breaking news
retirement age of government employees
-
నాలుగు వారాల్లోగా సమాధానమివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు తీర్పును ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదంటూ సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. పదవీ విరమణ పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వివిధ కార్పొరేషన్ సంస్థలు, సొసైటీలు, గిరిజన, సాంఘిక, గురుకుల విద్యా సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వయోపరిమితి పెంపును అమలు చేయలేదని ఆయా సంస్థలకు చెందిన ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆగస్టు 9న ఉద్యోగులకు అనుకూల తీర్పును ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 58 ఏళ్లకే పదవీ విరమణ పొంది ఉండి ఇంకా పదవీ విరమణ వయస్సు దాటనిపక్షంలో వారిని ఉద్యోగంలో కొనసాగనివ్వాలని, పదవీ విరమణ వయస్సు దాటిన పక్షంలో వారు ఉద్యోగం నుంచి వైదొలగిన సమయం నుంచి 60 ఏళ్ల వయస్సు వచ్చిన నాటికి గల కాలానికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని ధర్మాసనం పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులను అమలు చేయలేదని, అమలుకు షరతులు పెడుతున్నదని పేర్కొంటూ విద్యుత్ సంస్థల ఉద్యోగులు ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోలకు జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసు జారీ చేసింది. -
ఆంధ్రా ఉద్యోగి సేవలు ఇక అరవై ఏళ్లు
పదవీ విరమణ వయస్సు పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుదల అమలులోకి వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచడం తెలిసిందే. ఇందుకు సంబంధించి అసెంబ్లీ ఆమోదించిన చట్టసవరణ బిల్లుకు గవర్నర్ నరసింహన్ శనివారం ఆమోదం తెలిపారు. తెలంగాణలో పనిచేస్తూ సోమవారం పదవీ విరమణ చేసే ఆంధ్రా ఉద్యోగులు కొంతకాలం ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. కమలనాథన్ కమిటీ శాశ్వత ఉద్యోగుల పంపిణీ పూర్తి అయిన తరువాత తెలంగాణలో విరమణ చేసిన ఆంధ్రా ఉద్యోగులను సర్వీసు బ్రేక్ లేకుండా ఏపీ ప్రభుత్వం తీసుకుంటుంది. వారు 60 ఏళ్లు వచ్చేవరకు ఏపీలో పనిచేస్తారు. ఇప్పుడు తాత్కాలిక ఉద్యోగుల కేటాయింపులో భాగంగా తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఆంధ్రాలో పనిచేస్తూ ఈ నెలాఖరుకు పదవీ విరమణ కావాల్సి ఉన్నా రిటైర్ కారు. కమలనాథన్ కమిటీ శాశ్వత కేటాయింపు పూర్తయ్యేవరకు వారు ఆంధ్రాలో పనిచేస్తారు. శాశ్వత కేటాయింపులో ఆంధ్రాలో పనిచేస్తూ తెలంగాణకు వస్తే అప్పుడు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.