breaking news
Railway decision
-
డెక్కన్ క్వీన్‌కు కొత్త లుక్
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై, పుణే నగరాల మధ్య నడిచే డెక్కన్ క్వీన్ రైలు కొత్త సొబగులతో ప్రయాణికులను అలరించనుంది. పారదర్శక విస్టాడోం కోచ్‌లతో పరుగులు తీయనుంది. ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త రూపుతో డెక్కన్ క్వీన్ పరుగులు తీసేలా సుముహూర్తం ఖరారైంది. ఇటీవల డెక్కన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏర్పాటుచేసిన పారదర్శక విస్టాడోం కోచ్‌లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులకు మరో కానుక అందజేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ముంబై, పుణేల మధ్య నడిచే డెక్కన్ క్వీన్‌కు కూడా పారదర్శక విస్టాడోం కోచ్‌లు ఏర్పాటు చేయాలని సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు పంద్రాగస్టు నుంచి డెక్కన్ క్వీన్ రైలు సాధారణ కోచ్‌లకు బదులుగా విస్టాడోం కోచ్‌లతో పరుగులు తీయనుంది. ముంబై, పుణే నగరాల మధ్య అప్పటివరకు సాధారణ బోగీలతో నడిచిన డెక్కన్ ఎక్స్‌ప్రెస్ రైలుకు విస్టాడోం కోచ్‌లు ఏర్పాటు చేసి, జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభించారు. ఈ కోచ్‌ల పైకప్పు, ఇరువైపులా అద్దాలతో కూడిన పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. దీంతో రైలులో ప్రయాణిస్తుండగానే ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా కర్జత్–ఖండాలా–లోణావాలాల మధ్య ఘాట్ సెక్షన్ ఉంది. అక్కడ ఎటు చూసిన పచ్చని ప్రదేశం, అనేక కొండలు, సొరంగాలు, కొండల పైనుంచి పారుతున్న జలపాతాలు ఇలా అనేక అందాలను తిలకించవచ్చు. ఈ ప్రాంతాల మీదుగా రైలు వెళుతుండగా ఇరుదిక్కుల నుంచి తిలకించే ప్రకృతి అందాలు మైమరింపజేస్తాయి. ఈ రైలు ప్రారంభించిన నాటి నుంచి ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మొన్నటి వరకు ఖాళీగా తిరిగిన ఈ రైలు పర్యాటకులు, ప్రయాణికుల వల్ల రైల్వేకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. దీంతో ఇదే తరహాలో డెక్కన్ క్వీన్ రైలుకు కూడా విస్టాడోం కోచ్‌లు ఏర్పాటు చేయాలని రైల్వే సంకల్పించింది. ఈ మేరకు ఆగస్టు 15వ తేదీన విస్టాడోంలతో కూడిన డెక్కన్ క్వీన్ రైలు నంబర్ 02124 పుణే నుంచి ఉదయం 7.15 గంటలకు బయలుదేరి ముంబై సీఎస్ఎంటీకి ఉదయం 10.25 గంటలకు చేరుకుంటుంది. రైలు నంబర్ 02123 ముంబై సీఎస్ఎంటీ నుంచి సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి రాత్రి 8.25 గంటలకు పుణే చేరుకుంటుంది. ఆగస్టు 8వ తేదీ నుంచి ఈ కొత్త డెక్కన్ క్వీన్ రిజర్వేషన్ల బుకింగ్ ప్రారంభమైందని రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా విస్టాడోం కోచ్‌లతో కూడిన డెక్కన్ క్వీన్ రైలుకు నాలుగు ఏసీ చెయిర్ కార్లు, తొమ్మిది సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు, మరో రెండు సామాన్య సిట్టింగ్‌తో పాటు గార్డు, బ్రేక్ వ్యాన్, ఒక ప్యాంట్రీ కారు ఉన్నాయి. ఇందులో టికెటు కన్ఫర్మ్ అయినవారినే అనుమతించనున్నారు. పర్యాటకుల కు, నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులకు స్టేషన్లో ప్రవేశించక ముందే థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష లు నిర్వహిస్తారు. కోవిడ్ నియమాలకు కట్టుబడి ఉంటేనే రైల్వే ప్లాట్‌ఫారంపైకి అనుమతిస్తామని రైల్వే అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
గణేశ్ ఉత్సవాలకు 100 ప్రత్యేక రైళ్లు
ముంబై : గణేశ్ ఉత్సవాల సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా 100కు పైగా రైళ్లు నడపాలని సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 118 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. అందులో 36 రైళ్లు లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) నుంచి మడ్గావ్ వరకు నడవనున్నాయి. 01005 నంబర్ రైలు ఎల్టీటీ నుంచి అర్ధరాత్రి 12.55కు బయలుదేరి మడ్గావ్కు మధ్యాహ్నం 2.40కి చేరుకుంటుంది. ఈ సేవలు సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు (గురువారం మినహా) కొనసాగుతాయి. అలాగే 01006 నంబర్ రైలు మడ్గావ్లో మధ్యాహ్నం 3.25కు బయలుదేరి ఉదయం 3.55కు ఎల్టీటీకి చేరుకుంటుంది. ఈ సేవలు సెప్టెంబర్ 8 నుంచి 28 వరకు (గురువారం మినహా) కొనసాగుతాయి. గోవాలోని కర్మాలీ నుంచి ఎల్టీటీకి 42 స్పెషల్ రైళ్లు నడవనున్నాయి. సెప్టెంబర్ 8 నుంచి 28 వరకు ఎల్టీటీ నుంచి 01025 అనే నంబర్ రైలు ఉదయం 5.30కు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు కర్మాలీ చేరుకుంటుంది. 01026 నంబర్ రైలు కర్మాలీ స్టేషన్ నుంచి ఉదయం 5.50 కు బయలుదేరి సాయంత్రం 5.45కు ఎల్టీటీ చేరుకుంటుంది. అలాగే 40 డీఈఎంయూ రైళ్లను నడపనున్నట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. టికెట్ బుకింగ్స్ ఆగస్టు 14 నుంచి ప్రారంభం అవనున్నట్లు తెలిపింది.