breaking news
rajeev vidya mission
-
‘లక్ష్యం’ గాలికి..
హుస్నాబాద్‌రూరల్ : పదో తరగతి పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రణాళికబద్ధంగా తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు సబ్జెక్టు ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని హెచ్ఎంలకు సూచించింది. అయితే, రోజుకు ఒక సబ్జెక్ట్ ఉపాధ్యాయుడితోనే ప్రత్యేక తరగతుల నిర్వహించి ప్రధానోపాధ్యాయులు చేతులు దులుపుకుంటున్నట్టు సమాచారం. వార్షిక ఫలితాలపై ప్రభావం హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలలో 15 ప్రభుత్వ పాఠశాలలో 350 మంది 10వ తరగతి చదువుతున్నారు. వీరికి వారం వారం ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మండలంలో మీర్జాపూర్, మోడల్ స్కూల్, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. మొత్తంగా హుస్నాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు గత ఏడాది 87 శాతం ఫలితాలు సాధించాయి. ఈసారి ప్రతి పాఠశాల వందశాతం ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. హెచ్ఎంల తీరుపై విమర్శలు సిద్దిపేట విద్యాధికారి ఆదేశాల మేరకు గత ఏడాది అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు నిత్యం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఒక సబ్జెక్ట్ టీచర్ విద్యా బోధన చేశారు. జనవరి నుంచి ఉదయం, సాయంత్రం 2 గంటలు ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. సెలవు రోజుల్లో మాత్రం ఉదయం 8.30 నుంచి 11.30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో హెచ్ఎంల తీరుతో ఫలితాలపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. మరోవైపు తాగునీరు, అల్పాహారం అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు రాత్రి 7 గంటలకు ఇళ్లకు చేరుతుండటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హెచ్ఎంల పనితీరు మార్చుకోవాలని అటు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల గ్రాంట్స్‌కు బోగస్ బిల్లులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఏటా రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) కింద రూ.10 వేలు ప్రాఠశాల గ్రాంట్, రూ.15,000 నిర్వహణ ఖర్చులు, ఒక టీచర్‌కు రూ.500 టీచింగ్ గ్రాంట్స్ ప్రభుత్వం విడుదల చేస్తుంది. వీటితో పాటు ఆర్‌ఎంఎస్‌ఏ(రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్) కింద పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ఏటా రూ.50 వేలు అందుతాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఒక్కో 10వ తరగతి విద్యార్థికి స్నాక్స్, ఇతర సౌకర్యాల కోసం రూ.4 అందిస్తున్నారు. కాగా, హెచ్ఎంలు గ్రామాలకు చెందిన దాతలతో అల్పాహారం ఏర్పాటుచేయిస్తూ.. నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలో గ్రంథాలయ పుస్తకాలు, సైన్స్ పరికరాలు ఏర్పాటుచేయకుండానే గ్రాంట్స్ కాజేస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. అక్కన్నపేట పాఠశాలకు సంబంధించిన బిల్లుల విషయంలో యువజనులు గతంలో సమాచార చట్టం కింద వివరాలను సేకరిస్తే ఇలాంటి అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. హెచ్ఎంలు అందుబాటులో ఉండాలి 10వ తరగతి ప్రత్యేక తరగతులకు సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే వరకు ప్రధానోపాధ్యాయులు ఉండాల్సిందే. ఒకటి, రెండు రెండు చోట్ల హెచ్ఎంలు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవచ్చు. దీనిపై ఆరా తీస్తాం. – మారంపల్లి అర్జున్, ఎంఈఓ -
రా...రా... రాజీవ్ విద్యామిషన్
- వెలుగులోకి లైంగిక పర్వం - అకడమిక్ అధికారిపై ఫిర్యాదు - కలెక్టరును కలిసి వేడుకున్న కస్తూర్బా ప్రత్యేకాధికారులు - విచారించిన ఏసీబీ డిఎస్పీ వేధింపుల అధికారి సస్పెన్షన్ శ్రీకాకుళం టౌన్ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన రాజీవ్ విద్యామిషన్‌లో లైంగిక వేధింపుల పర్వం వెలుగుచూసింది. అధికారుల ఆగడాలు శ్రుతి మించడంతో మహిళా ఉద్యోగులు ధైర్యం చేసి ముందుకు వచ్చారు. ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరవు పెట్టారు. తమను లైంగిక వేధింపుల నుంచి విముక్తుల్ని చేయాలంటూ వారు కలెక్టరు లక్ష్మీనృసింహాన్ని వేడుకున్నారు. వివరాలు పరిశీలిస్తే.. రాజీవ్ విద్యామిషన్, ప్రాజెక్టు పరిధిలో చాలాకాలంగా కొందరు ఉద్యోగులు పాతుకుపోయారు. వారు చెప్పిందే వేదమక్కడ. ఆఖరుకు పీవోను సైతం తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తురన్నారనే ఆరోణలున్నాయి. ఈ శాఖలో అవుట్సోర్సింగ్ విభాగంలో మహిళలు ఎక్కువ. వీరిని ఇక్కడి అధికారులు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. పెదవి విప్పితే ఏం జరుగుతుందోనని వీరంతా తమ ఆవేదనను భరిస్తూ వస్తున్నారు. కొన్నిసార్లు ఉన్నతస్ధాయిలో ఫిర్యాదులు చేసినా తమ ఉద్యోగానికి ముప్పు వస్తుందని మళ్లీ వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల పీవో బాధ్యతలు స్వీకరించిన త్రినాథరావు దృష్టికి ఈ విషయం వచ్చింది. ఆయన భరోసా ఇవ్వడంతో కొంతమంది మహిళా ఉద్యోగులు ధైర్యం చేశారు. వేధింపుల పర్వం చిట్టాను విప్పారు. అకాడమిక్ మోనటరింగ్ ఆఫీసర్ జగదీష్‌బాబుపై వీరంతా బుధవారం కలెక్టరును కలిసి లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఎనిమిది మంది కస్తూరిబా విద్యాలయాల ప్రత్యేకాధికారులు జిల్లా కలెక్టర్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. వెంటనే ఏసీబీ డీఎస్పీ రంగరాజుతో పాటు జాయింట్ కలెక్టర్-2 రజనీకాంతరావులు వీరిని విచారించారు. ఎఎంఓ జగదీష్‌బాబుపై లైంగిక వేదింపు ఆరోపణలు: జగదీష్‌బాబు బొంతలకోడూరు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ డిప్యుటేషన్‌పై ఆర్వీయం ఏఎంవోగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఐసీపీఎస్‌లో కూడా ఈయనపై కేసు నమోదైంది. ఈ కేసులో సీడబ్ల్యుసీ కోర్టుకు కూడా హాజరుకాలేదు. తాజాగా జగదీష్‌బాబు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ భామిని, రణస్థలం, ఎచ్చెర్ల, సింగుపురం, పలాసలకు చెందిన ఎనిమిది కేజీబీవీ సంస్థల ప్రత్యేకాధికారులు ఫిర్యాదు చేసారు. కలెక్టర్ తీవ్రంగా స్పందించి క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఓ మహిళ నుంచి భర్తకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ జగదీష్‌బాబు రూ.లక్ష వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు చేయాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని కలెక్టరు స్పష్టం చేశారు.