breaking news
Railway level crossing gates
-
కాపలాలేని రైల్వే క్రాసింగుల తనిఖీ
ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బోర్డులు, స్పీడ్‌బ్రేకర్ల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: కాపలాలేని రైల్వేలెవల్ క్రాసింగుల వద్ద వెంటనే గేట్లను ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. పక్షంరోజుల పాటు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. మాసాయిపేట లెవల్ క్రాసింగ్ వద్ద జరిగిన ఘోర దుర్ఘటన నేపథ్యంలో రైల్వే నిర్లక్ష్యంపై విమర్శల జడివాన కురుస్తోంది. అక్కడ గేటు ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదని, గేటు ఏర్పాటులో జాప్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ సోమవారం ఆరు డివిజన్ల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి స్పెషల్‌డ్రైవ్ పై సూచనలు చేశారు. లెవల్‌క్రాసింగ్‌ల వద్ద ఆర్పీఎఫ్ నిఘా గేట్లు ఉన్న చోట అవి పడ్డ తర్వాత దానికింద నుంచి ద్విచక్రవాహనాలు దూరి వెళ్లడాన్ని జీఎం తీవ్రంగా పరిగణించారు. దాన్ని నివారించేందుకు జంటనగరాల్లోని కొన్ని కీలకగేట్ల వ ద్ద ప్రత్యేకంగా ఆర్పీఎఫ్ సిబ్బందిని నియమించారు. రైలువచ్చే సమయంలో కొన్ని నిమిషాల సేపు మాత్రమే గేటు మూస్తారని, ఆ కొద్ది సమయంలో ఓపికతో ఉండాలని, ఈలోపే గేటు కిందనుంచి దూరి ప్రమాదాలకు గురికావడం సరికాదంటూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తారు. ఇది వారంపాటు సాగుతుందని సీపీఆర్ఓ సాంబశివరావు తెలిపారు. ఆ తర్వాత సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేస్తారని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి, రూ.వేయి జరిమానా, ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని తెలిపారు. సబ్‌వేలు ఏర్పాటు చే స్తాం... గేట్లను ఏర్పాటు చేయటమే కాకుండా సబ్‌వేలు, ఆర్యూబీల నిర్మాణం, పక్క మార్గాలకు మళ్లించి ఆ దారులను మూసివేయడం లాంటి ప్రత్యామ్నాయాలను అనుసరిస్తున్నట్టు సీపీఆర్ఓ వివరించా రు. నెలకు 20 వేల వాహనాలు ప్రయాణించే మా ర్గాల్లోనే గేట్లు ఏర్పాటు చేయాలనడం సరికాదని, రైళ్లు, రోడ్డు వాహనాల సంఖ్యను సంయుక్తంగా పరిగణిస్తూ (టీవీయూ) రోజుకు 3 వేల టీవీయూలుండే మార్గాలను ఎంపిక చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
రైల్వే గేట్ల వద్ద కాపలా ఏర్పాటు
డోర్నకల్ -కారేపల్లి మార్గంలో ఇద్దరు గ్యాంగ్‌మన్లకు విధులు డోర్నకల్ : డోర్నకల్ -కారేపల్లి మార్గంలో రెండు రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే అధికారులు కాపలాను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో ఇటీవల జరిగిన దుర్ఘటన నేపథ్యంలో జిల్లాలోని రైల్వే గేట్ల వద్ద నెలకొన్న దుస్థితిపై ఈ నెల 25న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పందించిన అధికారులు డోర్నకల్ జంక్షన్ పీడబ్ల్యూ అధికారులు పుల్లూరు, వస్రాంతండాల మధ్య గల ఎల్సీ-1 గేటుతోపాటు పోచారం రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఎల్సీ-3 గేటు వద్ద గ్యాంగ్‌మన్లను నియమించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకరిని, రాత్రి నుంచి ఉదయం వరకు ఒకరిని గేట్ల వద్ద కాపలా ఏర్పాటు చేశారు. గేట్ల వద్ద విధులు నిర్వర్తిస్తున్న గ్యాంగ్మన్లు రైలు వచ్చిపోయే సమయంలో జనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. గేటు దాటేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా.. రైల్వే గేటు మీదుగా ఎన్ని వాహనాలు, మనుషులు, పశువులు వెళ్తున్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. ఆయూ గేట్ల వద్ద రద్దీని పరిశీలించి అక్కడ గేటు ఉంచాలా... లేదా... అనేది రైల్వే అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.