breaking news
rail bus
-
హ్యాపీ జర్నీ
ప్రభాత భానుని లేలేత కిరణాలు ప్రసరించే వేళ... పచ్చని ప్రకృతి నడుమ... ఉల్లాసంగా సాగిపోయే ఆ వాహనం కేవలం ప్రజలనే కాదు... వారి మధ్య అనుబంధాలను మోసుకుపోతుంది. రైట్... రైట్... అనకపోయినా... పట్టాలపై పరిగెత్తే ఈ బస్సు ఈ ప్రాంతీయుల మనసును పెనవేసుకుపోయింది. స్కూలుకు వెళ్లే విద్యార్థి దగ్గర్నుంచి... సంతకు వెళ్లే అవ్వ వరకూ పల్లె ప్రజలంతా ఆ రైలు కోసం ఎదురుచూస్తుంటారు. ఒకే బోగీ.. ప్రతి చిన్న స్టేషన్లో ఆగి వచ్చేవారందరినీ ఎక్కించుకుని... వారంతా ఎక్కిన తర్వాతే ముందుకు కదిలే ఆ రైలుబండి కేవలం ఓ వాహనం కాదు.. ఆత్మీయతల నిలయం. బొబ్బిలి – సాలూరు పట్టణాల మధ్య కేవలం ఒకే ఒక్క భోగీతో నడుస్తూ రాష్ట్రంలోనే ఏకైక సర్వీసుగా పేరొందిన రైలుబస్సు ప్రయాణం.. ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్. – సాక్షి ప్రతినిధి, విజయనగరం బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం: దేశంలోనే ఎక్కడా లేని రైల్ బస్ బొబ్బిలి–సాలూరు మధ్య మాత్రమే నడుస్తోంది. కేవలం ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నష్టం వస్తున్నా రైల్వే శాఖ అధికారులు దీనిని నడిపిస్తున్నారు. కటక్, పారాదీప్, కాకినాడ ప్రాంతాల్లో గతంలో నడిచే ఈ తరహా రైల్‌బస్‌లు ఇప్పుడు కేవలం బొబ్బిలి–సాలూరు ప్రాంతాలకే దక్కిన ఓ వరం. ఏళ్లతరబడి ఈ రైలు బస్సులో ప్రయాణిస్తున్నవారు ఈ గ్రామాల్లో చాలా మందే ఉన్నారు. ఇల్లు, ఆఫీసు, స్కూలు, కాలేజ్, వాణిజ్య ప్రాంతాల్లో హడావుడి జీవితం గడిపే వారంతా ఈ రైలుబస్సులోకి ఎక్కిన తర్వాత అవన్నీ మర్చిపోతారు. రైలు స్నేహితులతో కులాసాగా కబుర్లు చెప్పుకుంటుంటారు. చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ కాసేపు కలతలన్నీ మర్చిపోతారు. ఈ బస్సులేకుంటే ఇబ్బందే... దాదాపు 75 మంది కూర్చోవడానికి అవకాశం ఉన్న ఈ రైల్‌బస్ ఈ ప్రాంతంలో నడవకపోతే చాలా మంది ప్రయాణికులు బస్సులు, ఆటోల కోసం వ్యయ ప్రయాసలు పడాల్సిందే. బొబ్బిలి నుంచి నారాయణప్పవలస, గొల్లల పే ట, రొంపిల్లివలస, పారన్నవలస, సాలూరు వంటి స్టేషన్ల వద్ద ప్రయాణికులు కిక్కిరిసి ఎక్కుతారు. ఒక్కో స్టేషన్నుంచి సుమారు అక్కడి నాలుగైదు గ్రామాల ప్రజలు ఈ రైల్‌బస్‌ను ఆశ్రయిస్తారు. బోలెడు ఆదా... సాలూరు నుంచి బొబ్బిలి వెళ్లాలన్నా, అక్కడి నుంచి సాలూరు రావాలన్నా కచ్చితంగా రామభద్రపురం రావాల్సిందే. అక్కడ మరో వాహనాన్ని ఆశ్రయించాల్సిందే. 21 కిలోమీటర్ల దూరానికి ప్రయాణ చార్జీలు కూడా ఎక్కువే. బొబ్బిలి నుంచి సాలూరు వెళ్లాలంటే రూ.20 పైనే ఖర్చవుతుంది. అదే రైల్‌బస్ అయితే కేవలం రూ.10 తోనే వెళ్లొచ్చు. మిగతా రైళ్లలో ప్రయాణానికి స్టేషన్లో బుకింగ్ కౌంటర్ వద్ద టిక్కెట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం రైలులోనే టిక్కెట్ ఇస్తారు. మరో ఆసక్తికరమయిన విశేషం ఏమంటే కొన్ని స్టేషన్లలో దిగేందుకు వీరి వద్ద టిక్కెట్లు ముద్రించి ఉండకపోతే చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ (టీటీ) ఒక చీటీ రాసి ఇస్తారు. అప్పటికి అదే టిక్కెట్. కేవలం 75 లీటర్ల డీజిల్‌తో లారీలు, బస్సుల్లో ఉపయోగించే ఇంజిన్‌తో ఈ రైల్ బస్ రోజుకు 14 కిలోమీటర్లు ఐదుసార్లు రెండు పట్టణాల మధ్య నడుస్తుంది. అదే రైలింజన్ వేస్తే ఇదే దూరానికి 1000 లీటర్ల పైనే అవుతుంది. టికెట్ కలెక్టర్‌గా దాదాపు 22 సంవత్సరాల సర్వీసు ఇందులోనే నడిచింది. దీంట్లో పనిచేయడం అదో అనుభూతి. వాస్తవానికి మామూలు రైళ్లలో అయితే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు డీఏ అదనంగా వస్తుంది. ఈ రైల్‌బస్‌లో ఆ అవకాశం లేకపోయినా ఈ రైలంటే మాకదో ప్రత్యేకత. – వసంత రావు ఉమామహేశ్వరరావు, చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ (టీటీ). మాకెంతో ఇష్టం ఈ ప్రయాణం మాకెంతో ఇష్టం. ఈ రైల్బస్తో ఎంతో అనుబంధం పెరిగింది. ఇటీవల కొన్నాళ్లు రైల్‌బస్ నిలిచిపోయింది. ఆ సమయంలో మేమెంతో ఇబ్బంది పడ్డాం. మళ్లీ ఈమధ్య నుంచే నడిపిస్తుండటంతో సంతోషమనిపించింది. – సీహెచ్.నారాయణరావు, పారన్న వలస బస్ నిలిచిపోయాక నెలకు రూ.700 అయ్యేది: ఈ మధ్య ఈ బస్ నిలిచిపోయింది. మాలాంటి విద్యార్థులకు ఇది చాలా కష్టమనిపించింది. సమయం వృథాతో పాటు నెలకు రూ.700లు ఖర్చయ్యేది. అదే రైల్‌బస్ అయితే రూ.150తోనే సరిపోతుంది. – సీహెచ్.మౌనిక, విద్యార్థిని, బొబ్బిలి 8వ తరగతి నుంచీ ఈ బస్‌లోనే వెళ్తున్నా: మాది రొంపిల్లి వలస. నేను ప్రస్తుతం బొబ్బిలిలోని గాయత్రి కాలేజ్‌లో ఇంటర్ చదువుతున్నా. మాకు చదువుకునేందుకు పట్టణం వెళ్లాలంటే ఈ రైల్‌బస్ ఎంతో సౌకర్యం. ఈ బస్‌లో నేను 8వ తరగతి నుంచి వెళ్తున్నా. – పూడి కాంచన, ఇంటర్ విద్యార్థిని మా పిల్లల దగ్గరకు వెళ్తున్నా మాకు ఈ రైల్ బస్సు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. నేనిప్పుడు ఇందులో మా పిల్లల దగ్గరకు వెళ్తున్నా. రైలు బస్ కొన్ని నెలలు ఆగిపోతే పోరాడి మరీ తిరిగి సాధించుకున్నాం. – కిలపర్తి లక్ష్మి, చిన పారన్న వలస మాకిదే తోడు మాది మరిపిల్లి. మేం జంగమయ్యలం. నెలగంటు పెట్టిన నాటినుంచి సంక్రాంతి వరకూ చనిపోయిన పెద్దల్ని పొడుగుతుంటాం. సాధారణ రోజుల్లోనూ ఇలానే వెళ్తాం. రైల్ బస్ మాకు తోడు. దీనిలో వెళితే చాలా సరదాగా ఉంటుంది. –కటమంచి అప్పన్న, మరిపిల్లి -
దండిగాం రోడ్డు వరకూ రైల్‌బస్
సాలూరు రూరల్,న్యూస్‌లైన్ : సాలూరు ప్రాంత ప్రజల కల మరి కొద్ది రోజుల్లో కార్యరూపం దాల్చనుంది. పెరుగుతున్న ఆర్టీసీ బస్సు చార్జీల నేపథ్యంలో రైల్వే చార్జీలు తక్కువగా ఉండడంతో రైల్‌బస్‌లో ప్రయాణించడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. బొబ్బిలి-సాలూరు మధ్య నడుస్తున్న రైల్‌బస్‌ను దండిగాం రోడ్డు వరకూ పొడిగించడానికి రైల్వే శాఖ నిర్ణయించింది. మక్కువ బైపాస్ రోడ్డు మార్గంలో ఉన్న రైల్వే స్టేషన్‌కు పట్టణ, పరిసర ప్రాంత ప్రయాణికులు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దండిగాం రోడ్డు వరకు రైల్‌బస్‌ను నడిపితే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుందని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. సాలూరు పట్టణానికి దగ్గరగా ఉన్న దండిగాం రోడ్డు వరకు రైల్వేట్రాక్ ఉంది. రైల్‌బస్‌ను పొడిగించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఈస్ట్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఇంద్రసేన్‌కు లేఖ రాశారు. ఇందుకు వారి స్పందించి రైల్‌బస్‌ను పొడిగించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజన్నదొర వద్ద ఫోన్లో ప్రస్తావించగా సాలూరు ప్రజలు సౌకర్యార్థం రైల్‌బస్‌ను పొడిగించేందుకు నిర్ణయం తీసుకున్నారని, రైల్వే జీఎం నుంచి లేఖ తనకు వచ్చిందని చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే సంబందిత పనులు చేపట్టనున్నట్టు లేఖలో పేర్కొన్నారన్నారు. సర్వత్రాహర్షం రైల్ బస్ సేవలను వినియోగించుకోవాలని సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న సాలూరు పరిసర ప్రాంత వాసులకు విషయం తెలియడంతో సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. సాలూరు నుంచి బొబ్బిలికి ఆర్టీసీ బస్సులో వెళ్లాలంటే 15 రూపాయలు చార్జీ వసూళు చేస్తున్నారని, అదే రైల్‌బస్‌లో వెళితే కేవలం 5 రూపాయలు సరిపోతుందని చెబుతున్నారు.