breaking news
rare coin
-
అర్ధశతాబ్దం భూగర్భంలో.. నేడు కళ్లు చెదిరే ధరలో!
అవన్నీ అరుదైన నాణేలు. కొన్ని అయితే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా వేలానికి రాలేదు. మరికొన్ని నాణేలను చరిత్రకారులు కూడా ఎన్నడూ చూడలేదు. ఇంతటి విశేషాలున్న పురాతన నాణేలు ఇప్పుడు వేలంపాటకు వచ్చాయి. వీటిని దక్కించుకోవాలంటే దాదాపు రూ.860 కోట్లు చెల్లించాల్సి రావొచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంత రేటు పలుకుతున్న ఈ నాణేల కథాకమామిషు ఓసారి చూద్దాం.ఒక ట్రావెలర్ కథ.. ప్రపంచంలోనే 100 వేర్వేరు ప్రాంతాలకు చెందిన అరుదైన నాణేలను మే 20వ తేదీన స్విట్జర్లాండ్‌లో వేలం వేయనున్నారు. అన్నింటినీ ఒకేసారిగా కాకుండా మూడేళ్లకాలంలో కొద్ది కొద్దిగా వేలంలో విక్రయించనున్నారు. దాదాపు 15,000 నాణేలను ఏకంగా 50 సంవత్సరాలపాటు ఎవరికీ దక్కకుండా భూగర్భంలో దాచేసి తర్వాత బయటకు తీయడంతో ఇప్పుడీ నాణేల గురించి చర్చ మొదలైంది. యూరప్‌కు చెందిన ఒక వ్యక్తి గతంలో అమెరికాలో స్థిరపడ్డాడు. అత్యంత దారుణమైన స్టాక్‌మార్కెట్ (Stock Market) పతనంగా చరిత్రలో నిలిచిపోయిన ‘1929 వాల్‌స్ట్రీట్ క్రాష్’ ఉదంతం తర్వాత మదుపరులు స్టాక్‌మార్కెట్‌పై నమ్మకం కోల్పోయారు. అంతా బంగారం కొనడంపై దృష్టిపెట్టారు. అదే సమయంలో ఇతను సైతం తొలుత బంగారు కొన్నాడు. తర్వాత పాత నాణేలను కొని వాటిని అధిక ధరలకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అలా తన బంగారు నాణేల కొనుగోలు ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు.1930వ దశకంలో భార్యతో కలిసి ప్రపంచయాత్ర మొదలెట్టి ఎన్నో దేశాల్లో అరుదైన నాణేలను సేకరించడం మొదలెట్టాడు. ఎక్కువగా అమెరికా, యురప్ ప్రాంతాల నాణేలను సేకరించారు. ప్రతి నాణెం ప్రత్యేకత, విశిష్టతలను రాసిపెట్టుకున్నాడు. తర్వాత ఈ జంట యూరప్‌లో స్థిరపడింది. అయితే యూరప్‌ను అడాల్ఫ్ హిట్లర్ సారథ్యంలోని నాజీ పార్టీ దురాక్రమిస్తుండటంతో భయపడిపోయి తమ నాణేలను సురక్షితంగా దాచాలని భావించారు. 15,000 నాణేలను వేర్వేరుగా సిగార్ పెట్టెల్లో పెట్టి వాటిని అల్యూమినియం డబ్బాల్లో నింపి భూమిలో పాతిపెట్టారు. వాటిని దాచిన రహస్యప్రాంతం జాడను తమ కుటుంబసభ్యులకు మాత్రం చెప్పారు. అలా ఆ నాణేలు ఏకంగా 50 సంవత్సరాలపాటు భూమిలోనే ఉండిపోయాయి. ఇటీవల వాళ్ల వారసులు వాటిని బయటకు తీసి కొంతకాలం బ్యాంక్ లాకర్లో దాచారు. తాజాగా వేలం సంస్థకు అప్పగించారు. స్విట్లర్లాండ్‌లోని నమిస్మాటికా ఆర్స్ క్లాసికా వేలం సంస్థ వీటిని వేర్వేరు లాట్లుగా వేలం(Auction) వేయనుంది. ఎన్నెన్నో అరుదైన బంగారు నాణేలుదాదాపు 80 సంవత్సరాలుగా ఎవ్వరూ చూడని అరుదైన బంగారు నాణేలు (Gold Coins) ఈ ‘ట్రావెలర్ కలెక్షన్’లో ఉన్నాయి. 1629లో ముద్రించిన ‘100’డ్యూకాట్ ఫెర్డినాడ్–3 రాజు బంగారు నాణెం సైతం ఇందులో ఉంది. ఫెర్డినాడ్–3 రాజు చెక్ రాజ్యం, క్రొయేషియా, హంగేరీ, ఆస్ట్రియాలకు పాలించారు. స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఈ నాణెం బరువు ఏకంగా 348.5 గ్రాములు. ఆనాడు యూరప్‌లో ముద్రించిన అతిబరువైన నాణేల్లో ఇదీ ఒకటి. ఇరాన్లో 18వ శతాబ్దం చివర్లో, ఆఘా మొహమ్మద్ ఖాన్ ఖాజర్ కాలంలో ఇస్ఫమాన్, టెహ్రాన్లలో ముద్రించిన టోమాన్ బంగారు నాణేలు సైతం ఈయన కలెక్షన్లో ఉన్నాయి.చదవండి: పాస్‌పోర్టు మర్చిపోయిన పైలట్.. విమానం యూటర్న్!‘‘ఏమాత్రం పాడవకుండా కొత్తగా ఉన్న ఈ నాణేలు చరిత్రలోని ఎన్నో విశేషాలను మనకందిస్తాయి. మా వేలం సంస్థ కీర్తినీ పెంచుతాయి’’అని వేలం సంస్థ డైరెక్టర్ ఆర్టురో రూసో అన్నారు. ‘‘ఈ రకం డిజైన్ నాణేలను నేనెప్పుడూ చూడలేదు. ఇలాంటి నాణేలు గత 80 ఏళ్లలో ఎక్కడా వేలానికి రాలేదు’’ అని కలెక్షన్ కన్సల్టెంట్ డేవిడ్ గెస్ట్ అన్నారు. ప్రమాదంలో అలనాటి ఏథెనా పాథినోస్ బంగారు శిల్పం కరిగిపోగా వచ్చిన బంగారం నుంచి క్రీస్తుపూర్వం 296 ఏడాదిలో తయారుచేసిన నాణేన్ని సైతం వేలానికి ఉంచారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అపూరూప కలెక్షన్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): చరిత్రకు సాక్ష్యాలు స్టాంపులు, నాణేలు. వివిధ దేశాలకు చెందిన నాణేలు, స్టాంపులను సేకరించి ఎన్నో ప్రదర్శనలిచ్చారు నగరానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి అమ్ము కృష్ణారావు. 1978లో ఆయన కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను సందర్శించారు. ఆ సమయంలో గంగా నదిలో నేపాల్ దేశానికి చెందిన 2 పైసలు, చిన్న సైజు కోడిగుడ్డు ఆకారంలో ఉన్న నున్నని రాయి ఆయనకు దొరికాయి. నేపాల్ 2 పైసల మీద ఆవు, ఎవరెస్ట్ శిఖరం, త్రిశూలం, ఢమరుకం గుర్తులు ఉండడంతో ఆ నాణేన్ని, రాయిని తన పూజ గదిలోకి చేర్చారు. అంతకుముందు 1972లో హైదరాబాద్‌లో నివసిస్తున్న సమయంలో రోజువారీ ఖర్చులు పోనూ మిగిలిన చిల్లర నాణేల్లో బొమ్మలున్న వాటిని పక్కన పెట్టడం అలవాటు చేసుకున్నారు. 1984లో సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో టెక్నీషియన్ గ్రేడ్–3గా టిట్లాఘడ్లో రైల్వేలో కృష్ణారావు ప్రస్థానం ప్రారంభించారు. 1985లో కుటుంబంతో కలిసి దక్షిణ భారత యాత్ర చేస్తున్న సమయంలో రామేశ్వరంలో శ్రీలంక నాణేలు కొన్ని దొరికాయి. అలా నాణేల సేకరణ పట్ల ఆకర్షితులై నాటి నుంచి నేటి వరకు వందల సంఖ్యలో నాణేలను ఆయన సంపాదించారు. 1990లో విశాఖపట్నం డీజిల్ లోకో షెడ్‌కు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఏటా జరిగే విశ్వకర్మ పూజ రోజున ఈ నాణేలను ప్రదర్శించేవారు కృష్ణారావు. 2000లో వారణాసిలోని ఓ ఆలయ ప్రాంగణంలో నేలపై వెండి నాణేలు తాపడం చేసి ఉండడం చూసిన ఆయన తన దృష్టిని అటు వైపుగా సారించారు. ఇంకా ఎంతో సాధించాల్సింది ఉందని ఆ రోజు తెలుసుకున్నారు. అప్పుడే విశాఖపట్నంలోని న్యూమిస్మాటిక్ అండ్ ఫిలాటెలిక్ అసోసియేషన్‌లో జీవితకాల సభ్యుడిగా చేశారు. నాణేలు, కరెన్సీ సేకరణలో మెళకువలు నేర్చుకున్నారు. 2022 ఏప్రిల్ 30న ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా రిటైర్ అయ్యారు. రైల్వేపై ఆసక్తి ఇలా... ఇలా సాగిపోతున్న సమయంలో 2003లో నాగ్‌పూర్ పోస్ట్ ఆఫీస్‌లో 150 ఏళ్ల భారతీయ రైల్వేల ప్రస్థానంపై విడుదల చేసిన ప్రత్యేక స్టాంప్, మినీయేచర్ షీట్‌ను ఆయన చూశారు. అప్పుడే రైల్వే మీద విడుదల చేసిన స్టాంపుల సేకరణ మొదలుపెట్టారు. రైల్ జర్నీ త్రూ పోస్టల్ స్టాంప్స్ అనే పేరుతో 2004లో నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొని రజత పతకం కైవసం చేసుకున్నారు. 2007లో చెన్నైలో జాతీయస్థాయి ప్రదర్శనలో రజతం, 2011లో న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. దీనికి కొనసాగింపుగా రైల్వే టోకెన్లు, నాణేలు, కరెన్సీ మొదలైనవి సేకరించారు. వీటితో సుమారు 100 ప్రదర్శనలిచ్చి ఎన్నో ప్రశంసలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు కృష్ణారావు. ఇవే కాకుండా... ఇవి మాత్రమే కాకుండా బ్రిటిష్ ఇండియా కాయన్ల కలెక్షన్ ఆయన వద్ద ఉంది. 1835 నుంచి 1947 వరకు గల వివిధ నాణేలను ఆయన సేకరించారు. 1950 నుంచి నేటి వరకు అన్ని మింట్లు విడుదల చేసిన నాణేలు ఆయన వద్ద ఉన్నాయి. స్మారక నాణేల సెట్, 1, 2, 5, 20 రూపాయల కరెన్సీ, సిగ్నేచర్, ఇన్సెట్, ప్రిఫిక్స్ ప్రకారం సేకరించారు. స్టార్ నోట్స్ 1, 10, 20, 50, 100, 200 ఆయన కలెక్షన్లో చేరాయి. అమృతోత్సవాల్లో సైతం... ఇటీవల వాల్తేర్ డివిజన్ నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో కృష్ణారావు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాపూజీ జీవిత విశేషాలతో కూడిన 200 ప్రత్యేక ఫొటోలతో ఎగ్జిబిషన్, స్టాంపుల, నాణేల ప్రదర్శనను ఆయన ఏర్పాటు చేశారు. దీనిని తిలకించిన డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్ కుమార్ సత్పతి కృష్ణారావును ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా? -
సచిన్ గౌరవార్ధం అరుదైన నాణెం విడుదల
లండన్: క్రికెట్ రంగానికి సచిన్ అందించిన సేవలకు గుర్తుగా బ్రిటన్ కు చెందిన వ్యాపారస్థంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓ అరుదైన బంగారు నాణాన్ని విడుదల చేసింది. సచిన్ గౌరవార్ధం 12 వేల పౌండ్ల స్టెర్లింగ్ విలువ కలిగిన నాణానికి పూర్తి చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉంటాయని ఈస్ట్ ఇండియా కంపెనీ వెల్లడించింది. 24 ఏళ్ల కెరీర్ లో క్రికెట్ కు అత్యత్తమ సేవలందించినందుకుగాను అరుదైన నాణాన్ని విడుదల చేసామని ఈస్ట్ ఇండియా కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అతి తక్కవ మంది మాత్రమే ఇప్పటి వరకు చూసిన 200 గ్రాముల బరువుతో ఉండే 210 బంగారు నాణాలు విడుదల చేశామన్నారు. అందమైన బాక్సులో అమర్చిన నాణెంతోపాటు అధికారిక ధ్రువపత్రంతోపాటు సచిన్ ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్ ను అందిస్తున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ రంగానికి తాను చేసిన సేవలకు గుర్తింపుగా దక్కిన గొప్ప గౌరవం అని సచిన్ టెండూల్కర్ అన్నారు. భారత జట్టుకు ఆడాలని కలలు కనేవాడిని. 24 ఏళ్లపాటు క్రికెట్ రంగానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టం. క్రికెట్ రంగానికి అందించిన సేవలకు గుర్తుగా అరుదైన బంగారు నాణాన్ని విడుదల చేయడం నాకు లభించిన గొప్ప గౌరవం అని సచిన్ అన్నారు.