కశ్మీర్లో మళ్లీ ‘ఉగ్ర’ దాడి
ఈసారి ఆర్మీ క్యాంప్‌పై గ్రెనేడ్లు, కాల్పులతో తెగబడ్డ ఇద్దరు టైస్టులు హతమార్చిన బలగాలు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. సాంబ జిల్లాలో జమ్మూ, పఠాన్‌కోట్ హైవేపై ఉన్న మెష్వారా ఆర్మీక్యాంప్‌పై శనివారం ఉదయం 5.50 గంటలకు ఇద్దరు ఉగ్రవాదులు గ్రెనేడ్లు, కాల్పులతో విరుచుకుపడ్డారు. అయితే, ఆ దాడిలో భద్రతాబలగాలు కానీ, పౌరులు కానీ ఎవరూ గాయపడలేదని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక పౌరుడు సైకిల్‌పై నుంచి కిందపడి స్వల్పంగా గాయపడ్డాడు. భద్రతాదళాల ఎదురుకాల్పులో ఆ ఉగ్రవాదులిద్దరూ హతమయ్యారు. కథువా జిల్లాలోని రాజ్‌భాగ్ పోలీస్ స్టేషన్‌పై శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చనిపోగా, డిప్యూటీ ఎస్పీ సహా 11 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. రాజ్‌భాగ్ పోలీస్‌స్టేషన్‌పై శుక్రవారం దాడి చేసిన ఉగ్రవాదులు, శనివారం ఆర్మీక్యాంప్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు ఒకే ఉగ్రవాద సంస్థకు చెందినవారా? కాదా? అన్న విషయం ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారి లెఫ్ట్‌నెంట్ కల్నల్ మనీశ్ మెహతా పేర్కొన్నారు.
‘ఆర్మీక్యాంప్ లోపలికి రావడానికి ఉగ్రవాదులు ప్రయత్నించలేదు. బయట్నుంచే కాల్పులు జరిపారు. గ్రెనేడ్లు విసిరారు. దాంతో అక్కడే వారిని చుట్టుముట్టి హతమార్చాం’ అని మెహతా చెప్పారు. జమ్మూ, పఠాన్‌కోట్ రహదారిపై రెండు రోజుల్లో రెండు వరుస దాడులు జరగడంతో.. ముందుజాగ్రత్త చర్యగా ఆ హైవేను మూసివేశారు. ఆర్మీ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యల వల్ల బలహీనపడ్డ ఉగ్రవాదులు.. తమ అస్తిత్వాన్ని చూపెట్టుకునేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. ఆత్మస్థైర్యం దెబ్బతిన్నప్పుడే ఇలాండి దాడులకు తెగబడ్తారన్నారు. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి చాలా రహస్య మార్గాలున్నాయని, కొన్నిసార్లు మొత్తం ఐబీని పహారా కాయడం కష్టమవుతుందని పారికర్ వివరించారు. కాగా, ఉగ్రవాదం ప్రపంచమంతా వ్యాప్తి చెంది, మానవజాతికే సవాలుగా మారిందని, ఆ మహమ్మారిపై ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా పోరాటం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సదస్సు ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు.
పాక్ అనుకూల వైఖరి వల్లనే దాడులు
పాకిస్తాన్ అనుకూల వైఖరి అనుసరిస్తున్న జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌ను కట్టడి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ విమర్శించింది. పాకిస్తాన్‌తో, మిలిటెంట్లతో, వేర్పాటువాదులతో ముఫ్తీ నెరపుతున్న రహస్య సంబంధాల ఫలితమే ఈ ఉగ్రదాడులని జమ్మూకశ్మీర్ సీఎల్పీ నేత నావంగ్ రిగ్జిన్ జోరా తీవ్రంగా ఆరోపించారు. కేంద్రం, రాష్ట్రాలు అనుసరిస్తున్న ఈ గందరగోళ విధానాలు ఇలాగే కొనసాగితే మరోసారి రాష్ట్రంలో ఉగ్రవాదం పెచ్చరిల్లే ప్రమాదముందని జోరా హెచ్చరించారు. ‘ప్రధాని మూడ్ బావుంటే పాక్‌తో సత్సంబంధాలు కోరుకుంటారు. మూడ్ బాగోకపోతే ఇరుదేశాల మధ్య చర్చలను రద్దు చేస్తారు. ఇలా భావోద్వేగాలపై ఆధారపడ్డ విదేశాంగ విధానం ఉంటే ఎలా?’ అని ఆయన ప్రశ్నించారు.