breaking news
revenue jobs
-
నేడు సీఆర్డీఏ రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ
తుళ్లూరు : ఇసుక మాఫియా అక్రమాలను అడ్డుకోబోయిన ముసునూరు మండల తహశీల్దార్ దోనపల్లి వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రోద్బలంతో జరిగిన దాడికి నిరసనగా తుళ్లూరు సీఆర్డీఏ రెవెన్యూ ఉద్యోగులు శుక్రవారం విధులు బహిష్కరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, సీఆర్డీఏ తహశీల్దారు జి.కేశవనాయుడు ఆధ్వర్యంలో గురువారం రాత్రి సమావేశమై ఈ మేరకు నిర్ణయించారు. ప్రభుత్వ స్పందన చూసి తదుపరి కార్యాచరణకు దిగుతామని తెలిపారు. కార్యక్రమంలో సీఆర్డీఏ డెప్యూటీ కలెక్టర్ త్రిమూర్తులు, తుళ్లూరు డెప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సమ్మెలో ఎన్జీవో, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఉద్యోగులు
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఇది వరకు నిరసనలతో ఉద్యమం చేపట్టిన ఉద్యోగులు ఇక పాలనను స్తంభింపజేయనున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. సోమవారం జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు సమ్మె నోటీస్ అందజేశారు. తహశీల్దార్ కార్యాలయాల తాళాలను ఆర్డీఓలకు అందజేసి మంగళవారం నుంచి ఉద్యమంలో పాల్గొనాలని అందరికీ సమాచారం పంపారు. వీరితో పాటు వ్యవసాయశాఖ, జెడ్పీ, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగులు కలెక్టర్‌కు, జెడ్పీ సీఈఓకు సమ్మె నోటీసులు అందజేశారు. సమ్మెతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలని నేతలు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సోమవారం అర్ధరాత్రి నుంచి రెవెన్యూ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓలు, జిల్లా పరిషత్తు, వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. మంగళవారం హౌసింగ్, పౌరసరఫరాల శాఖ, గెజిటెడ్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనున్నారు. జిల్లాలో దాదాపు 45,351 మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. 30 వేల మంది ఎన్జీఓలు, 15 వేల మంది జెడ్పీ, పంచాయతీరాజ్ ఉద్యోగులు, 201 మంది ట్రెజరీ ఉద్యోగులు, 150 మంది వ్యవసాయశాఖ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. ఇక దాదాపు 10 వేల మంది ఉపాధ్యాయులు మూడు రోజుల పాటు విధులను బహిష్కరించారు. 15న సమ్మెకు మినహాయింపు నిరవధిక సమ్మెలోకి వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు కలెక్టర్ లోకేష్‌కుమార్ విజ్ఞప్తి మేరకు 15వ తేదీ మాత్రం సమ్మెకు మినహాయింపు ఇచ్చారు. కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగుర వేసిన అనంతరం.. మరో రకంగా నిరసన తెలపనున్నారు. ప్రతి ఏటా జిల్లా స్థాయిలో మెరుగైన ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్నారు. అయితే ఈ సారి రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా ప్రశంసాపత్రాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఉద్యోగులకు సూచించినట్లు ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ బంద్ సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా నాన్ గెజిటెడ్ ఉద్యోగులు (ఎన్జీఓలు) సోమవారం కలెక్టర్ కార్యాలయాన్ని బంద్ చేయించారు. స్థానిక ఎన్జీఓ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజ్ ఆధ్వర్యంలో బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన ఎన్జీఓల సమ్మె సత్తా ఏంటో ఢిల్లీకి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనర్సయ్య, నాయకులు నారాయణ, అతావుల్లా పాల్గొన్నారు. ఎన్జీఓల సమ్మెకు పలు సంఘాల మద్దతు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీఓల పిలుపు మేరకు సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు పంచాయతీరాజ్ (పీఆర్) ఇంజనీర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.భాస్కర్‌రెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. సమైక్యాంధ్ర సాధన కోసం ఎన్జీఓల సమ్మెకు బేషరతు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. పంచాయతీరాజ్ (పీఆర్) మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డీఎం సుభాన్, ప్రధాన కార్యదర్శి టి.నాగభూషణరెడ్డి సమ్మెకు మద్దతు ప్రకటించారు. జెడ్పీ పీఆర్ పరిధిలో ఉన్న రికార్డు అసిస్టెంట్ల నుంచి సూపరింటెండెంట్ల స్థాయి వరకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ డ్రైవర్లు విధులకు వెళ్లొద్దు ఎన్జీఓల సమ్మెకు ఏపీ ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు జిల్లా అధ్యక్షుడు పొట్టిపాడు రమేష్‌బాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగాప్రభుత్వ వాహనాల డ్రైవర్లందరూ విధులకు వెళ్లకుండా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.