breaking news
reservoyers
-
రిజర్వాయర్ల నిర్మాణంపై కాంగ్రెస్ ద్విముఖం
సిద్దిపేట జోన్: కరీంనగర్ జిల్లా తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం విషయంలో ధర్నాలు చేసిన కాంగ్రెస్.. నేడు మల్లన్నసాగర్ రిజర్వాయర్ విషయంలో ఆందోళనలు చేయడం విడ్డూరంగా రాష్ర్ట భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 400 మంది విద్యార్ధులకు ఉచితంగా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణ సమయంలో రామాచంద్రపురం, గుగ్గిల్లా, ఓబులాపూర్ మూడు గ్రామాలు ముంపునకు గురయ్యే సమస్య ఏర్పడిందన్నారు. అప్పట్లో తాను ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడి గ్రామాలను ముంపునకు గురికాకుండా వాగుమీద ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే గ్రామాలను ముంచాలని టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు ధర్నాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇదే సమయంలో మల్లన్నసాగర్‌పై కాంగ్రెస్ పార్టీ భిన్నస్వరాన్ని వ్యక్తం చేస్తుందన్నారు. మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుతగులుతుందన్నారు. 60 సంవత్సరాలుగా సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం నోచుకోలేక బీడు భూములుగా మారిన తెలంగాణలో కోటి ఎకరాల మాగాని లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామన్నారు. రైతు బ్రతుకు చిద్రం కాకుండా గోదావరి జలాలతో పచ్చని తెలంగాణను నిర్మిస్తామన్నారు. గత పాలకుల హయంలో విద్యుత్ కోతలతో సతమతం అయ్యామని నేటి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సమస్యను అధిగమించిందన్నారు. విద్యుత్ కోతలు లేని సరఫరా జరుగుతుందన్నారు. ఇవాళ నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గమైనా, హైటెక్ సిటీ అయినా సరే 24 గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. ప్రస్తుతమున్న సర్పంచ్ల పదవీ కాలం అనంతరం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం 365 గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించిందన్నారు. నారాయణఖేడ్ బాధ్యత నాదే.. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు విద్య కోసం 150 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేటకు రావడం తనకు ఎంతో బాధను కలిగించిందన్నారు. ఇటీవల సీఎంతో మాట్లాడి జిల్లాకు 8 గిరిజన వసతి గురుకులాలు మంజూరైతే వాటిలో నాలుగింటిని నారాయణఖేడ్‌లో ఏర్పాటు చేశామన్నారు. విద్య, వైద్యం, రవాణా, సాగునీటి రంగాల్లో ఖేడ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో జల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు మురళియాదవ్, రాష్ర్ట నాయకులు బిడే కన్నె హనుమంతు, మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్, కౌన్సిలర్లు మచ్చవేణుగోపాల్‌రెడ్డి, ప్రవీణ్, బర్ల మల్లికార్జున్, వెంకట్‌గౌడ్, సాకి అనంద్, దీప్తి నాగరాజు, బ్రహ్మం, టీఆర్ఎస్ నాయకులు కొండం సంపత్‌రెడ్డి, సాయిరాంతో పాటు గిరిజన విద్యార్ధి సంఘం కన్వీనర్ అజయ్‌నాయక్, డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవికుమార్ వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
రాచకొండలో రిజర్వాయర్లు!
నేటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్న నిపుణుల బృందం సాక్షి, హైదరాబాద్: నల్లగొండ-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో విస్తరించిన రాచకొండ గుట్టల్లో పది టీఎంసీల సామర్థ్యంతో రెండు భారీ స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం రాజధాని హైదరాబాద్‌కి ప్రస్తుతం కృష్ణా మొదటి, రెండవ, మూడవ దశల ద్వారా నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్న విషయం విదితమే. దీనికి అదనంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి తరలించనున్న పది టీఎంసీల నీటిని ఈ జలాశయాల్లో నిల్వ చే సేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం జరపాలని జలమండలి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సర్కారు ఆదేశాల మేరకు జలమండలి ఇంజినీర్లు సహా పలువురు నిపుణులు శనివారం నుంచి ఐదు రోజుల పాటు రాచకొండ గుట్టలతోపాటు నల్లగొండ జిల్లా మల్కాపురం, నాగారం తదితర ప్రాంతాల్లోని అటవీ, ప్రభుత్వ భూముల్లో క్షేత్రస్థాయి అధ్యయనం జరపనున్నారు. భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి అవకాశాలను పరిశీలించనున్నట్లు అధికార వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ముంపు సమస్యలు లేకుండా చూడాలి భారీ రిజర్వాయర్లు నిర్మించేటప్పడు ముంపు సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. 40 గ్రామాలు విస్తరించి ఉండే స్థలంలో రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన స్థలాలు సేకరించడం కష్టమే. నగరానికి తరలించేందుకు అవసరమయ్యే వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని కార్యాచరణ సిద్ధంచేయాలి. - టి.హనుమంతరావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ జంట జలాశయాల ఎగువ ప్రాంతాల్లో నిర్మించాలి ప్రస్తుతం జలకళలేక వట్టికుండలుగా మారిన జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల ఎగువ ప్రాంతాల్లో ఈ భారీ స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించిన పక్షంలో.. అక్కడి నుంచి నీటిని నేరుగా జంట జలాశయాలకు గ్రావిటీ ద్వారా తరలించే అవకాశం ఉంటుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి లక్ష్మీదేవిపల్లి మీదుగా ఈ స్టోరేజి రిజర్వాయర్లలో నీటిని నింపే ఏర్పాట్లు చేస్తే మంచిది. - శ్యాంప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్