breaking news
renting
-
సొంతిల్లా... అద్దె ఇల్లా?
సొంతిల్లా... అద్దె ఇల్లా? ఏది బెటర్? ఈ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పినా కరెక్టే. కాకపోతే... అది చెప్పిన వారి దృష్టి కోణంలో మాత్రమే. ఒకరు ఇదే కరెక్ట్... అని చెప్పినంత మాత్రాన అందరికీ అదే కరెక్ట్ అనిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇల్లు అవసరాలు... అనేది ఆలోచించే కోణం... సామాజిక– ఆర్థిక స్థాయి... మానసిక తృప్తిపై ఆధారపడి ఉంటుంది. అందుకని ఒకరికి సొంతిల్లు కరెక్టనిపించవచ్చు. మరొకరికి అదే ఈఎంఐలో సగం పెట్టి అదే ఇంట్లో అద్దెకు ఉండొచ్చు కదా? మిగిలిన ఈఎంఐ మొత్తంతో దీర్ఘకాలంలో సంపద సృష్టించవచ్చు కదా? అని అనిపించవచ్చు. రెండూ కరెక్టే. అందుకే ఎవరి పరిస్థితులు, అవసరాలను బట్టి వారు నిర్ణయించుకోవాల్సిందే. మరి ఆ అవసరాలు, పరిస్థితులను గుర్తించేదెలా? ఇదే ఈ వారం ‘వెల్త్ స్టోరీ’.. – సాక్షి, వెల్త్ డెస్క్ఇంటిని కొనటమనేది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు. ఒక గుర్తింపు కోసం, భద్రత కోసం భావోద్వేగాలతో ముడిపడి తీసుకునే నిర్ణయమది. ‘ఆ రమణను చూశావా? ఎంత అందమైన ఇల్లు కట్టుకున్నాడో! చాలా ఖర్చు పెట్టాడట, గట్టిగానే సంపాదించి ఉంటాడు’... అనే గుర్తింపు చాలా మందికి కిక్కునిస్తుంది. జీవితంలో తాము సాధించిన ఘనతల్లో సొంతింటిని ఒకటిగా చూస్తుంటారు. సరైన ప్రాంతంలో ఇల్లు సమకూర్చుకుంటే, సొంతింటి కల సాకారానికితోడు కాలక్రమంలో దాని విలువ కూడా గణనీయంగా పెరుగుతుందన్నది ఒక ఆలోచన. నెలవారీ ఆదాయం నుంచి కొంత అద్దెకు కేటాయించి, మిగిలిన నిధిని సంపద సృష్టి కోసం పెట్టుబడిగా మార్చుకోవచ్చన్నదీ నిజమే. ప్రాపర్టీ కంటే ఈక్విటీలు అధిక రాబడులు ఇచ్చినట్టు చరిత్ర చెబుతోంది. పూర్వపు రోజులతో పోలిస్తే ఇపుడు చిన్న పట్టణాల నుంచి నగరాల వరకు చాలా చోట్ల ఇళ్ల స్థలాలు కొనలేనంత ఖరీదైపోయాయి. సామాన్య, మధ్య తరగతి వాసులకు అందనంత ఎత్తుకు వాటి ధరలు చేరాయి. పైగా ఇంటిపై అద్దె రూపంలో వచ్చే రాబడి ఈఎంఐతో పోలిస్తే చాలా తక్కువ. ఇలా ఎన్నో అంశాలను చూడాల్సి ఉంటుంది.సొంతింటికి వెళితే.. 🔹 భాగ్యనగరంలో ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ.కోటి పైనే పెట్టాలి. 🔹 రుణంతో ముందుకు వెళ్లేట్టు అయితే 20 శాతం డౌన్ పేమెంట్ (రూ.20 లక్షలు)ను కొనుగోలుదారుడు రెడీ చేసుకోవాలి. 🔹 స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు 6 శాతం కోసం మరో రూ. 6 లక్షలు. మొత్తంగా రూ.26 లక్షలు కావాలి. 🔹 మిగిలిన రూ.80 లక్షలను బ్యాంక్ రుణంగా ఇస్తుంది. 20 ఏళ్ల కాలానికి 8 శాతం రేటు ప్రకారం చూస్తే నెలవారీ ఈఎంఐ రూ.66,915. 🔹 20 ఏళ్లలో రూ.80 లక్షల రుణానికి చెల్లించుకోవాల్సిన మొత్తం రూ.1.61 కోట్లు. ఆరంభంలో రూ.26 లక్షలు కలిపితే రూ.1.87 కోట్లు అవుతుంది. 🔹 ఇంటికి మరమ్మతులు, ప్రాపర్టీ ట్యాక్స్ తదితర ఖర్చులు అదనం. 🔹 రూ.కోటి ఇంటి కోసం దాదాపు రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది. కిరాయి ఇంటికి వెళితే..? 🔹 నగరాల్లో నివాస గృహాలపై రెంటల్ ఈల్డ్స్ 2–3 శాతం మించడం లేదు. 🔹 రూ.కోటి ఇంటిపై 2.5 శాతం రాబడి ప్రకారం ఏడాదికి అద్దె రూ.2.5 లక్షలు. 🔹 ఏటా 5 శాతం పెరుగుతూ (పెరిగే ధరలకు అనుగుణంగా) వెళితే 20 ఏళ్లలో రూ.82.7 లక్షలను అద్దె రూపంలో చెల్లించాల్సి వస్తుంది. 🔹 సొంతంగా ఇల్లు సమకూర్చుకుంటే అయ్యే రూ.1.87 కోట్లలో సగానికంటే తక్కువే. 🔹 మరి మిగిలిన సగానికే ఇల్లు సొంతం అవుతోంది కదా? అని వాదించొచ్చు. ఇందులో నిజం కొంతే. కాంపౌండింగ్ మ్యాజిక్ 🔹 ఇంటిని రుణంపై తీసుకుంటే నెలవారీ రూ.66,915 ఈఎంఐ చెల్లించాలి. 🔹 అదే అద్దెకు తీసుకుంటే రూ.20,883 కిరాయి చెల్లిస్తే సరిపోతుంది. 🔹 అంటే రూ.46,082 మిగిలినట్టు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈ మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే? 🔹 12 శాతం వార్షిక రాబడి ప్రకారం చూసినా (ఇంతకంటే ఎక్కువే రావచ్చు) 20 ఏళ్లలో రూ.5.98 కోట్ల సంపద సృష్టి సాధ్యం. 🔹 మరి కొనుగోలు చేసిన ఇంటి విలువ కూడా 20 ఏళ్లలో రూ.6 కోట్లకు చేరుకుంటుందా? కచ్చితంగా చెప్పలేం. నిజానికి ఈక్విటీల్లోనే అధిక రాబడులున్నాయి మరి. 🔹 కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కేసుల్లో ప్రాపర్టీ విలువ కూడా ఇదే స్థాయిలో పెరిగిన నిదర్శనాలూ ఉన్నాయి.అటా.. ఇటా..? 🔹 సంపదను సృష్టించుకోవాలన్నది లక్ష్యం అయితే అద్దె ఇంటికి వెళ్లి, సిప్ వేసుకోవడం బెటర్. మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసి కోరుకున్నంత సమకూర్చుకోవచ్చు. 🔹 ఒకవేళ అద్దెకు ఉండి, మిగిలే ఆదాయాన్ని సిప్ చేసేంత క్రమశిక్షణ లేని వారికి ఇంటి కొనుగోలే సరైన నిర్ణయం. 🔹 తరచూ ప్రాంతాలు మారుతుంటే లేదా పనిచేసే చోటుకు సమీపంలో ఉండాలనుకునుంటే రెంటెడ్ హోమ్ అనుకూలం. 🔹 ఇంటికి ఈఎంఐ పెద్ద మొత్తంలోనే ఉంటుంది. పిల్లల ఉన్నత విద్య, వివాహాలు, తమ విశ్రాంత జీవన అవసరాల కోసం కూడా పెట్టుబడి మిగులు ఉండేలా చూసుకోవాలి. సొంతిల్లు ఎప్పుడు? కొన్ని సందర్భాల్లో ఇంటిపై పెట్టుబడి సిరులు కురిపిస్తుందనడంలో సందేహం లేదు. 🔹 ధరలు ఏటా 10 శాతం మించి పెరిగే చోట ఇంటిపై పెట్టుబడి కాసులు కురిపిస్తుంది. 🔹 గృహ రుణాలు కనిష్ట స్థాయిలకు చేరిన సందర్భంలోనూ ఇంటికి ఈఎంఐ రూపంలో చెల్లింపులు తగ్గుగాయి. 🔹 దీర్ఘకాలం పాటు స్థిర నివాసం కోరుకుంటే ముందడుగు వేయొచ్చు. 🔹 గృహ రుణం చెల్లింపులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలను (పాత పన్ను విధానంలో రూ.2 లక్షల వరకు వడ్డీపై) పూర్తి స్థాయిలో వినియోగించుకున్నా ఆ మేరకు దీర్ఘకాలంలో చాలా ఆదా అవుతుంది. 🔹 ఎక్కువ మంది ఇంటి కొనుగోలుకే ఎందుకు మొగ్గు చూపుతారంటే? సొంతిల్లు కలిగి ఉండాలన్న అభిలాషే అని చెప్పొచ్చు. తమకు నచ్చిన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవచ్చు. ఉన్నట్టుండి ఖాళీ చేయనక్కర్లేదు. ఏటా అద్దె పెంచనక్కర్లేదు. సామాజిక గుర్తింపు ఇలా ఎన్నో భావోద్వేగ అంశాలు ఆ దిశగా నడిపిస్తుంటాయి. 🔹 సొంతిల్లును సంపద సృష్టి కంటే నివాస యోగ్య సాధనంగానే చూడాలి. భావోద్వేగాల కంటే ఆర్థిక భద్రతకే ప్రాధాన్యం ఎక్కువ. నోట్: ఏటా కనీసం 10 శాతానికి పైన పెరుగుతూ వెళితేనే సొంతిల్లు మెరుగైన నిర్ణయమని స్పష్టమవుతోంది. -
పెళ్లిళ్ల సీజన్.. టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. శుభకార్యాలకు అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పిస్తోంది. అన్ని రకాల బస్ సర్వీస్‌లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా అద్దె బస్సులకు రాయితీని గతంలో సంస్థ కల్పించింది. గత ఏడాది డిసెంబర్ 31తో ఆ రాయితీ గడువు ముగిసింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ రావడంతో డిమాండ్ దృష్ట్యా.. 10 శాతం రాయితీ కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులు సూచన చేశారు. ఈ మేరకు ఆ రాయితీని సంస్థ ప్రకటించింది. శుభకార్యాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ వెల్లడించారు. ప్రైవేట్ వాహనాల కన్నా చాలా తక్కువ ధరకే తమ సంస్థ బస్సులను అద్దెకు ఇస్తోందని పేర్కొన్నారు. ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్ లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామని వివరించారు. చదవండి: బదిలీ వెనుక రాజకీయం.. చక్రం తిప్పిన ఇద్దరు ప్రజాప్రతినిధులు..? అద్దె బస్సుల బుకింగ్ కోసం తమ అధికారిక వెబ్సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక డిపో మేనేజర్‌ను సంప్రదించాలన్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్లకు తమ అద్దె బస్సులకు వినియోగించుకుని టీఎస్ఆర్టీసీని ప్రోత్సహించాలని కోరారు. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్‌ను బట్టి అద్దె బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. -
జీఎస్టీ షాక్:ఈఎంఐలపైనా పన్ను బాదుడు
-
లీజులు, అద్దెలపై జీఎస్టీ!
- భూమి లీజు, నిర్మాణంలోని ఇంటి కొనుగోలుకు చెల్లించే ఈఎంఐలపై కూడా.. - భూమి, భవనాల అమ్మకాలకు మినహాయింపు.. జీఎస్టీ బిల్లుల్లో కేంద్రం ప్రతిపాదన న్యూఢిల్లీ భూమి లీజుకిచ్చినా, వాణిజ్య అవసరాల కోసం భవనాల్ని అద్దెకిచ్చినా జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) పన్ను చెల్లించాల్సిందే. నిర్మాణంలో ఉన్న ఇంటి కొనుగోలుకు చెల్లించే ఈఎంఐలకు కూడా జీఎస్టీ పన్నును అమలు చేస్తారు. ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీలో ఈ ప్రతిపాదనలు చేర్చడంతో... ఎంత పన్ను విధిస్తారోనని వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే భూమి, భవనాల అమ్మకాలకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చారు. వాటిపై ఎప్పటిలానే స్టాంప్ డ్యూటీ కొనసాగనుంది. విద్యుత్‌ను కూడా జీఎస్టీ పరిధి నుంచి తప్పించారు. జీఎస్టీ బిల్లులపై పార్లమెంట్లో ఇంకా చర్చ ప్రారంభం కానందున ఈ నిబంధనలు కొనసాగిస్తారా లేక సవరణలు చేస్తారా అన్నది వేచిచూడాల్సిందే. కేంద్ర ఎక్సైజ్ పన్ను, సేవా పన్ను, రాష్ట్రాల వ్యాట్‌లతో పాటు ఇతర పరోక్ష పన్నుల్ని రద్దు చేసి రూపొందించిన జీఎస్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ జూలై 1, 2017 నుంచి అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే.. సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన నాలుగు బిల్లుల్లో ఒకటైన సీజీఎస్టీ(కేంద్ర జీఎస్టీ)లో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. లీజు, అద్దె, ఇతరుల ఆస్తిపై హక్కు పొందడం, భూమి స్వాధీనానికి అనుమతి కలిగి ఉండడం వంటివి సేవలుగానే పరిగణిస్తారు. వ్యాపారం లేదా వాణిజ్యం కోసం... వాణిజ్య, పారిశ్రామిక, నివాస సముదాయాల్ని పూర్తిగా లేక పాక్షికంగా లీజు లేదా అద్దెకు ఇవ్వడాన్ని కూడా సీజీఎస్టీలో సేవలుగానే పేర్కొన్నారు. భూమి లేదా భవనం అమ్మకాల్ని వస్తు సరఫరాగా పరిగణించడంతో వాటిపై సేవా పన్నువసూలు చేయరు. నిర్మాణంలో ఉన్న భవనాల అమ్మకాలకు మాత్రం జీఎస్టీ వర్తిస్తుంది. గతంలో రూపొందించిన జీఎస్టీ నమూనా బిల్లుల ప్రకారం గూడ్స్(వస్తువులు) అంటే నగదు, సెక్యూరిటీస్ తప్ప ఏదైనా చరాస్తి (దావా హక్కు కలిగి ఉండాలి)... వస్తువుల జాబితాలో చేరని వాటిని సేవలుగా పరిగణించడం తెలిసిందే. మార్చి 31 సమావేశంలో నిర్ణయించే అవకాశం పన్ను నిపుణుల సమాచారం మేరకు ప్రస్తుతం వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం చెల్లించే అద్దెలపై సేవా పన్ను విధిస్తున్నారు. నివాస సముదాయాలకు మాత్రం పన్ను నుంచి మినహాయింపు ఉంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లకు అక్కడి భూమి కనిష్ట విలువను పరిగణనలోకి తీసుకుని సేవా పన్ను విధిస్తున్నారని డెలాయింట్ హస్కిన్స్ సెల్స్ ఎల్ఎల్పీ సీనియర్ డైరక్టర్ ఎంఎస్ మణి చెప్పారు. మార్చి 31న జరిగే జీఎస్టీ సమావేశంలో ఈ అంశం చర్చకు వస్తుందని .. జీఎస్టీ శ్లాబులోని కనిష్ట పన్నును విధిస్తారా? లేక పస్తుతం అమలు చేస్తున్న భూమి కనిష్ట విలువపై పన్నును అనుమతిస్తారో వేచి చూడాలని అన్నారు. నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాలకు భూమి కనిష్ట విలువపై సేవా పన్ను విధించడం వల్ల సేవా పన్ను రేటు 18 శాతం నుంచి 8 శాతానికి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీపై ఎలాంటి వివాదం తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తుందని నగీనా అండ్ కో డైరక్టర్ రజత్ మోహన్ చెప్పారు. భూమి లీజు, భవనాల అద్దె, వ్యాపార సముదాయం, భవనాల నిర్మాణం, సివిల్ నిర్మాణాలకు జీఎస్టీ వర్తిస్తుందనే విషయం ప్రభుత్వం రూపొందించిన బిల్లుల్లో స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.


