breaking news
rate erosion
-
నిత్యావసరాల ధరల మంట
♦ 5.76%కి రిటైల్ ద్రవ్యోల్బణం ♦ రెండేళ్ల గరిష్ట స్థాయి... ఆర్బీఐ రేటు కోత లేనట్లే న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరల తీవ్ర స్థాయిని మే రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015 మేతో పోల్చితే 2016 మేలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 5.76 శాతం పెరిగింది. కూరగాయలు సహా ఇతర ఆహార ఉత్పత్తుల ధరల తీవ్రత దీనికి కారణం. ఈ రేటు రెండేళ్ల గరిష్ట స్థాయి. తాజా డేటా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తదుపరి రెపో రేటు (ప్రస్తుతం 6.5 శాతం) కోత అవకాశాలకు విఘాతం కలిగించే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. 2015లో ఈ రేటు 5.01 శాతంగా ఉంది. కొన్ని ఉత్పత్తుల ధరలు చూస్తే... ♦ ఆహార విభాగంలో... రేటు 7.55 శాతం ఎగిసింది. ఇందులో వేర్వేరుగా కూరగాయల ధరలు 2015 మే ధరలతో పోల్చిచూస్తే... 2016 మేలో 10.77 శాతం ఎగిశాయి. 2015 ఏప్రిల్లో ఈ పెరుగుదల రేటు 4.82 శాతం. గుడ్ల ధరలు ఏప్రిల్లో 6.64 శాతం పెరిగితే, మేలో ఈ రేటు ఏకంగా 9.13 శాతం ఎగిసింది. మాంసం, చేపల ధరలు 8.67 శాతం ఎగిశాయి. పప్పు దినుసుల ధరలు 32 శాతం ఎగిశాయి. చక్కెర ధర పెరుగుదల 14 శాతం. సుగంధ ద్రవ్యాల ధరలు 10 శాతం పెరిగాయి. పాల ధరలు 4 శాతం పెరిగాయి. ♦ దుస్తులు, పాదరక్షల ధరల పెరుగుదల రేటు 5.37 శాతంగా ఉంది. ♦ హౌసింగ్ విషయంలో రేటు 5.35 శాతంగా ఉంది. ♦ ఇంధనం, లైట్ విభాగంలో రేటు 3 శాతం. -
పొదుపు పథకాలపై రేటు కోత మంచిదే: నొమురా
న్యూఢిల్లీ: చిన్న పొదుపులపై వడ్డీరేట్ల తగ్గింపు అటు ప్రభుత్వానికి, ఇటు బ్యాంకులకు తగిన ప్రయోజనాన్నే కల్పిస్తాయని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నొమురా అంచనా వేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం కోరుకుంటున్నట్లు... బ్యాంకులు తమ కు అందిన రెపో రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడానికి ఈ చర్య దోహదపడుతుందని పేర్కొంది. ఈ ప్రయోజనం ఏప్రిల్-జూన్ మధ్య ప్రధానంగా వ్యవస్థలో కనిపిస్తుందని అంచనా వేసింది. కాగా చిన్న పొదుపు మొత్తాలపై రేటును తగ్గించడంవల్ల... వీటిలోకి వచ్చే డబ్బు తగ్గే అవకాశం ఉందని నొమురా విశ్లేషించింది. దీనితో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక అవసరాలకు మార్కెట్ రుణాలపై అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని పేర్కొంది. చిన్న పొదుపులపై రేటు కన్నా తక్కువగా ఇక్కడ (మార్కెట్ రుణాలు) తక్కువ వడ్డీ రేటు ఉన్నందువల్ల... ప్రభుత్వాలపై వడ్డీభారం తగ్గే వీలుందని విశ్లేషించింది. కాగా దిగువస్థాయి వడ్డీరేట్ల వల్ల దీర్ఘకాలంలో కస్టమర్లు, కార్పొరేట్లు కూడా ప్రయోజనం పొందుతారని... వెరసి ఈ ప్రక్రియ మొత్తం చక్కటి వృద్ధికి దారితీస్తుందని నొమురా అంచనావేసింది.