breaking news
Rallavagu pickup Dam
-
నిజామాబాద్లో కాలువలోకి దూసుకెళ్లిన కారు..
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. జగిత్యాల జిల్లా రాయకల్కు చెందిన ఓ కుటుంబం రాళ్లవాగు అందాలు చూసి తిరుగు ప్రయాణం అయ్యారు. వీరి వాహనం కమ్మర్పల్లి మండలం రాళ్లవాగు దగ్గరకు రాగానే అదుపు తప్పి పక్కనే ఉన్న నీటి గుంతలోకి దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే డోర్ ఓపెన్ చేసి.. అందులో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా కాపాడారు. ప్రమాద సమయంలో ముగ్గురు పిల్లలతోపాటు భార్య, భర్త కారులో ఉన్నారు. అనంతరం క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. -
రాళ్లవాగు నీళ్లు వృథా
ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు పాల్వంచ మండలంలోని పాండురంగాపురం పంచాయతీ ప్రభాత్నగర్ శివారులో ఉన్న రాళ్లవాగు పికప్ డ్యాం నిండుకుండలా ఉంది. కానీ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ నీరు వృథాగా పోతోంది. ఫలితంగా రైతులు సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. చివరి భూములకు నీరందక బీళ్లుగా దర్శమిస్తున్నాయి. రాళ్లవాగు పికప్ డ్యాం కింద మూడు వేల ఎకరాల సాగు భూమి ఉంది. కుడి కాల్వ కింద 1500 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 1500 ఎకరాల భూమిని రైతులు సాగు చేస్తున్నారు. మరమ్మతులు చేయకపోవడంతో... ఇటీవల ఈ డ్యాంలోకి వరద నీరు వచ్చి చేరింది. కానీ డ్యాం తూములకు మరమ్మతులు చేయకపోవడంతో వాటి నుంచి నీరు వృథాగా పోతోంది. మరోవైపు డ్యాం లీకై కూడా నీళ్లు వృథాగా పోతున్నాయి. కుడి ఎడమ కాల్వల చుట్టూ చెట్లు అల్లుకుపోయి లోపల సిల్టు పేరుకుపోయింది. దీంతో కాల్వ ద్వారా భూములకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సక్రమంగా నీరు సరఫరా కాకపోవడంతో వందలాది ఎకరాల పొలాలు బీళ్లుగా మారినట్లు రైతులు తెలిపారు. పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు... డ్యాం నుంచి నీళ్లు వృథాగా పోతున్నాయని అనేకసార్లు ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలానికి ముందే మరమ్మతులు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సీజన్లో నీరు అందడం లేదని రైతులు అంటున్నారు. ఈ లీకుల కారణంగా డ్యాంలోని నీరంతా వృథాగా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ ఈఈ బజారన్నను వివరణ కోరగా.. రాళ్లవాగు పికప్ డ్యాం కోసం మూడు నెలల క్రితం రూ. 2 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, మంజూరు కాగానే కాల్వలు, తూములకు మరమ్మతులు చేస్తామని అన్నారు.