breaking news
Raavi venkata ramana
-
సర్పంచ్‌లు టీడీపీలో చేరేది అవాస్తవం..
గుంటూరు: మంత్రి రావెల కిషోర్ బాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రావి వెంకటరమణ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. గుంటూరులో ఆయన ఆదివారం మాట్లాడుతూ...ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద మెప్పుకోసమే మంత్రులు అవాస్తవాలు చెప్పుతున్నారని దుయ్యబట్టారు. గుంటూరుకు చెందిన 40 మంది వైఎస్సార్ సీపీ సర్పంచ్‌లు టీడీపీలో చేరుతున్నట్లు వెల్లడించిన మంత్రి రావెల వ్యాఖ్యలు అవాస్తమని రావి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సానుభూతిపరులే ఆ పార్టీలో చేరారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు ఎవ్వరూ చేరలేదని చెప్పారు. టీడీపీలో చేరిన 40 మంది సర్పంచ్ల పేర్లను వెల్లడించాలన్నారు. సీఎంకు గొప్పలు చెప్పుకునేందుకే రావెల ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వెంకటరమణ అన్నారు. -
వెంకటరమణను అరెస్టు చేయొద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి వెంకటరమణను అరెస్టు చేయవద్దని ఎక్సైజ్ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా ఎడ్లపాలెం మండలం మర్రిపాలెం గ్రామంలో ఉన్న జి.టి.టెక్స్‌టైల్స్‌లో ఎక్సైజ్ అధికారులు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో రావి వెంకటరమణను మూడో నిందితునిగా పేర్కొన్నారు. వెంకటరమణను అరెస్టు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తుండడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ నూతి రామ్మోహనరావు విచారించారు. జి.ఐ.టెక్స్టైల్స్తోగానీ, అక్కడ దొరికిన మద్యంతోగానీ వెంకటరమణకు ప్రస్తుతం ఎటువంటి సంబంధం లేదని, దానిని షేక్ బాజీ అనే వ్యక్తికి గత ఏడాది లీజుకు ఇచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది బి.పి.మోహన్ కోర్టుకు నివేదించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వెంకటరమణపై కేసు నమోదు చేశారని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, మే 7వ తేదీ వరకు వెంకటరమణను అరెస్టు చేయవద్దని ఎక్సైజ్ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.