breaking news
registration dept
-
విచారణ వలకు.. తిమింగలాలు చిక్కేనా?
► భూ అక్రమాలపై విచారణకు అధికారుల కసరత్తు ► అన్ని వివరాలతో రాష్ట్ర అధికారులకు సమగ్ర నివేదిక ► దాన్ని పరిశీలించాక.. వారంలో వేదిక నిర్ణయం ► స్కాముల సూత్రధారులందరూ టీడీపీ నేతలే ► అందుకే విచారణపై సర్వత్రా అనుమానాలు విశాఖ సిటీ: జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై ఈనెల 15న నిర్వహించనున్న బహిరంగ విచారణకు జిల్లా యంత్రంగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అవసరమైన నివేదికను గురువారం సాయంత్రం రాష్ట్ర రెవెన్యూ, భూపరిపాలన ప్రధాన కమిషనరేట్‌కు పంపింది. ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రాష్ట్ర స్థాయి అధికారులు బహిరంగ విచారణ వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై జిల్లా అధికారులకు వారం రోజుల్లో ఆదేశాలు జారీచేయనున్నారు. విమర్శలు వెల్లువెత్తడంతోనే.. రికార్డులు మార్చేసి.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై అధికార పార్టీ నేతలు సాగించిన 6 వేలకుపైగా ఎకరాల భూ దందాపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ఈ విచారణకు సిద్ధమైన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్వయంగా ఈ దందా వ్యవహారం బట్టబయలు చేయడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో బహిరంగ విచారణ కోసం ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సహా రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్ నుంచి సీనియర్ అధికారుల బృందం, సర్వే బృందం హాజరుకానుంది. ఇందుకు అవసరమైన నివేదికలు తయారు చేయడంలో రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. గురువారం సాయంత్రం నివేదికలను కమిషనరేట్‌కు పంపారు. ⇒ ఏఏ మండలాల్లో రికార్డులు గల్లంతయ్యాయి, దాని కారణాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ⇒పాత అసైన్మెంట్ భూములు, వాటిలో ఏవైనా నిర్మాణాలు జరిగి ఉంటే.. వాటికి సంబంధించిన పత్రాలు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వివరాలను పేర్కొన్నారు. ⇒గత ఆరు నెలలుగా ఈ తరహా కేసులు ఎన్ని వచ్చాయి. వాటిని ఎలా పరిష్కరించారు. జిల్లాలోని 43 మండలాల్లో ఎక్కడ ఎక్కువగా భూములకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయనే అంశాలను రెవెన్యూ శాఖకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. వారం రోజుల్లో వేదిక ప్రకటన జిల్లా యంత్రాంగం పంపిన ఈ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. బహిరంగ విచారణ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై సంబం«ధిత శాఖ అధికారులు ప్రకటిస్తారు. రెండు వారాల సమయం ఉన్న నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేలా వేదికను గుర్తించాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించే హాల్లో విచారణ చేపట్టాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులున్న నేపథ్యంలో ఈ సమావేశ మందిరం సరిపోదన్న వాదన కూడా ఉంది. రాష్ట్ర అధికారుల సూచన మేరకు విచారణ వేదికను ఎంపిక చేస్తామని వారి ఆదేశాల మేరకు సమయం, ప్రాంతాన్ని వెల్లడిస్తామని జాయింట్ కలెక్టర్ సృజన తెలిపారు. -
పైసలివ్వందే పని జరగదు!
► రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి చేపలు ► డాక్యుమెంట్ రైటర్లే బాసులు ► అందినకాడికి దండుకుంటున్నారు ► ఏసీబీ వలలో చిక్కిన కాకినాడ రిజిస్ట్రార్ బాలప్రకాశ్ ► గతంలో ఇక్కడ డీఐజీగా పని చేసిన వైనం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్.. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో ఇదీ ఒకటి. రెవెన్యూ ఏ స్థాయిలో వస్తుందో అదే స్థాయిలో అక్రమాలూ సాగుతున్నాయి. ప్రతి పనికీ ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల సాయంతో ‘మాఫియా’ను తలపిస్తున్నారు. గతంలో ఇక్కడ డీఐజీగా పని చేసిన బాలప్రకాశ్ కాకినాడలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో పడటం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇక్కడ పనిచేసిన సమయంలోనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లోనే ఏసీబీ వల పన్నినా తప్పించుకుని బదిలీపై వెళ్లిపోయారు. అనంతపురం టౌన్ : జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు అవినీతి, అక్రమాలకు నిలయంగా మారాయి. పైసలివ్వందే పని జరగదన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అనంతపురం, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లాలు ఉన్నాయి. అనంతపురం పరిధిలో గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, పామిడి, రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, అనంతపురం, అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, హిందూపురం పరిధిలో బుక్కపట్నం, చిలమత్తూరు, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, తనకల్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అనంతపురం, అనంతపురం రూరల్, ధర్మవరం, గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం, తాడిపత్రి, బుక్కపట్నం, చిలమత్తూరు, కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. వీటి పరిధిలోనే 250 నుంచి 300 మంది వరకు డాక్యుమెంట్ రైటర్లు పని చేస్తున్నారు. మెజార్టీ రైటర్లు వృత్తినే నమ్ముకొని ఉండగా.. కొందరు మాత్రం ‘వసూల్ రాజా’లుగా తయారవుతున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. పారిశ్రామికంగా పేరొందిన హిందూపురం ప్రాంతం బెంగళూరుకు సమీపంలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. అనంతపురంలోనూ ఇదే పరిస్థితి. మిగిలిన పట్టణ ప్రాంతాల్లోనూ సామాన్యులు భూములు, స్థలాలు కొనలేని పరిస్థితులు ఉన్నాయి. అలా వెళ్తేనే పని జరిగేది..!: రిజిస్ట్రేషన్ ఫీజును 7.5 శాతంగా పభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు చలానా తీస్తే అవసరమయ్యే స్టాంప్ పేపర్లను సరఫరా చేస్తారు. కానీ డాక్యుమెంట్ రైటర్లు చలానాకు పది శాతం వరకు అధికంగా పెంచేసి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇవి కాకుండా కార్యాలయ ఖర్చుల పేరుతో మరో రూ.వెయ్యి తీసుకుంటున్నారు. డాక్యుమెంట్లు తయారు చేసినందుకు రూ.1000 నుంచి రూ.1500 అదనంగా ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వకుంటే పని సజావుగా సాగనివ్వరు. కార్యాలయాల్లో అధికారులకు ఇవ్వాలని చెబుతూ నేరుగా వసూళ్లకు పాల్ప డుతున్నారు. అధికారులు కూడా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వెళ్లినవారికే పనిచేస్తున్నారు. అధికారులు, రైటర్లు, స్టాంప్‌వెండర్లు కలిసి నిలువునా దోచుకుంటున్నా..పట్టించుకునే వారు కరువయ్యారు. కార్యాలయాల్లో ప్రజల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అవి ఎక్కడా కనిపించడం లేదు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రజలకు వెసులుబాటు కలిగేలా ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తెచ్చినా ఫలితం లేకుండాపోతోంది. ఇక స్టాంపు వెండర్ల అక్రమాలకు సైతం చెక్ పడటం లేదు. అవసరాన్ని బట్టి అసలు ధరకంటే 20 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. అప్పుడు తప్పించుకుని..!: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అనంతపురం డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా పని చేసిన బాలప్రకాశ్ బుధవారం కాకినాడలో రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏడాది క్రితం ఈయన్ను కమిషనర్ అండ్ ఐజీ (హైదరాబాద్) కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ తర్వాత రివర్షన్పై కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా ఏసీబీకి దొరికారు. ఆయన రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు కల్గివున్నట్లు గుర్తించారు. ఆయన మన జిల్లాలో పని చేసిన సమయంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలున్న అధికారులపై విచారణ జరగకుండా చూడటం, ఫిర్యాదులొస్తే ఆ విషయాన్ని సదరు అధికారులకు చెప్పి వసూళ్లకు పాల్పడటం వంటివి చేసినట్లు తెలుస్తోంది. అప్పుడే ఏసీబీ అధికారులు దృష్టి సారించగా.. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయారు.