దక్షిణాసియా చెస్ చాంప్ రాఘవ్
హైదరాబాద్: దక్షిణాసియా అమెచ్యూర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు రాఘవ్ శ్రీవాత్సవ్ టైటిల్ సాధించాడు. జమ్ములో జరిగిన ఈ టోర్నీలో తొమ్మిది రౌండ్లకు గాను అతను 8 పారుుంట్లతో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో పరాజయం ఎరుగని రాఘవ్ ఏడు గేముల్లో గెలిచి... మరో రెండు గేముల్ని డ్రా చేసుకున్నాడు. పి.కె.సురేశ్ (కేరళ)కూడా 8 పారుుంట్లతో ఉన్నప్పటికీ టైబ్రేక్‌లో రాఘవ్‌ను విజేతగా ప్రకటించారు.
ఇతనికి ట్రోఫీతో పాటు రూ. 2 లక్షల ప్రైజ్‌మనీ దక్కగా, రన్నరప్‌గా నిలిచిన కేరళ కుర్రాడికి రూ. లక్షా 25 వేల నగదు బహుమతి లభించింది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, నేపాల్‌లకు చెందిన సుమారు 400 మంది ఆటగాళ్లు ఇందులో పోటీపడ్డారు. రాష్ట్రానికి చెందిన మరో ఆటగాడు శ్రీతన్ సాయ్పురికి ప్రత్యేక బహుమతి లభించింది. వీరిద్దరిని తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షుడు నరసింహా రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర రావు అభినందించారు.