breaking news
Quid Pro case
-
కక్ష రాజకీయాల్లో తెలంగాణ తీరు వేరు!
తెలంగాణలో ఈ-ఫార్ములా కేసు ఆసక్తికరంగా మారుతోంది. ఈ-ఫార్ములా రేసు సంస్థకు రూ.44 కోట్లు విడుదలకు బాధ్యుడిని తానేనని, అందులో తప్పేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కుండబద్దలు కొట్టడం ఒక రకంగా ధైర్యమైన పనే అని చెప్పాలి. అయితే ఈ ఉదంతంలో క్విడ్ ప్రో కో జరిగిందని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ చెప్పిన తీరు చూస్తే ఊహజనిత అంశాలపై ఆధారాపడే ఆ నిర్ణయానికి వచ్చారా? అనిపించకమానదు. ఈ వ్యవహారంలో అసలు తప్పు జరిగిందా లేక కేటీఆర్‌పై పనికట్టుకుని కేసు పెట్టారా? అన్నది పరిశీలించాల్సిన విషయం. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ఒక పత్రిక ఫార్ములా ఈ రేస్ స్కామ్‌లో రూ.600 కోట్ల క్విడ్ ప్రోకో అన్న శీర్షిక పెట్టింది. దానిని చూస్తే అంత భారీ మొత్తం బీఆర్ఎస్కు లభించిందా అనిపిస్తుంది. కాని మొత్తం కథనం చూస్తే ఈ మొత్తం వ్యవహారంలో హెచ్ఎండీఏ బోర్డు ఖజానా నుంచి మొత్తం రూ.54.87 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కథ ఆగిపోయిందని, లేకుంటే రూ.600 కోట్ల స్కామ్ జరిగేదని ఏసీబీ నివేదిక స్పష్టం చేసిందని ఆ పత్రిక రాసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఇది స్కామ్అని ఏసీబీ కూడా చెప్పేది కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి.ఈ ఫార్ములా రేసులో రూ.600 కోట్లు ఖర్చు చేసేలా అగ్రిమెంట్స్ చేసుకున్నారని, ఇందుకు పలు రూపాలలో ప్రతిఫలం పొందేలా ప్రణాళిక రూపొందించారని ఏసీబీ తెలిపిందట. మొత్తం రూ.600 కోట్లు ఖర్చు చేస్తే, ఆ మొత్తం అంతా బీఆర్ఎస్కు ఎలా వెళుతుందో, అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందో అర్థం కాదు. ఈ ఫార్ములా రేస్ ఒక సీజన్ లో నిర్వహిస్తే అయ్యే ఖర్చు ఎంత? అందులో క్విడ్ ప్రోకోకి ఎంత అవకాశం ఉంటుంది అన్నది ఆలోచిస్తే పలు సందేహాలు వస్తాయి. బ్రిటన్‌కు చెందిన ఫార్యులా ఈ ఆపరేషన్స్ , హైదరబాద్‌కు చెందిన గ్రీన్ కో, ఎస్నెస్ట్ జెన్ అనే సంస్థల మధ్య ఈ రేసు నిర్వహణకు 2022లో త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది, 2023 ఫిబ్రవరిలో సీజన్ తొమ్మిదిగా రేసు నిర్వహించారు. ఆ తర్వాత బ్రిటన్ కంపెనీకి, నెక్స్ట్ జెన్ మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ ఫార్ములా సంస్థ తనకు రావల్సిన నిధులు రాకపోవడంతో రేసును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నెక్స్ట్ జన్ సంస్థకు ఈ రేస్‌లో నష్టం వచ్చిందట. ఆ మీదట ఆ కంపెనీ తదుపరి సీజన్లకు రూ.600 కోట్లు ఖర్చు చేయలేక చేతులెత్తేసింది. దాంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థతో మున్సిపల్ శాఖ మరో ఒప్పందం చేసుకుని ఈవెంట్ నిర్వహణకు అన్నీ కలిపి రూ.110 కోట్లు చెల్లించడానికి అంగీకరించారు. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఆదేశాలు తీసుకోకుండా ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు 2023 అక్టోబర్ లో హెచ్ఎండీఏ నుంచి కేటీఆర్ రూ.45.71 కోట్ల నిధులు విడుదల చేయించారన్నది అభియోగం. ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోలేదన్నది మరో అభియోగం. ఫలితంగా హెచ్ఎండీఏకి రూ.75 కోట్ల నష్టం వచ్చిందని ఏసీబీ వాదన. దీనిని పరిశీలిస్తే కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలలో సాంకేతిక లోపాలు ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు నిర్ధిష్ట నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఏ మంత్రి అయినా స్వతంత్రంగా ఇలా చొరవ తీసుకుంటే ఇబ్బందులు వస్తామి, మంత్రిగా కెటిఆర్ ఉద్దేశంలో ఏదైనా లోపం ఉంటే తప్పే అవుతుంది. కాని ఆయన చెబుతున్న దాని ప్రకారం హైదరాబాద్ ఇమేజీని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి ఈ రేస్ ఉపయోగపడుతుంది. అది నిజమా? కాదా? అన్నదానిని ప్రస్తుత ప్రభుత్వం చర్చించిందో లేదో తెలియదు. ఏసీబీ ఆ కోణం జోలికి వెళ్లినట్లు అనిపించదు. కాగా ఈ ఈవెంట్లో బీఆర్ఎస్కు భాగస్వామిగా ఉన్న గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థల ద్వారా రూ.41 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు నిధులు వచ్చాయట.ఆ తర్వాత గ్రీన్ కో, ఈ ఫార్ములా సంస్థలు ఈవెంట్ ప్లాన్ చేశాయన్నది అభియోగంగా ఉందని మీడియా వార్తలు సూచిస్తున్నాయి. ఈ గ్రీన్ కో సంస్థ ఈ ఈవెంట్లో భాగస్వాములుగా ఉన్న ఇతర కంపెనీలతో తమ ఉత్పత్తుల మార్కెటింగ్ ఒప్పందాలు చేసుకుందట. గ్రీన్ కో కంపెనీ బీఆర్ఎస్ కు నిధులు ఇవ్వడం ఎలా తప్పు అవుతుంది? ఆ మాటకు వస్తే బీజేపీ, కాంగ్రెస్ లకు అనేక కంపెనీలు విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చాయి. వాటికే పలు ఇతర రాజకీయ పార్టీలకు అదే విధంగా నిధులు అందాయి. ఆ కంపెనీలు ప్రభుత్వంలో కాంట్రాక్టులు పొందుతుంటాయి. ఈ బాండ్లు ఇవ్వకపోయినా కాంట్రాక్టులు చేస్తుంటాయి. . అందులో క్విడ్ ప్రోకో ఉందని ఆరోపిస్తే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లు, ఆయా కంపెనీలతో ఉన్న సంబంధాలపై విచారణ చేయించాలి. అందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమా? పైగా ఎలక్టోరల్ బాండ్స్‌కు, ఈ కేసుకు లింక్ పెట్టిన తీరు కూడా అంత సమర్థనీయంగా లేదు. గ్రీన్ కోకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఏమైనా భారీ రాయితీ నిబంధనలకు విరుద్దంగా వచ్చిందా అన్నది ఎక్కడా చెప్పినట్లు లేదు.పైగా వారు కూడా ఇందులో ఎంతొకొంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది కదా! కేటీఆర్ సహా పదిమందిపై ఏసీబీ కేసులు పెట్టింది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిన రూ.45.71 కోట్ల నిధులు ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు చేరాయని, ఇందులో అవినీతి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఎవరూ కోరకపోయినా, ఇందులో అవినీతి ఉందా? లేదా? అన్నదానిపై తాను లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్దమని అని సవాల్ విసిరారు. అలాగే రేవంత్ కూడా సిద్దం అవుతారా అని ప్రశ్నించారు. రేవంత్ గతంలో ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ సవాల్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొరికావా? లేదా? అని ఆయన అడిగారు. రేవంత్ పై అప్పట్లో కేసు పెట్టినందున ఏదో రకంగా తనపై ఏసీబీతో కేసు పెట్టించారన్నది కేటీఆర్ అభిప్రాయం.. తానే నిధులు విడుదల చేయించానని, హైదరాబాద్ ప్రతిష్ట కోసమే చేశానని కేటీఆర్ చెబుతున్నారు. ఒక రాజకీయ నేత ఇలా ధైర్యంగా తానే నిధులు మంజూరు చేశానని చెప్పడం అరుదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేస్‌ను కొనసాగించకపోవడం వల్ల హైదరాబాద్‌కు ఈ రంగంలో వచ్చే అవకాశం ఉన్న వందల కోట్ల పెట్టుబడులు ఆగిపోయాయని ఆయన అంటున్నారు. ఈ కోణంలో ప్రభుత్వం జవాబు ఇవ్వడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక పరిణామం ఏమిటంటే కేటీఆర్‌ను, ఆనాటి మున్సిపల్ శాఖ కార్యదర్శిని ,ఇతర అధికారులను ఏసీబీ విచారించినా, ఎవరిని అరెస్టు చేయలేదు. అంతేకాక ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే కోర్టులో ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేస్తుందని వార్తలు సూచిస్తున్నాయి. ఇది ఒకరకంగా మంచిదే. ఏదో కేసు పెట్టి ప్రతిపక్ష రాజకీయ పార్టీకి చెందిన వారిని, కొందరు అధికారులను ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేయడం కన్నా, విచారణ తర్వాత కోర్టులో నేరుగా ఛార్జిషీట్ వేయడం సరైన చర్య. ఈ వార్తలను బట్టి కేటీఆర్‌ను, ఇతరులను అరెస్టు చేయకపోవచ్చన్న అభిప్రాయం కలుగుతుంది.ఇందులో కొత్తగా సాక్ష్యాలు పోయేవి కాని, సాక్షులను ప్రభావితం చేసేది కాని ఏమీ ఉండదు. నిధుల మంజూరుకు తానే బాధ్యుడనని కేటీఆర్ ఇప్పటికే చెప్పినందున, అందులోని ఉద్దేశాలపైనే దర్యాప్తు జరిపి ఈ క్విడ్ ప్రోకో అనో, ఎలక్టోరల్ బాండ్లు అనో కేసు పెట్టినట్లు అనిపిస్తుంది. ఏపీలో ఇప్పుడు జరుగుతున్న కక్ష రాజకీయాలు చూస్తున్నవారికి, తెలంగాణలో కూడా కొంతమేర అలాగే సాగుతున్నాయన్న విమర్శకు తక్కువ అవకాశం ఇచ్చారనుకోవాలి. ప్రభుత్వం ఈ కేసు ముందుకు వెళ్లడానికి అనుమతి ఇస్తుందా? దీనికి గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకుంటారా? అన్నది చూడాలి. ప్రభుత్వం నేరుగా అనుమతి ఇచ్చినా కోర్టులో ఇది ఇప్పటికిప్పుడు తేలుతుందని అనుకోజాలం. ఒక వేళ కోర్టులో ఇందులో తప్పు జరిగిందని తేలితే కేటీఆర్‌కు రాజకీయంగా కొంత నష్టం జరుగుతుంది.కేసు కొట్టివేసే పరిస్థితి వస్తే రేవంత్ ప్రభుత్వం కావాలని ఈ కేసు పెట్టిందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఏదిఏమైనా ఈ వ్యవహారంలో సాంకేతికంగా కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు కాని అవినీతి రుజువు చేయడం అంత తేలికైన పనికాకపోవచ్చు.-కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
దోపిడీకి రాచబాట
రాజధాని అమరావతిని చంద్రబాబు తన అవినీతికి అక్షయపాత్రగా మార్చుకున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన అవినీతికి సాధనంగా చేసుకుని యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. అందుకు మరో ఉదాహరణ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్. కేవలం కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారంగా మార్పులు చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం చంద్రబాబుకే చెల్లింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి పాల్పడ్డ అవినీతి విస్మయ పరుస్తోంది. అందుకోసం లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో చినబాబు లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లుకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌కు కూడా పిడికెడు వాటా ఇవ్వడం కొసమెరుపు. ఇంతటి భారీ అవినీతికి రాచబాట వేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వెనుక గూడు పుఠాణీ ఇలా సాగింది. –సాక్షి, అమరావతి చంద్రబాబు అలైన్‌మెంట్‌కు కన్సల్టెన్సీ ద్వారా రాజముద్ర సీఆర్డీఏ అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రూపొందించడంపై చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఎందుకంటే ఆ అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలోని పెద్దపరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా వెళ్తుంది. అంటే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి నిర్మించాల్సి వస్తుంది. దాంతో తమ భూముల విలువ అమాంతం పెరగదని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలు ఉన్న తాడికొండ, కంతేరు, కాజలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజలలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. మేర అలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తీసుకొచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అప్పటికే సీఆర్డీఏ అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. తాడికొండ, కంతేరు, కాజలలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకునే అలైన్‌మెంట్‌ను ఎస్టీయూపీ ఖరారు చేసింది. రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, ఆయన బినామీ, సన్నిహితుడైన లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. కంతేరు, కాజలలో లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు చేశారు. చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేశ్ తన సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తర్వాత ఎకరా రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లు పెరిగింది. కాగా మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే. ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. కృష్ణా నదికి ఇవతలా అవినీతి మెలికలే కృష్ణానదికి ఇవతల విజయవాడ శివారులో నారాయణ తమ ఆస్తుల విలువ భారీగా పెంచుకున్నారు. సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తారు. గుంటూరు జిల్లాలోని నూతక్కి–కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప–ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్‌రోడ్డు కొనసాగుతుంది. అయితే అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దీంతో ఈ అలైన్‌మెంట్‌పై నారాయణ సీఆర్డీఏ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఆర్డీఏ సమావేశంలో అధికారులను పరుష పదజాలంతో దూషిస్తూ అలైన్‌మెంట్‌ను మార్చాలని ఆదేశించారు. దాంతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం–కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. ఏ–1 చంద్రబాబు, ఏ–6 లోకేశ్ ఇన్నర్ రింగ్ రింగ్‌రోడ్డు కుంభకోణంపై సీఐడీ సమగ్ర దర్యాప్తు జరిపి కీలక ఆధారాలు సేకరించింది. ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ, ఏ–3 లింగమనేని రమేశ్, ఏ–4 లింగమనేని రాజశేఖర్, ఏ–5 అంజినీ కుమార్, ఏ–6గా లోకేశ్‌లపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసం, నారాయణ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది. -
జగన్ కేసులో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు
-
జగన్ కేసులో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ ఈరోజు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఇందూ టెక్ ప్రాజెక్టు, లేపాక్షి నాలెడ్జి హబ్‌లకు సంబంధించి ఈ ఛార్జి షీట్లు దాఖలు చేశారు. 8 డబ్బాలలో ఛార్జీషీట్ ప్రతులను సిబిఐ కోర్టుకు తీసుకువచ్చింది. లేపాక్షి నాలెడ్జి హబ్ ఛార్జి షీట్లో మొత్తం 14 మందిని నిందితులుగా పేర్కొంన్నారు. 9వ నిందితురాలిగా మంత్రి గీతారెడ్డి పేరుని, 11వ నిందితుడిగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరుని చేర్చారు. ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, శ్రీనివాస బాలాజీ, శ్యామ్యూల్, మురళీధర రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పేర్లను కూడా పేర్కొన్నారు. ఇందూ టెక్ ప్రాజెక్టు ఛార్జి షీట్లో పది మంది నిందితులుగా పేర్కొన్నారు. 8వ నిందితురాలిగా సబితా ఇంద్రారెడ్డిని పేరు చేర్చారు. బిపి ఆచార్య, శ్యాంప్రసాద రెడ్డి, రత్న ప్రభ పేర్లను కూడా చేర్చారు.


