breaking news
red gram price
-
కంది రైతుల.. రంధి!
సాక్షి, హైదరాబాద్ : కంది రైతుకు కష్టాలు వచ్చిపడ్డాయి. మద్దతు ధరకు కందులు విక్రయించాలని భావిం చినా మార్క్‌ఫెడ్ అధికారుల తీరుతో అదిసాధ్యం కావట్లేదు. మార్క్‌ఫెడ్ అధికారులు కొర్రీలు పెడుతూ రైతులను రాచిరంపాన పెడుతున్నారన్న విమర్శలున్నాయి. దళారులను చేరదీసి వారినుంచి అక్రమం గా కందులు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులకు సహకరించాలని, కంది రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా మార్క్‌ఫెడ్ అధికారు లు మాత్రం సాకులు చెబుతూ రైతు పండిం చిన కందిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావట్లేదు. మరోవైపు అమ్మిన కందులకు డబ్బు లివ్వడంలోనూ మార్క్‌ఫెడ్ విఫలమవుతోంది. నాఫెడ్ నుంచి సొమ్ము రాబట్టలేకపోతోంది. ఆన్లైన్లో పేరు లేకుంటే కొనరా? వ్యవసాయ శాఖ గతేడాది ఎవరెవరు ఏ పంటలు పండించారన్న సమాచారం సేకరించింది. ఐతే ఆ లెక్కలు చాలావరకు కాకిలెక్కలా అన్న అనుమానాలు ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ఆ లెక్కలను ఆన్లైన్లో ఎక్కించారు. కందులు పం డించిన రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చాక, ఆన్లైన్లో వారి పేరుతో కంది పం డించారా లేదా పరిశీలిస్తారు. అయితే పోర్టల్‌లో ఆ రైతు వేరే పంట పండిం చారని ఉంటే, వెంటనే ఆ రైతును వెనక్కి పంపుతున్నారు. పోర్టల్‌లో పత్తి పండించినట్లుందని, కంది లేదని, కాబట్టి కందులు కొనుగోలు చేయబోమని చెప్పేస్తున్నారు. దీంతో రైతులు దళారులకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా సగం మంది రైతుల పేర్లు కంది పండించినట్లుగా లేకపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధికారుల జులుం.. మార్కెట్లో దళారులు క్వింటాలుకు రూ.4వేల నుంచి రూ.5 వేల కంటే ఎక్కువకు కొనట్లేరు. అటు మార్క్‌ఫెడ్ తీసుకోక, ఇటు దళారులు తక్కువ ధరకు అడుగుతుండటంతో కంది రైతు కన్నీరు పెడుతున్నాడు. పైగా ‘ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో’అని మార్క్‌ఫెడ్ అధికారులు జులూం ప్రదర్శిస్తున్నారని కొందరు రైతులు వాపోతున్నారు. పలువురు రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు చూపించినా, కంది పంటను సాగుచేసినట్లు అధికారుల ద్వారా ధ్రువీకరణ పత్రాలు తెచ్చినా మార్క్‌ఫెడ్ అధికారులు ససేమిరా అంటున్నారు. ఒకవేళ ఆన్లైన్ పోర్టల్‌లో సంబంధిత రైతు కంది పండించినట్లు పేరున్నా, అతను పండించినంతా కొనట్లేదు. తమకు కేంద్రం నిర్దేశించిన కోటా ప్రకారమే కొంటున్నామని, అంతా కొనలేమంటూ తేల్చేస్తున్నారు. ఆన్లైన్ సమస్యపై పలువురు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి స్వయంగా ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. సొమ్ము ఎప్పుడిస్తారో? రాష్ట్రంలో ఈసారి 2.07 లక్షల మెట్రిక్ టన్నుల కంది దిగుబడి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో కేంద్రం 47,500 మెట్రిక్ టన్నులు మాత్రమే మద్దతు ధరకు కొంటామని తేల్చిచెప్పింది. ఇంకా 56 వేల మెట్రిక్ టన్నులు కొనాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుసార్లు విజ్ఞప్తి చేసింది. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి అనుమతి రాలేదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రం కొనుగోలు చేసేది 47,500 మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగిలిన దాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా తాము కొంటామని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం ప్రకటించలేదు. అయితే మార్క్‌ఫెడ్ ఇప్పటివరకు 44,833 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసింది. వాటి విలువ రూ.260.04 కోట్లు. కానీ ఇప్పటివరకు రైతులకు రూ.29.69 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.230.35 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో రైతులు మార్క్‌ఫెడ్‌కు అమ్ముకున్నా సకాలంలో సొమ్ము రాకపోవడంతో దళారులను ఆశ్రయిస్తున్నారు. దళారులు రైతుల నుంచి రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. అదే దళారులు అనేకచోట్ల రైతుల నుంచి కొన్న కందులను మార్క్‌ఫెడ్‌కు మద్దతు ధర కింద రూ.5,800కు విక్రయిస్తున్నారు. దీనికి మార్క్‌ఫెడ్‌లో కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి. అందుకోసం కమీషన్ల రూపంలో దళారుల ఉంచి ముడుపులు వస్తున్నాయి. రైతును అడ్డం పెట్టుకొని అటు దళారి, ఇటు కొందరు మార్క్‌ఫెడ్ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. తిప్పి పంపేశారు: బాజా నాగేశ్వర్రావు, సింగారెడ్డిపాలెం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా మూడు ఎకరాల్లో పత్తి పంటలో అంతర్ పంటగా కంది వేశాను. దాదాపు 13 క్వింటాళ్ల కంది దిగుబడి వచ్చింది. వీటిని విక్రయించేందుకు 15 రోజుల క్రితం మార్కెట్ యార్డులోని కంది కొనుగోలు కేంద్రానికి వెళ్లాను. ఆన్లైన్లో నా పేరు లేదని, తిప్పి పంపారు. ఒకవేళ ఆన్లైన్లో పేరు నమోదైనా రెండున్నర క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏమీ చేయలేక దళారులకు విక్రయించాలని నిర్ణయించుకున్నాను. కొనుగోళ్లు నిలిపివేశారు: బెండే లక్ష్మణ్, వడ్డాడి గ్రామం, తాంసి మండలం, ఆదిలాబాద్ జిల్లా 4 ఎకరాల్లో పత్తి, కంది పంట సాగుచేశాను. కంది పంట 10 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. తాంసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రంలో విక్రయిద్దామనుకుంటే రెండు రోజులే కోనుగోలు చేసి నిలిపేశారు. మళ్లీ ఎప్పుడు కోనుగోలు కేంద్రాలను తెరుస్తారో చెప్పట్లేదు. దళారులకు అమ్ముకుందామంటే తక్కువ ధరకు అడుగుతున్నారు. జాబితాలో పేరు లేదని కొనట్లేదు: ఎం.రాంరెడ్డి, రైతు, మల్లారెడ్డిగూడ, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా ఈ ఏడాది 5 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. కందులు అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి వస్తే ఆన్లైన్ జాబితాలో కంది సాగు చేసినట్లు పేరు లేదని అధికారులు చెప్పారు. నీ కందులు ఇక్కడ కొనలేమని అంటున్నారు. నేను కంది సాగు చేస్తే నాపేరు లేకపోవడమేంటి? ఎవరు రాశారని అడిగితే వ్యవసాధికారులు ఇచ్చిన జాబితా మా దగ్గర ఉందంటున్నారు. ఇందులో పేర్లు ఉంటేనే కొనాలని మాకు అదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. రైతును ఇబ్బంది పెడితే ఎలా?: కె.క్రిష్ణారెడ్డి, రైతు, చేవెళ్ల గ్రామం, రంగారెడ్డి జిల్లా 10 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. దాదాపు 20 క్వింటాళ్లకు పైగానే దిగుబడి వచ్చింది. కానీ నా పేరు జాబితాలో లేదని కొనలేమని చెబుతున్నారు. నేను వేసిన కంది పంట పొలం చూపిస్తాను.. వచ్చి చూసుకోవాలని చెప్పాను. కంది పంట వేయకపోతే అభ్యంతరం చెప్పాలి కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులను ఇబ్బంది పెడితే ఎలా? రైతుల పేర్లు లేకపోతే ఈ కొనుగోలు కేంద్రం ఎందుకు పెట్టారు.. తీసేయండి. అధికారులకు నాయకులకు రైతుల ఇబ్బందులు కనిపించటం లేదా? ఆన్లైన్ సమస్య వాస్తవమే: చంద్రశేఖర్, మార్క్‌ఫెడ్ ప్రొక్యూర్మెంట్ అధికారి, హైదరాబాద్ ఆన్లైన్లో రైతుల పేర్లు లేకపోవడంతో సమస్య ఉంది. దీన్ని ఎలా పరిష్కరించాలన్న విషయంపై ప్రభుత్వానికి విన్నవించాం. మరోవైపు రైతుల నుంచి రూ.260 కోట్ల విలువైన కందులను కొనుగోలు చేశాం. వారికి ఇప్పటివరకు రూ.29.69 కోట్లు మాత్రమే ఇచ్చాం. ఇంకా నాఫెడ్ నుంచి రావాల్సి ఉంది. కేంద్రం పరిమితి విధించడంతో ఇప్పటికే దాదాపు 10 జిల్లాల్లో వారి కోటా పూర్తయింది. మిగిలినది కొనాలంటే కేంద్రం నుంచి అనుమతి రావాలి. అందుకోసం మరో 56 వేల మెట్రిక్ టన్నులు కొనాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. -
కందులు కొనేదేవరు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో పండించిన పంటలను కొనే దిక్కు లేకుండాపోయింది. పూర్తిస్థాయిలో రైతుల వద్ద కందులు కొనాల్సిన మార్క్‌ఫెడ్ సంస్థ అర్ధంతరంగా చేతులెత్తిసింది. దీంతో రైతులు పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కొనుగోలు చేసిన పంటకు కూడా నాణ్యత ప్రమాణాల పేరిట ఇబ్బందులకు గురి చేసిన మార్క్‌ఫెడ్ ఇక నుంచి కందుల కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన కందులను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక ఎంతకో కొంతకు ప్రైవేటులో అమ్ముకొని నష్టపోతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం లక్షా 90 వేల ఎకరాలు కాగా..ఇందులో దాదాపు 30 వేల ఎకరాల వరకు కంది సాగు చేశారు. దాదాపు లక్షా 88 వేల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని ఆదిలాబాద్, జైనథ్, ఇచ్చోడ, బోథ్, బేల, తాంసి, నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ కేంద్రాల్లో నాఫెడ్ ద్వారా కందులను మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జనవరి 22న కొనుగోళ్లు ప్రారంభించారు. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.5,675 చెల్లించారు. కానీ కనీసం నెల రోజులు కూడా కందులు కొనుగోలు చేయకుండా అర్ధంతరంగా నిలిపివేశారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 61,457.50 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. అయితే గతేడాది మార్క్‌ఫెడ్, నాఫెడ్ ద్వారా 3,81,729 క్వింటాళ్ల కందులు కొన్నారు. నాఫెడ్ ద్వారా 15,681 క్వింటాళ్లు, మార్క్‌ఫెడ్ ద్వారా 2,14,399 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు దిగుబడి వస్తుందన్న అంచనా వేసిన పంటలో ఈ ఏడాది కనీసం 50 శాతం కూడా కంది పంటను కొనుగోలు చేయకపోవడం గమనార్హం. అర్ధంతరంగా కొనుగోళ్లు నిలిపివేత జిల్లాలో మార్క్‌ఫెడ్ అధికారులు నాఫెడ్ ద్వారా 9 మార్కెట్ యార్డుల్లో కందుల కొనుగోళ్లను జనవరి 22 తర్వాత ప్రారంభించారు. సెలవు దినాలు వదిలేస్తే కనీసం 15 రోజులు కూడా కొనుగోలు చేయలేదు. హైదరాబాద్ మార్క్‌ఫెడ్ అధికారుల ఆదేశాల మేరకు 58 వేల క్వింటాళ్ల టార్గెట్ కాగా అదనంగా రెండు వేల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రైతుల వద్ద దాదాపు 80 వేల క్వింటాళ్లకు పైగా కందులు ఇంకా నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుండా శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నట్లు మార్క్‌ఫెడ్ అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం జైనథ్, బేల మార్కెడ్ యార్డులలో కొనుగోళ్లు నిలిపివేయడంలో రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. డబ్బులు చెల్లించని వైనం.. కంది పంటను కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్ అధికారులు ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా డబ్బులు చెల్లించలేదు. దీంతో కార్యాలయం చుట్టు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. పంటను కోసిన కూలీలకు డబ్బులు చెల్లించేందుకు అవస్థలకు గురవుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలో 61,150 క్వింటాళ్లకుగాను 34,70,68,812 డబ్బులు చెల్లించాల్సి ఉంది. కొనుగోలు చేసి 20 రోజులు గడుస్తున్నా అధికారులు డబ్బులు మాత్రం అకౌంట్లో జమ చేయకపోవడంతో రైతులు బ్యాంకులు, కార్యాలయం చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడుతున్నారు. రెండు రోజుల్లో జమచేస్తాం కొనుగోలు చేసిన కందులకు సంబంధించి రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమచేస్తాం. 61 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా నాఫెడ్ నుంచి రూ.17 కోట్లు వచ్చాయి. మిగతా డబ్బులు వచ్చిన వెంటనే జమ చేస్తాం. నాఫెడ్ ద్వారా 58 వేల క్వింటాళ్లను కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వగా 61వేల క్వింటాళ్లు కొనుగోలు చేశాం. రైతుల వద్ద ఉన్న కందులను కొనుగోలు చేసేందుకు ఉన్నతాధికారులకు నివేదించాం. అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాక మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తాం. – పుల్లయ్య, మార్క్‌ఫెడ్, మేనేజర్ ఆదిలాబాద్ -
కాసులు కురిపిస్తున్న కందులు, మినుములు
మోర్తాడ్, న్యూస్‌లైన్ : మార్కెట్లో కందులు, మినుముల ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నా యి. దీంతో ఈ పంటలు సాగుచేసిన రైతుల కు లాభాల పంట పండుతోంది. మన ప్రాం తంలో సాగు విస్తీర్ణం తగ్గడం, వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సీమాంధ్ర లో పంట నీటిపాలు కావడంతో మార్కెట్లో ఈ పంటలకు డిమాండ్ పెరిగింది. దీంతో కందులు, మినుములను సాగుచేసిన రైతులకు ఈ రెండు పంటలు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అంతర పంటగా సాగు... పసుపు, సజ్జ, ఎర్రజొన్న సాగుచేసే భూము ల్లో కంది పంటను అంతర్ పంటగానే రైతు లు సాగుచేస్తున్నారు. పంట పొలాల ఒడ్ల వెంబడి కంది పంటను సాగుచేయడం ఎం తో కాలంగా జరుగుతోంది. మినుము పం టను మాత్రం రైతులు ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు.బాల్కొండ,మోర్తాడ్,కమ్మర్పల్లి, వేల్పూర్, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి మండలాల్లో కందులు, మినుములను రైతులు ఈ సీజనులో తక్కువ విస్తీర్ణంలో సాగుచేశారు. ధరలిలా.. గతంలో క్వింటాలు మినుములకు రూ.3 వేల ధర పలికింది. ఈ ఏడాది ఏకంగా రూ.వెయ్యి ధర పెరిగింది. మినుములను నిజామాబాద్ మార్కెట్లోని వ్యాపారులు క్వింటాలుకు రూ.4 వేల ధర చెల్లిస్తున్నారు. కందులకు గతేడాది క్వింటాలుకు రూ.2,800 ధర లభించింది. ఈసారి క్వింటాలు కందులకు రూ.3 వేల నుం చి రూ.3,700 ధర పలుకుతోంది. రబీ సీజను లో కూడా పప్పు ధాన్యాలను సాగుచేసే వీలు ఉన్నా ఎక్కువ మంది రైతులు సజ్జ, ఎర్రజొన్న పంటలకు ప్రాధాన్యం ఇచ్చారు. సజ్జ, ఎర్రజొన్న పంటలకు సీడ్ వ్యాపారులు ఎక్కువ ధర చెల్లించడానికి గ్రామాలలో ధర ఒప్పందం చేసుకుంటున్నారు. దీంతో రైతులు కూరగాయలు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. దీంతో నిజామాబాద్ మార్కెట్‌కు విక్రయానికి తక్కువ పరిమాణంలో మినుములు, కందుల వస్తున్నాయి. మార్కెట్లో పప్పు ధాన్యాలకు ధర పెరగడంతో ముందు, ముందు పప్పుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రైతులకు పప్పు ధాన్యాల మద్దతు ధరను ప్రభుత్వం పెంచిన కారణంగా పప్పుల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. కందులు, మినుములకు భారీగా ధర పలుకుతుండటంతో రైతులు వీటిని నిలువ ఉంచకుండానే విక్రయిస్తున్నారు. వ్యాపారులు పోటీపడి నగదు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.