సత్యం అసంపూర్ణం... అంతరార్థం అనంతం
ఈ కాలమ్ మీదే చర్చా వేదిక
మతం గురించి విననివారు, తెలియని వారు ఉండరు. పరమార్ధాన్ని గ్రహించే వ్యక్తి స్థాయిని బట్టి మత గ్రంథ రహస్యాలు తెలుస్తాయి. సామాన్యుని దృష్టిలో మతం అంటే పండుగలు, ఆచార సంప్రదాయాలు పాటించడం. అలాగే పండితుని గ్రంథ విశ్లేషణ వల్ల మతం అంతరార్థం, భావ ఘనత తెలుస్తాయి. అయితే ప్రధానంగా సామాన్యుడి వల్లనే మతాచరణ బలపడడం గానీ, బలహీన పడడం గానీ జరుగుతుంది. ఇందుకు నిదర్శనం గత కాలంలో బహు జనాదరణ పొందిన బౌద్ధమతం నేడు అల్పసంఖ్యాక మతంగా మిగిలిపోవడం. అంచేతే మతాల మధ్య పోలికలను వదిలి... పాండిత్యం కన్నా అర్థం మిన్న అని గమనించాలి. స్థూలంగా ఏ మత పరమార్థం అయినా రుజు మార్గాన్ని, సత్యమార్గాన్ని అనుసరించడమే.
పవిత్ర గ్రంథాలలో బయటకు కనిపించే అర్థం ఒకటి కాగా, రహస్యార్థం మరొకటి లోపల ఇమిడి ఉంటుంది. మహాయోగి అరవిందుడు ‘ఆన్ ది వేద’ గ్రంథంలో ఈ రహస్య విషయాలను వివరించాడు. ఉదాహరణకు ‘గో’ అనగా వెలుగు అని అర్థం. మనం అనుకునే గోపూజ అంటే వెలుగును పూజించడం అని భావించాలి. స్వామి వివేకానంద తన ‘రాజయోగ’ పుస్తకంలో మనస్తత్వ రీత్యా కొన్ని మాటల అంతరార్థాలను వివరించాడు. ఉదా: వేదకాల దైవం అయిన ఇంద్రుడు సోమరసం తాగినప్పుడు తన్మయత్వంలో అడిగినవి ఇస్తాడని భావన.
ఇది విపరీత, విడ్డూర ఆలోచన. వాస్తవానికి కోరికలు తీర్చేది మనస్సు. ఇంద్రియాలకు అధిపతి మనస్సు కనుక. ఇక్కడ ఇంద్రుడు అంటే మనసు అనుకోవాలి. ఇక దైవత్వం అంటే వైభవం, ప్రకాశనం. వైదిక మతం దైవాన్ని ఒకే ఆధ్యాత్మిక భావనతో సత్యం, జ్ఞానం, అనంతరం, ప్రజ్ఞ, అహం అని పలు విధాలుగా నిర్వచనాలు చెప్పింది. ఇలా విశ్లేషిస్తూ పోతే వేద సత్యాలు కూడా పూర్తి కాలేదు అనిపిస్తోంది. ఇంకా అర్థం చేయించవలసినవి రేపటి రుషులే రాయాలి.
- డాక్టర్ ఎ.వి.రత్నారెడ్డి, ఎం.ఎ., పీహెచ్.డీ
(రిటైర్డ్ రీడర్ ఇన్ పొలిటికల్ సైన్స్), ఎస్.ఎస్.ఎన్. కళాశాల, నరసరావుపేట
చిత్తూరు నుండి డి.ప్రభావతి రాసిన ‘అయినా... ఇంకా కాలుస్తూనే ఉన్నారు’ లేఖకు స్పందన...
సామాజిక సృహ ఉద్యమం మొదలు పెట్టాలి...
ప్రభావతిగారు ఎదుర్కొన్న సమస్యలాంటిదే చాలామందికి ఎదురవుతుంటుంది. బహిరంగ ధూమపాన సమస్య మాత్రమే కాదు... మరో సమస్య కూడా. పోస్టాఫీసులు, బ్యాంకులు, రైల్వే టికెట్టు కౌంటర్ల దగ్గర క్యూలలో నిల్చొని ఉన్నవారిని దాటి నేరుగా కౌంటర్ దగ్గరకు వెళ్లేవారిని ప్రశ్నిస్తే ఛీత్కారమే ఎదురవుతుంది. ‘స్వచ్ఛ భారత్’ మంచి ఆలోచనే. అయితే అంతకంటే ముందు ‘సామాజిక స్పృహ’ అనే ఉద్యమానికి ఊపిరి పోయాలి. ప్రతి వ్యక్తిలోనూ సామాజిక స్పృహ కలిగించే ప్రయత్నం చేయాలి. ‘సభ్యత’ అంటే ఏమిటి? అనే దాని గురించి ప్రచారకార్యక్రమాలు నిర్వహించాలి.
- తుమ్మల చిన్నపరెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్, తిరుపతి
పాఠకులకు ఆహ్వానం
‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ,
సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 . ఇ-మెయిల్: sakshireaders@gmail.com