breaking news
Rat hunt
-
చికెన్, పోర్క్ వద్దు.. ఎలుక మాంసమే ముద్దు!
గువాహటి : పంట పొలాలను నాశనం చేస్తూ నష్టం కలిగిస్తున్న ఎలుకలతో అసోంలోని కుమరికటా గ్రామ రైతులు, కూలీలు సరికొత్త వ్యాపారం మొదలుపెట్టారు. పంటను రక్షించుకునే క్రమంలో వెంటాడిన ఎలుకలను అమ్మడం ద్వారా ఆదాయం పొందుతున్నారు. దీంతో ఆదివారం వచ్చిందంటే చాలు అక్కడి మార్కెట్ ఎలుక మాంసం కొనేవారితో కిటకిటలాడుతోంది. కోడి, పంది మాంసం కన్నా రోస్ట్ చేసిన, అప్పుడే పట్టిన ఎలుకలకు మంచి గిరాకీ ఉంటోందని విక్రయదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలుక మాంసానికి డిమాండ్ బాగా పెరిగిందని.. కిలో 200 రూపాయలు వెచ్చించి మరీ కొనుగోలు చేయడంతో ధాన్యం అమ్మితే వచ్చే సొమ్ము కంటే కూడా ఎలుకల ద్వారానే మంచి ఆదాయం లభిస్తోందని సాంబా సోరెన్ అనే రైతు తెలిపాడు. -
ఎలుకల కోసం ఆస్పత్రి మూడు రోజులు మూత!
మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఓ ఆస్పత్రిలో ఎలుకలు రాజ్యమేలుతున్నాయి. వాటిని పట్టుకోవడం కోసం ఏకంగా మూడు రోజుల పాటు ఆ ఆస్పత్రిని మూసేస్తున్నారు. ఇప్పటికి ఆ ఆస్పత్రిలో దాదాపు 3,500 ఎలుకలను పట్టేశారు. అయితే.. ఇంకా దాదాపు 50 వేల వరకు మూషికాలు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో కిచకిచమంటూ తిరుగుతూనే ఉన్నాయి. భోపాల్ లోని మహారాజా యశ్వంతరావు ఆస్పత్రిని త్వరలోనే పూర్తిస్థాయిలో మార్చబోతున్నారు. దానికి ముందుగా మంగళవారం నాడు ఈ ఎలుకల నియంత్రణ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎలుకలు పట్టే కాంట్రాక్టును లక్ష్మీ ఫ్యుమిగేషన్ కంపెనీకి అప్పగించారు. ఈ కాంట్రాక్టు విలువ 54 లక్షల రూపాయలు!! ముందుగా 10వేల కలుగులను ఈ కంపెనీ గుర్తించింది. తొలిదశలో వాటివద్ద విషపూరిత ఆహారపు ఎరలు పెట్టారు. దాంతో 3,500 ఎలుకలను చంపగలిగారు. రోజుకు రెండుసార్లు ఈ ఎరలను మారుస్తూ ఉంచుతున్నారు. ఎలుకలు చాలా తెలివైనవి. పక్కజీవి ఏదైనా తిని చనిపోయిందంటే.. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ముట్టదు. అందుకే వాటికోసం మెనూ మారుస్తూ.. బెల్లం, సమోసాలు, కచౌరీలు, వేరుశనగ ఉండలు అన్నీ పెడుతున్నారు. ఇక రెండోదశలో వాటి కలుగుల్లోకి విష వాయువులను పంపుతారు. ఆ సమయంలో పేషెంట్లను ఉండనివ్వరు. అందరినీ బయటకు పంపేస్తారు. అలా.. ఎలుకలను పట్టాలని భారీ యజ్ఞమే తలపెట్టారు.