breaking news
raithu Mitra
-
రైతు మిత్రకు ప్రోత్సాహమేదీ?
రైతుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరిచేందుకు, ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించి ఆర్థికాభివృద్ధి చేకూర్చేందుకు ఏర్పాటు చేసిన రైతు మిత్ర సంఘాలకు రెండేళ్లరుునా ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. వారికి ఇస్తామని చెప్పిన రూ.1.50 కోట్లు ఇంత వరకు విడుదల చేయకపోవడంతో ప్రభుత్వంపై రైతుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఒంగోలు: రైతులను సంఘటితం చేసి ప్రభుత్వ పథకాలు వారి దరిచేరేలా 2001లో ఏర్పాటు చేసిన రైతు క్లబ్బులను రైతుమిత్ర గ్రూపులుగా పేరుమార్చి రెండేళ్ల క్రితం మళ్లీ టీడీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. రైతులను సంఘాలుగా ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించి ఆర్థికాభివృద్ధి చేకూర్చుతామని నమ్మబలికింది. రైతుల ఆత్మహత్యలను నివారించడంలో, ప్రభుత్వ రాయితీలు, యంత్రాలు అందించడంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సంఘాల పాత్రే కీలకమని చెప్పించింది. రెండేళ్లయినా కొత్తగా ఏర్పడిన సంఘాలకు ప్రోత్సాహం కరువైంది. 14 ఏళ్ల నాటి పథకం.. రాష్ట్రంలో 14 ఏళ్ల కిందట టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2001లో రైతు క్లబులను ఏర్పాటు చేశారు. కొమరోలు లాంటి మారుమూల మండలాల్లో కూడా 25 క్లబ్బులు ఏర్పాటు చేశారు. 2002 సంవత్సరంలో మరో 148 రైతు సంఘాలు ఏర్పాటయ్యాయి. వీటి నిర్వహణకు 2001వ సంవత్సరంలో రూ.800, 2002వ సంవత్సరంలో రూ.2,500 ప్రకారం ప్రభుత్వం నిధులు ఇచ్చి ప్రోత్సహించింది. దీంతో ఎక్కువ మంది రైతులు ముందుకొచ్చి రైతు మిత్ర సంఘాలుగా బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఒక్కొక్క సభ్యుడు నెలకు రూ.50 ప్రకారం కొన్ని నెలల పాటు పొదుపు చేసుకున్నారు. సక్రమంగా పొదుపు చేసిన సంఘాలకు రూ.10 వేల ప్రకారం రివాల్వింగ్ ఫండ్ బ్యాంకుల ద్వారా ఇప్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో అది అమలు కాలేదు. మళ్లీ రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే రైతు మిత్ర సంఘాలంటూ రైతుల్లో ఆశలు రేపింది. ఈ సారి ఒక్కొక్క సంఘానికి రూ.5 వేలు ప్రోత్సాహం కింద మంజూరు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు మళ్లీ రైతులు చంద్రబాబును నమ్మారు. ఈ రెండేళ్లలో 1182 రైతు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం మంజూరు చేస్తామన్న ప్రోత్సాహం కోసం ఎదురు చూశారు. ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లరుునా నేటికీ రైతుమిత్ర సంఘాల గురించి పట్టించుకోలేదు. సంఘటిత శక్తిగా.. ప్రతి వంద హెక్టార్లకు ఒక రైతు మిత్ర సంఘాన్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. జిల్లాలో మూడేళ్లలో మొత్తం 6,030 సంఘాలు మూడు విడతల్లో ఏర్పాటు చేయాలని లక్ష్యం. ప్రతి రైతు కుటుంబం నుంచి ఒకరికి సభ్యత్వం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో సంఘంలో 15 మంది సభ్యులుంటారు. రైతులు సంఘ బ్యాంకు ఖాతాలో ప్రతి నెలా రూ.500 క్రమం తప్పకుండా పొదుపు చేయాల్సి ఉంటుంది. ప్రతి సంఘం నుంచి ఒకరు కన్వీనర్‌గాను, మరొకరు కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వ్యవసాయశాఖ అధికారులు, రైతుల మధ్య ఈ సంఘాలు వారధిగా పనిచేస్తారు. ప్రయోజనాలు ఎన్నో.. ఈ సంఘాల్లోని రైతులకు వ్యవసాయ రుణాల మంజూరులో ప్రాధాన్యం ఇస్తారు. వ్యవసాయశాఖ ద్వారా సరఫరా చేసే యంత్ర పరికరాలు మంజూరు చేస్తారు. వ్యవసాయ విస్తరణకు మధ్యవర్తిగా..సాంకేతిక బదిలీ, మార్కెట్ సమాచారం, సూచనలు, భూసార పరీక్షలు, పశువైద్య శిబిరాల నిర్వహణకు ఈ సంఘాలు తోడ్పాటునందిస్తాయి. లక్ష్య సాధన కోసం రైతులను చైతన్యులను చేసేందుకు రైతు మిత్ర సంఘాలు దోహదపడతాయి. నూతన సంఘాల నిర్వహణకు రూ.1.50 కోట్ల కేటాయింపు జిల్లాలో 56 మండలాల్లో మొదటి విడతగా ఈ ఏడాది 2,010 రైతు మిత్ర సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యం. వాటిలో ప్రతి రైతుమిత్ర సంఘానికి ..నిర్వహణ ఖర్చుల కింద రూ.5 వేలు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. మొత్తం రూ.1.50 కోట్లు కేటాయించినట్లు ప్రచారం జరిగింది. ప్రభుత్వం సంఘానికిచ్చే నిధులతో దస్త్రాల నిర్వహణ, క్షేత్ర సందర్శన లాంటి కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సూచించింది. అయితే ప్రభుత్వం మంజూరు చేస్తామన్న ప్రోత్సాహం నేటికీ రాకపోవడంతో రైతుల్లో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. ఇప్పుడు రైతు మిత్ర సంఘం ఏర్పాటు చేసుకోమన్నా ముందుకొచ్చే రైతులు మచ్చుకైనా కనిపించని పరిస్థితి జిల్లాలో ఉంది. -
కొబ్బరి పొట్టుతో ప్రయోజనాలెన్నో!
సేంద్రియసాగు ►సేంద్రియ ఎరువు తయారీకి అవకాశం ►నీటి లభ్యత లేని ప్రాంతాలకు వరం అమలాపురం : కొబ్బరి చెట్టు కల్పతరువు. దీని నుంచి వచ్చే కాయలే కాదు.. అన్ని పదార్థాలు రైతుకు ప్రయోజనం చేకూర్చేవే. కొబ్బరి కాయ లు ఒలిచిన తర్వాత వచ్చే డొక్కలు, పీచు వృథా పోకుండా వంట చెరుకుగా వాడుతున్నారు. దీనిని మరింత ఉపయుక్తంగా నారతీసి రకరకాల అవసరాలకు వినియోగించినప్పుడు ఉప ఉత్పత్తిగా ‘పొట్టు’ వస్తుంది. గతంలో ఇటుక బట్టీల్లో దీనిని వినియోగించేవారు. అయితే వ్యవసాయ అవసరాల కోసం కొబ్బరి పొట్టును విని యోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. అమలాపురం రైతుమిత్ర రూరల్ టెక్నాలజీ పార్కు కన్వీనర్ (94402 50552, 93925 50552) అడ్డాల గోపాలకృష్ణ. వివరాలు ఆయన మాటల్లోనే... కొబ్బరి పీచును ఉత్పత్తి చేసే సమయంలో వచ్చే కొబ్బరి పొట్టుతో ఎన్నో వ్యవసాయ ఉపయోగాలున్నాయి. ఈ పొట్టును నేరుగా పొలంలో వినియోగించకూడదు. దానిని శుద్ధిచేసి.. ఆ తరువాత కుళ్లబెట్టి రకరకాలుగా వినియోగించవచ్చు. దీంతో మంచి సేంద్రియ ఎరువును తయారుచేసుకోవచ్చు. శుద్ధి చేసి వాడాలి డొక్కల నుంచి నార (కోకోనట్ యార్న్) తీయగా వచ్చే ‘కొబ్బరిపొట్టు’లో ముందుగా చిన్న చిన్న నారముక్కలు వేరయ్యేలా జల్లెడ పట్టాలి. తర్వాత పెద్ద సిమెంట్ తొట్టెలో నీరు నింపి నాలుగు రోజులు ఉంచాలి. ఆపై ఆ నీరు తీసి మళ్లీ కొత్త నీటితో తొట్టె నింపాలి. ఒక రోజు ఉంచి మరుసటి రోజు పొట్టును తీసి ఎండలో ఆరనివ్వాలి. ఇలా ఆరిన పొట్టులో ‘లిగ్నన్’ బాగా తగ్గుతుంది. దీనిని ప్రత్యేక యంత్రాలతో ఇటుకల మాదిరిగా కంప్రెస్ చేసి మార్కెటింగ్ చేస్తారు. ప్రత్యేకించి పోషక విలువలు ఏమీ లేకపోయినా ఎడారి ప్రాంతాల్లో నీటి సామర్థ్యం పెంచేందుకు ఈ కొబ్బరి పొట్టు ఇటుకలు బాగా ఉపకరిస్తాయి. త్వరత్వరగా నీరు పోయనవసరం లేకుండా ఈ ఇటుకలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుండీల్లో, నేలలో వేసి నీరు పెడతారు. ఆపై 10 నుంచి 15 రోజుల వరకు మొక్కలకు కావాల్సిన తేమ ఈ ఇటుకల నుంచి నెమ్మదిగా విడుదలవుతుంది. నేరుగా ఎందుకు వాడకూడదంటే... ►కొబ్బరి పొట్టును నేరుగా వినియోగిస్తే దీనిలో ఉన్న లిగ్నన్ మొక్కలకు హాని చేస్తుంది. ►కుళ్లబెట్టకపోతే మొక్కలకు ఎరువుగా ఉపయోగపడదు. ► పోషకాలను పట్టి ఉంచే లక్షణాన్ని కోల్పోతుంది. ►నీటి నిల్వ సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. ►సి : ఎన్ (కర్బనం, నత్రజనిల నిష్పత్తి) మొక్కలకు అనుకూలంగా ఉండదు. దీనిని శుద్ధి చేసి కొన్ని రకాలుగా, కుళ్లబెట్టి మరికొన్ని అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఎరువు తయారీ ఇలా.. ►కొబ్బరి పొట్టును సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవాలంటే దీనిని తప్పని సరిగా కుళ్లబెట్టాలి. ►ఒక టన్ను కొబ్బరి పొట్టులో ఐదు కేజీల రాతి భాస్వరం, ఐదు కేజీల యూరియా వేసి తడిపి 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉంచాలి. ఇలా ఉంచిన పొట్టును పొరలు పొరలుగా తడుపుతూ ఐదు కేజీల ప్లూరోటస్ సాజర్కాజూ అనే శిలీంధ్రాన్ని (పుట్టగొడుగుల తయారీలో వాడతారు) చల్లి నీటితో పలుచగా తడపాలి. ►పొట్టును నాలుగు అడుగుల వెడల్పు, సుమారు మూడడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు కలిగిన కుప్పలా చేయాలి. దీనికి సూర్యరశ్మి నేరుగా తగలకుండా (నీడ) ఏర్పాటు చేయాలి. బాగా పైభాగంలో కొబ్బరి ఆకులు కప్పితే మరింత చల్లగా ఉండడం వల్ల శిలీంధ్రం వేగంగా విస్తరించి పొట్టు త్వరగా కుళ్లిపోతుంది. ►సాధారణంగా శీతాకాలం చల్లగా ఉండ డం వల్ల ఈ ప్రక్రియ వేగంగా 60 నుంచి 90 రోజుల్లో కొబ్బరి పొట్టు కుళ్లిపోతుంది. ఆవు పేడ, దాని మూత్రం, గ్లైరిసిరియాలను ఈ పొట్టులో పొరల మధ్య వేయడం ద్వారా పొట్టు మరో పది రోజులు ముందుగా కుళ్లడమే కాకుండా మరింత నత్రజని శాతం పెరిగి వ్యవసాయాని బాగా ఉపయోగపడుతుంది. ►ప్లూరోటస్ సాజర్ కాజూను కేరళ, ధవళేశ్వరంల్లో క్వాయర్ బోర్డు కార్యాలయాలు, అంబాజీపేట హెచ్‌ఆర్‌ఎస్‌లో గాని రైతులు పొందవచ్చు. ►పొట్టు కుళ్లే 90 రోజుల సమయంలో రెండు లేదా మూడుసార్లు బాగా తడిపితే పొట్టు మరింత త్వరగా కుళ్లుతుంది. కలిగే ప్రయోజనాలు ►పొట్టుతో తయారు చేసిన సేంద్రియ ఎరువును అన్ని రకాల పంటలకు వాడవచ్చు. ►దీనికి నీటి నిల్వ సామర్థ్యం చాలా ఎక్కువ. నీరు లభ్యత తక్కువగా ఉండే కరువు ప్రాంతాలకు ఇది వరం. ►అతి తక్కువ బరువు ఉండడం వల్ల విమానాల్లో రవాణా చేసే మొక్కలకు ఉపయోగకరం. ప్రయాణాల్లో నీరు వేయాల్సిన పని లేదు. ►పాలీ హెజ్ల్లో, నర్సరీ ట్రేలల్లో, జర్జెరా, కార్నేషన్ వంటి పూలమొక్కలకు బాగా ఉపయోగపడుతుంది. ►కూరగాయల విత్తనాలు ట్రేలలో పెంచేందుకు వాడుకోవచ్చు. ►సేంద్రియ, జీవన, రసాయనిక ఎరువులను నీటితో కలిపి సులువుగా దీనిలో వేసి మొక్కలకు నెమ్మదిగా అందించవచ్చు. ►ఈ పొట్టు వల్ల మొక్కల వేర్లకు గాలి బాగా సోకి మొక్క ఆరోగ్యంగా పెరుగుతాయి. ►వేసవిలో మొక్కలకు నీటి ఎద్దడికి గురి కాకుండా నర్సరీ కవర్లో పైన వేసేందుకు చాలా ఉపయోగపడుతుంది. ►నీరు లేని (కంప్రెస్డ్) కుళ్లిన కొబ్బరి పొట్టు బరువు చాలా తక్కువగా ఉండడం వల్ల దూర ప్రాంతాలకు తక్కువ వ్యయంతో ఎక్కువ పొట్టును రవాణా చేయవచ్చు.