breaking news
Rasnepht
-
ఓవీఎల్ - వాంకోర్ డీల్ కు రష్యా ఆమోదం
♦ 15 శాతం వాటాల కొనుగోలుకు ఓకే ♦ జూన్‌లోగా పూర్తి కానున్న ప్రక్రియ న్యూఢిల్లీ: రష్యా చమురు దిగ్గజ కంపెనీ రాస్‌నెఫ్ట్ నుంచి వాంకోర్ చమురు క్షేత్రంలో ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్) 15% వాటాలు కొనుగోలు చేసే డీల్‌కు రష్యా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి అక్కడి ఫెడరల్ యాంటీమోనోపొలీ సర్వీస్ (ఎఫ్ఏఎస్) నుంచి అనుమతులు లభించినట్లు ఓవీఎల్ ఎండీ నరేంద్ర కె వర్మ తెలిపారు. ఇక వాంకోర్ క్షేత్ర డెవలపింగ్ సంస్థ వాంకోర్‌నెఫ్ట్‌లో తమకు బోర్డు పదవులు కేటాయిస్తుందని, తద్వారా కంపెనీని విక్రయ సంస్థ రాస్‌నెఫ్ట్ పునర్వ్యవస్థీకరిస్తుందని ఆయన వివరించారు. ఈ ప్రక్రియంతా జూన్ నాటికి పూర్తి కాగలదని అంచనా. ఓఎన్జీసీ ఇప్పటిదాకా కుదుర్చుకున్న అతి పెద్ద డీల్స్‌లో వాంకోర్ది నాలుగోది అవుతుంది. సుమారు 1.268 బిలియన్ డాలర్ల విలువ చేసే 15% వాటాల కొనుగోలుకు ఓవీఎల్ గతేడాది సెప్టెంబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని 26 శాతానికి పెంచుకునేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. అదనంగా వాటాల కొనుగోలుకు కూడా ఎఫ్ఏఎస్ నుంచి ఆమోదముద్ర అవసరమా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదని వర్మ పేర్కొన్నారు. -
రష్యాలో దేశీ సంస్థల చమురు వేట
♦ రాస్‌నెఫ్ట్‌కు చెందిన రెండు క్షేత్రాల్లో వాటాల కొనుగోలు ♦ ఒప్పందాలు కుదుర్చుకున్న ఐవోసీ కన్సార్షియం, ఓఎన్జీసీ విదేశ్ ♦ డీల్స్ విలువ దాదాపు రూ. 28,253 కోట్లు న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఆయిల్ కంపెనీలు.. విదేశాల్లో చమురు క్షేత్రాలను దక్కించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. రష్యన్ సంస్థ రాస్‌నెఫ్ట్‌కు సైబీరియాలో ఉన్న రెండు చమురు క్షేత్రాల్లో వాటాలు కొనుగోలు చేశాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సారథ్యంలోని కన్సార్షియం, ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్) ఇందుకు సంబంధించి బుధవారం ఒప్పం దాలు కుదుర్చుకున్నాయి. ఈ డీల్స్ విలువ 4.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 28,253 కోట్లు). టాస్-యురియాఖ్(టీఎన్కే-బీపీ) చమురు క్షేత్రం లో 29.9% వాటాల కోసం ఐవోసీ, ఆయిల్ ఇండియాతో పాటు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) విభాగం.. రాస్నెఫ్ట్తో సేల్ పర్చేజ్ అగ్రిమెంటు (ఎస్పీఏ) కుదుర్చుకున్నాయి. ఈ డీల్ విలువ 1.28 బిలియన్ డాలర్లని అధికారులు తెలిపారు. ఇక ఇదే కన్సార్షియం వాంకోర్ క్షేత్రంలో 23.9% వాటాల కోసం రాస్నెఫ్ట్తో మరో ఒప్పందం కుదుర్చుకుంది. వాంకోర్లోని సుజున్స్కోయ్, టాగుల్స్కోయ్, లోడోష్నోయ్ క్షేత్రాల అభివృద్ధిలో వాటాలు తీసుకునే అంశాన్ని పరిశీలించేలా ఇంకో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. వాంకోర్‌లో ఓవీఎల్ వాటాల పెంపు.. అటు వాంకోర్ క్షేత్రంలో ఓవీఎల్ తన వాటాలను 26 శాతానికి పెంచుకునేందుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇందుకోసం అదనంగా 925 మిలియన్ డాలర్లు చెల్లించనుంది. గతేడాది సెప్టెంబర్‌లోనే 1.26 బిలియన్ డాలర్లు వెచ్చించి.. వాంకోర్‌లో ఓవీఎల్ 15 శాతం వాటాలు కొనుగోలు చేసింది. రాస్‌నెఫ్ట్ సీఈవో ఐగర్ సెషిన్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా రెండో రోజున ఈ ఒప్పందాలు కుదిరాయి. రష్యా చమురు ఉత్పత్తి రంగంలో భారత సంస్థలు భాగస్వాములయ్యేందుకు ఈ డీల్స్ దోహదపడగలవని, అదే సమయంలో ఇక్కడి మార్కెట్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ఉపయోగపడగలవని విలేకరుల సమావేశంలో సెషిన్ తెలిపారు. క్షేత్రాల ప్రత్యేకతలివీ.. టాస్-యురియా ఆయిల్‌ఫీల్డ్‌లో వెలికితీయతగ్గ చమురు నిక్షేపాలు 137 మిలియన్ టన్నుల మేర ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో నుంచి రోజుకు 20,000 బ్యారెళ్లు (బీపీడీ) ఉత్పత్తవుతోంది. ఇది రెండేళ్లలో 1,00,000 బీపీడీకి పెరగగలదని అధికారులు తెలిపారు. భవిష్యత్ పెట్టుబడి వ్యయాల్లో తమ వాటా కింద ఐవోసీ-ఆయిల్-భారత్ పెట్రోరిసోర్సెస్ మరో 180 మిలియన్ డాలర్లు చెల్లించనున్నట్లు వివరించారు. రాస్‌నెఫ్ట్ గతేడాది 750 మిలియన్ డాలర్లకు టాస్-యురియాలో 20% వాటా విక్రయించింది. ఇక భారత కంపెనీలతో డీల్ తర్వాత ఈ ప్రాజెక్టులో రాస్‌నెఫ్ట్‌కు 50.1 శాతం వాటాలు ఉంటాయి. మరోవైపు, వాంకోర్‌లో వెలికితీయతగ్గ చమురు నిక్షేపాలు 2.5 బిలియన్ బ్యారెళ్లు ఉన్నాయి. ఇందులో ఇంతక్రితం కొన్న 15 శాతం వాటాతో ఓవీఎల్‌కు ఏటా 3.3 మిలియన్ టన్నుల ఆయిల్ దక్కుతోంది. తాజా డీల్స్‌తో ఓవీఎల్ , ఐవోసీ కన్సార్షియంలు మొత్తం 49.9 శాతం వాటాలు దక్కించుకున్నాక భారత్‌కు 12 మిలియన్ టన్నుల చమురు అందుబాటులోకి రానుంది. అలాగే ఈ క్షేత్రంలో రాస్‌నెఫ్ట్ వాటా 50.1 శాతానికి పరిమితమవుతుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు ఎదుర్కొంటున్న రాస్‌నెఫ్ట్.. రుణభారాన్ని తగ్గించుకునేందుకు చమురు క్షేత్రాల్లో వాటాలు విక్రయిస్తోంది. -
ఎస్సార్ ఆయిల్లో రోస్నెఫ్ట్కు వాటాలు
49% కొనుగోలుకు ప్రాథమిక ఒప్పందం ముంబై : రష్యాకు చెందిన ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం రాస్‌నెఫ్ట్ తాజాగా ఎస్సార్ ఆయిల్లో 49 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి ఎస్సార్ గ్రూప్‌తో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీని ప్రకారం ఎస్సార్ గ్రూప్‌నకు చెందిన వడినార్ ఆయిల్ రిఫైనరీలో దాదాపు 49 శాతం దాకా వాటాలను రాస్‌నెఫ్ట్ దక్కించుకుంటుంది. ఒప్పందం విలువ సుమారు 6 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. డీల్‌లో భాగంగా పదేళ్ల పాటు రిఫైనరీకి ఏటా 10 మిలియన్ టన్నుల ముడిచమురును సరఫరా చేస్తుంది. దీంతో భారత రిఫైనింగ్, రిటైల్ మార్కెట్లో రాస్‌నెఫ్ట్ ప్రవేశించడానికి మార్గం సుగమం కానుంది. అలాగే, కొన్నేళ్ల పాటు తమ ముడిచమురు విక్రయాలకు ఢోకా లేకుండా చూసుకోవడానికి వీలవుతుంది. మరోవైపు, డీల్ కింద వడినార్ రిఫైనరీ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు, 2020 నాటికి దీన్ని 45 ఎంటీపీఏ స్థాయికి చేర్చనున్నట్లు రాస్‌నెఫ్ట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎస్సార్ అయిల్‌కు భారత్‌లో 1,600 రిటైల్ బంకులు ఉండగా, వచ్చే రెండేళ్లలో వీటిని 5,000కు పెంచే అవకాశాలు ఉన్నట్లు వివరించాయి. ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపకులకు ఎస్సార్ ఆయిల్లో 90.5 శాతం మేర వాటాలు ఉన్నాయి. ఎస్సార్ తమ వడినార్ రిఫైనరీకి కావల్సిన ముడిసరుకు కోసం (రోజుకి 4,00,000 బ్యారెల్స్ (బీపీడీ)) ఎక్కువగా ఇరాన్‌పై ఆధారపడాల్సి వస్తోంది. తాజా డీల్‌తో కొంత మేర రష్యా చమురు అందుబాటులోకి వచ్చినా.. అధిక రవాణా వ్యయాలు తదితర అంశాల కారణంగా లాభదాయకతపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.