సీబీఐ ఆఫీసర్‌గా..
సింగిల్ లాంగ్వేజ్‌లో సినిమాలు చేయడం రానాకు కిక్ ఇవ్వదేమో! తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంటారాయన. ‘బాహుబలి’కి ముందు ముచ్చటిది. ‘బాహుబలి’తో మలయాళంలోనూ రానాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఒక్క సినిమాతో నాలుగు భాషలపై గురి పెట్టారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతం ఆధారంగా ‘ఆస్ఫోట – ద హ్యూమన్ బాంబ్’ అనే సినిమా తీయనున్నట్టు కన్నడ దర్శకుడు ఏయమ్మార్ రమేశ్ గతేడాది ప్రకటించారు.
ఇందులో రాజీవ్ హత్య కేసును ఇన్వేస్టిగేషన్ చేసిన సీబీఐ ఆఫీసర్ డీఆర్ కార్తికేయన్‌గా రానా నటించడం దాదాపు ఖాయమే. రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ దాడి వెనుక ఎల్టీటీఈ సంస్థ హస్తం ఉందనేది తెలిసిందే. ఈ నిజాలను సీబీఐ ఆఫీసర్ ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడు? వాళ్లను ఎలా రౌండప్ చేశాడు? అనే కథతో సినిమా తీస్తారట.
దర్శకుణ్ణి రెండుమూడు సార్లు కలసిన రానా కథ, అతని పాత్ర తీరుతెన్నుల గురించి చర్చించారు. ముందు ఈ సినిమాను కన్నడ, తమిళ భాషల్లో తీయాలనుకున్నారు. ఇప్పుడు రానా చేరికతో తెలుగు, హిందీలతో కలిపి నాలుగు భాషల్లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘బాహుబలి’ చేసేటప్పుడే ‘నేనే రాజు–నేనే మంత్రి’, తెలుగు–తమిళ సినిమా ‘1945’ అంగీకరించారు.