులియన్, జంగీపూర్ ప్రాంతాల్లో ఈ నెల 11,12వ తేదీన చోటుచేసుకున్న అల్లర్లలో ముగ్గురు చనిపోవడం తెల్సిందే. హింసాత్మక ఘటనల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. భీతిల్లిన సామాన్యులు వందలాదిగా పొరుగునే ఉన్న మాల్దా జిల్లాకు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. వీరి కోసం మాల్దాలోని పర్ లాల్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రశాంతత కొనసాగేందుకు పర్యటనను వాయిదా వేసుకోవాలని సీఎం మమతా బెనర్జీ చేసిన సూచనను గవర్నర్ సీవీ ఆనంద బోస్ పట్టించుకోలేదు. అక్కడికెళ్లి స్వయంగా పరిస్థితులను స్వయంగా పరిశీలించి, కేంద్రానికి నివేదిక అందజేస్తానంటూ ఆయన శుక్రవారం రైలులో పర్ లాల్పూర్ చేరుకుని బాధితులతో సమావేశమయ్యారు. వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. కొందరు దుండగులు తమ ఇళ్లపై దాడులు చేసి, సర్వస్వం దోచుకుని, బయటకు గెంటేశారని బాధిత మహిళలు చెప్పారని అనంతరం గవర్నర్ ఆనందబోస్ మీడియాకు తెలిపారు. సహాయక శిబిరాల్లో వసతుల లేమిపై యంత్రాంగం నుంచి సవివర నివేదిక కోరానన్నారు. ఆయన వెంట ఉన్న రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. పార్ లాల్పూర్లో ఉద్రిక్తతలు ప్రాణభయంతో పారిపోయి వచ్చిన తమను జిల్లా అధికారులు తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని బలవంతం చేస్తున్నట్లు పార్ లాల్పూర్లో ఆశ్రయం పొందుతున్న ముర్షిదాబాద్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తమ వద్దకు వచ్చిన జిల్లా అధికారులను వారు చుట్టుముట్టారు. ఎండిన రొట్టెలు, అరటి పండ్లు, ముక్కిపోయిన బియ్యం ఇస్తున్నారన్నారు. శిబిరాల్లో పరిస్థితులు జైలు కంటే దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. తమ సొంతూళ్లో పరిస్థితులు ఏమంత సురక్షితంగా లేవన్నారు. తమ నివాసప్రాంతాల్లో బీఎస్ఎఫ్ జవాన్లు క్యాంపులను ఏర్పాటు చేసేదాకా తిరిగి వెళ్లేది లేదన్నారు. పోలీసులు తమను మీడియాతోను, చివరికి బంధువులతో సైతం మాట్లాడవద్దని ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ) శుక్రవారం మాల్దాలోని పర్ లాల్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాల సహాయ శిబిరాన్ని సందర్శించింది. కమిషన్ సభ్యులు బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వీరు మూడు వారాల్లోగా ఎన్‌హెచ్చార్సీకి నివేదికను సమరి్పంచాల్సి ఉంది. ముర్షిదాబాద్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు ఎన్‌హెచ్చార్సీ ప్రకటించింది. అదేవిధంగా, జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ విజయా రాహత్కర్ తన బృందంతో శుక్రవారం మాల్డాలోని తాత్కాలిక సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న అల్లర్ల బాధితుల కుటుంబాలతో మాట్లాడారు. శిబిరాల్లో మహిళలు, చిన్నారులకు కల్పించిన సౌకర్యాలను చూసి షాక్‌కు గురైనట్లు ఆమె తెలిపారు. మహిళలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టి, అనూహ్యమైన ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌ను మరో బంగ్లాదేశ్ మాదిరిగా మార్చాలని టీఎంసీ ప్రభుత్వం అనుకుంటోందా? అని ప్రశ్నించారు. శనివారం ఈ బృందం ముర్షిదాబాద్‌కు వెళ్లనుంది. అనంతరం కోల్‌కతాలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు డీజీపీతో భేటీ అవుతారు. కాగా, గవర్నర్ ఆనంద బోస్, ఎన్‌హెచ్చార్సీ, ఎన్సీడబ్ల్యూ బృందాల పర్యటనలు రాజకీయ ప్రేరేపితమని, పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చేందుకు ప్రయతి్నస్తున్నారని టీఎంసీ ఆరోపించింది.