breaking news
Ramulu murder
-
పథకం ప్రకారమే రాములు హత్య
నల్గొండ: దివంగత మాజీ మావోయిస్ట్ సాంబశివుడు సోదరుడు కోనపురి రాములు హత్య కేసు నిందితులను నల్గొండ జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ పథకం ప్రకారమే కోనపురి రాములును నయీం ముఠా సభ్యులు హత్య చేసినట్లు చెప్పారు. హత్య చేయడంలో మొత్తం 10మంది పాల్గొన్నట్లు తెలిపారు. హత్య చేసిన తరువాత నిందితులు కేరళ పారిపోయినట్లు చెప్పారు. అక్కడి పోలీసుల సాయంతో నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు నయీం కోసం ప్రత్యేక టీమ్‌ను రంగంలోకి దింపినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే ప్రధాన నిందితుడు నయీంను పట్టుకుంటామని ఎస్పీ ప్రభాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. -
పట్టుబడ్డ నయీం ముఠా!
కొనపురి రాములు హత్యకేసు నిందితులను త్రివేండ్రంలో అరెస్టు చేసిన పోలీసులు ఆరుగురిని విచారిస్తున్న కేరళ పోలీసులు రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం నల్లగొండ జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు వెల్లడి నల్లగొండ: టీఆర్ఎస్ నేత, మాజీ మావోయిస్టు కొనపురి రాములు హత్య కేసు నిందితులు మంగళవారం కేరళలో అరెస్టు అయ్యారు. రాష్ట్ర పోలీసుల సమాచారం మేరకు త్రివేండ్రంలోని లాడ్జీల్లో సోదాలు నిర్వహించిన కేరళ పోలీసులు ఒక లాడ్డీలో నయీం ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు నేత సాంబశివుడి సోదరుడు కూడా అయిన కొనపురి రాములును నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బేగ్ ఫంక్షన్‌హాల్ వద్ద ఈ నెల 11న కొందరు దుండగులు కాల్పులు జరిపి దారుణంగా హత్యచేయడం, ఇది నయీం ముఠా పనేనని పోలీసులు అనుమానించడం తెలిసిందే. నల్లగొండ ఎస్పీ ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడ్డవారిలో జనశక్తి మాజీ సభ్యుడు, వరంగల్ జిల్లా దేవరుప్పల మండలానికి చెందిన సోమయ్య, నల్లగొండ జిల్లా నారాయణపురం మండలం వాసి సురేష్, కుమారస్వామి, రవి, రమేష్, ఎల్లేష్‌లు ఉన్నారు. పోలీసులు వారి వద్ద పిస్టల్, రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో సురేష్.. మాజీ మావోయిస్టు సాంబశివుడి హత్య కేసులో నిందితుడు కాగా, సోమయ్య గతంలో రాములుపై దాడి చేయడానికి వచ్చినవారిలో ఒకడు. వీరి అరెస్టు తర్వాత కేరళ పోలీసులకు మరిన్ని వివరాలు అందజేసేందుకు నిందితులతో పాటు నయీం ఫొటోలను రాష్ట్ర పోలీసులు అక్కడికి పంపారు. దొరికింది ఇలా... రాములు హత్య తర్వాత పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులు హైదరాబాద్‌లో షెల్టర్ తీసుకున్నట్లు తెలిసింది. ఆ షెల్టర్‌పై పోలీసులు దాడిచేసినా, అప్పటికే వారు మకాం మార్చారు. అయితే వారికి సంబంధించిన సమాచారం కొంత లభ్యం కావడం, నిందితులు సెల్ఫోన్లు ఉపయోగించడంతో సెల్‌టవర్ సిగ్నల్స్ ఆధారంగా వారు త్రివేండ్రంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో కేరళ పోలీసులకు సమాచారం అందించి, ఇక్కడి నుంచే వ్యవహారం నడిపించారు. పట్టుబడిన ఆరుగురు నిందితులను అక్కడి పోలీసులు విచారిస్తున్నారు. వారిని జిల్లాకు తీసుకు వచ్చేందుకు మంగళవారం నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ రమారాజేశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం త్రివేండ్రంకు వెళ్లింది. వీరితోపాటు ఎస్ఐబీకి చెందిన కొందరు అధికారులూ అక్కడికి వె ళ్లారు. మొత్తం 15 మంది సభ్యులా..? రాములు హత్యలో పాల్గొన్నది పది మంది అని ఇప్పటిదాకా పోలీసులు అనుమానించారు. ఈ కేసులో తొలుత ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో ఆరుగురు త్రివేండ్రంలో పట్టుబడ్డారు. నయీం సహా మరో వ్యక్తి కూడా ఉండొచ్చన్నది అనుమానం. అయితే విశ్వసనీయమైన సమాచారం ప్రకారం ఈ సంఘటనలో మొత్తం 15 మంది హస్తం ఉందని తెలుస్తోంది. భువనగిరి, హైదరాబాద్, యాదగిరిగుట్ట, తదితర ప్రాంతాలకు చెందినవారు ఇందులో ఉన్నారని సమాచారం. పట్టుబడిన ఆరుగురి ద్వారా మిగతావారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. కాగా ఈ ఆరుగురు నిందితులు ఇప్పటిదాకా తాము నయీం ముఠా సభ్యులమేనని చెప్పలేదని, కానీ వారు నయీం ముఠా సభ్యులేనని భావిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. -
కళ్లలో కారం చల్లి 6 రౌండ్ల కాల్పులు
నల్లగొండ: మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడు, టీఅర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోనపురి రాములును హత్య చేసిన దుండగులు కళ్లలో కారం చల్లి ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు గన్‌మేన్ చెప్పారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పర్వతాలు కుతురు వివాహానికి వెళ్లిన రాములుని ఎంఏ బేగ్ ఫంక్షన్ హాల్లో హత్య చేసిన విషయం తెలిసిందే. మొత్తం 10 మంది వచ్చి కాల్పులు జరిపినట్లు గన్‌మేన్ చెప్పారు. కళ్లల్లో కారం చల్లేసరికి తమకేమీ తెలియలేదన్నారు. తాము కళ్లు తెరిచి చూసేసరికి అంతా అయిపోయిందని చెప్పారు. ఫంక్షన్ హాల్ బయటే పొదల్లో మాటువేసిన దుండుగులు దగ్గర నుంచే కాల్చి చంపారు. కాల్పుల్లో రాములు ఛాతీ, పొట్టలోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. మాజీ మావోయిస్ట్ అయిన రాములుపై గతంలో అనేక సార్లు హత్యాయత్నం జరిగింది. దాంతో నయాం గ్యాంగ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు నెలల క్రితం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటలో రాములు ఇంటి వద్ద నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహీం అనుచరుల నుంచి రాములకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చినట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటి కార్యదర్శిగా పనిచేన సాంబశివుడు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. ఆ తరువాత అతను లొంగిపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా ఉన్నారు. రెండేళ్ల క్రితం కొందరు దుండగులు ఆయనను నల్గొండ జిల్లా గోకారం గ్రామ సమీపంలో హత్య చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు రాములుని కూడా కాల్చిచంపారు. వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెంకు చెందిన మాజీ మావోయిస్టులైన అన్నదమ్ములు ఇద్దరూ హత్యకు గురికావడం విచారకరం.