జైలు నుంచి కన్హయ్య విడుదల
జేఎన్‌యూ, స్వగ్రామంలో సంబరాలు
* దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు: కన్హయ్య
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్ గురువారం సాయంత్రం 6.30 గంటలకు విడుదలయ్యారు. భారీగా వచ్చిన మద్దతుదారులు నినాదాలు చేస్తూ జైలు వద్ద స్వాగతం పలికారు. అక్కడి నుంచి జేఎన్‌యూ చేరుకున్న కన్హయ్యకు విద్యార్థులు, అధ్యాపకులు నీరాజనాలు పట్టారు. గంగా ధాబా నుంచి అడ్మినిస్ట్రేషన్ భవనం వరకూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ‘దేశానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు... సత్యానిదే విజయమన్న నమ్మకముంది.. నిజాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తాయి.
నేను ఇప్పుడు నా సొంత కథను రాస్తాను.. జైలులోనే రాయడం ప్రారంభించాను’ అంటూ సహచరుల్ని ఉద్దేశించి క్యాంపస్‌లో కన్హయ్య ప్రసంగించారు. ‘ప్రధానితో ఎన్ని భేదాభిప్రాయలు ఉన్నా సత్యమేవ జయతే అన్న మోదీ ట్వీట్‌తో ఏకీభవిస్తాను... భారత్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరడం లేదని, దేశంలోనే స్వేచ్ఛను కోరుతున్నా’ అంటూ ఉద్వేగంగా పేర్కొన్నారు. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలపై నమ్మకముందని, ఏబీవీపీని శత్రువుగా కాకుండా ప్రతిపక్షంగానే చూస్తామని చెప్పారు.
కన్హయ్య గ్రామంలో సంబరాలు
కన్హయ్య విడుదలతో ఆయన స్వగ్రామంలో కుటుంబీకులు, గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. బీహార్‌లోని బిహత్ గ్రామంలో సోదరులు తల్లిదండ్రులకు రంగులు పూశారు. గ్రామస్తులు ‘కన్నయ్య అరెస్టైన తర్వాత మొదటిసారి ఆందోళన నుంచి ఉపశమనం దొరికింది’ అంటూ తండ్రి జైశంకర్ సింగ్(61) సంతోషంగా చెప్పారు. వెంటనే గ్రామానికి రావాలని కుమారుడ్ని కోరలేదని, జేఎన్‌యూకి వెళ్లి మద్దతుగా నిలిచిన విద్యార్థులతో గడుపుతాడని సింగ్ తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
ఢిల్లీ అంతటా పోలీసు భద్రతను పటిష్టం చేశారు. జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరారు. విడుదల తర్వాత ఎఐఎస్ఎఫ్, ఎఐఎస్ఏ, రాజకీయ పార్టీలతో కలిసి కన్హయ్య జంతర్‌మంతర్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో పర్యటించవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి.
కన్హయ్యకు ఆప్ సర్కారు క్లీన్చిట్
జేఎన్‌యూ ఘటనలో కన్హయ్య ఏ తప్పు చేయలేదని ఢి ల్లీ ప్రభుత్వం నియమించిన విచారణ సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్లో నమోదుచేసిన ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలపై పోలీసులకు అనుమానాలున్నాయని తెలిపింది. కన్హయ్యకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు, వీడియోలు దొరకలేదని నివేదికలో పేర్కొంది. కన్నయ్య దేశ వ్యతిరేక నినాదాలు చేస్తుండగా చూశామంటోన్న వ్యక్తులు, వారి పాత్రపై విచారణ నిర్వహించాలని అభిప్రాయపడింది.
కొన్ని వీడియోల్లో ఉమర్ ఖాలిద్ కనిపించాడని, అతని పాత్రపై మరింత విచారణ జరగాలని న్యూఢిల్లీ జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ తెలిపింది. ఉమర్, అనిర్బన్, అశుతోష్ లు అఫ్జల్‌గురు ఉరికి వ్యతిరేకంగా, కశ్మీర్‌పై నినాదాలు చేసినట్లు జేఎన్‌యూ భద్రతా సిబ్బంది చెప్పార ంటూ నివేదికలో వెల్లడించారు.