యూనిట్లు స్థాపిస్తేనే సబ్సిడీ
ఏలూరు (మెట్రో) : కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరైన వారికి యూనిట్లు స్థాపిస్తేనే సబ్సిడీ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథిగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనిట్లు స్థాపించకుండా సబ్సిడీ విడుదల చేస్తే ఆ సబ్సిడీని దుర్వినియోగమయ్యే అవకాశం ఉండదని, అందువల్లే సబ్సిడీ విడుదలలో జాప్యం జరుగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలో నిరుద్యోగులైన వారిని చిన్న, మధ్యతరగతి పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దేందుకు ప్రతి జిల్లాలో పరిశ్రమలపై నేడు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరావు పాల్గొన్నారు.