breaking news
pula ravindar
-
అది ప్రజల మాటే
సాక్షి, హైదరాబాద్: ‘జానాబాబా 40 దొంగలు’అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన కుసంస్కారానికి నిదర్శనమంటూ సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించడాన్ని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తప్పుబట్టారు. రాష్ట్రాన్ని 60 ఏళ్లు పాలించి దోచుకున్న కాంగ్రెస్ నేతల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మంత్రి కేటీఆర్ కూడా అదే మాట అన్నారని, ఇందులో అనుచితమేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను నిత్యం బండ బూతులు తిట్టే కాంగ్రెస్ నేతలు నీతులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, పూల రవీందర్‌తో కలసి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గుడ్డలు ఊడదీసి కొడతాం, దవడలు పగులగొడతామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే ఆ పార్టీ పెద్దలకు సంస్కా రం గుర్తురాలేదా అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. జానారెడ్డికి కాంగ్రెస్‌లో గౌరవం లేకు న్నా, సీఎం కేసీఆర్ గౌరవం ఇస్తున్నారని చెప్పారు. నల్లగొండ సభలో జాతీయ నాయకుల ముందే కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన నాయకులు అసభ్యంగా మాట్లాడితే జానారెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపై ప్రజలు సంతో షంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలను ఇంటికి పంపించడానికే ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్ ప్రజల మెప్పు పొంది నాయకుడయ్యారని జగదీశ్‌రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని, కాంగ్రెస్ నేతలకు చేతనైతే అసెంబ్లీలో మాట్లాడాలని సవాల్ చేశారు. కాంగ్రెస్‌పైనే ప్రజాగ్రహం తెలంగాణ వస్తే చీకటి రోజులు వస్తాయంటూ నాటి కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బెదిరించారని...కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రజలు, రైతులకు 24 గంటల నిరంతర కరెంటును ఇస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. విత్తనాల కోసం రోజుల తర బడి క్యూలలో నిలబెట్టిన పాలన కాం గ్రెస్ పార్టీదని... ఇంటికే విత్తనాలను పంపిస్తున్న పార్టీ తమదన్నారు. మోస కారి కాంగ్రెస్ నేతలపై ప్రజలకు కోపం ఉంటుందా లేక అన్ని హామీలనూ నెరవేరుస్తున్న టీఆర్ఎస్ మీద ప్రజలకు కోపం ఉంటుందా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి వల్ల తెలంగాణ పేరు మూడేళ్లలోనే ప్రపంచంలో మారుమోగిపోతోందన్నారు. గ్రామస్థాయి నుంచి కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు. -
కౌన్సిల్లో మీ గొంతుకనవుతా..
నల్లగొండ: ‘విద్య’తోనే ప్రగతి... అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం.... ఉమ్మడి సర్వీసు రూల్స్ లేక పదేళ్లుగా నిలిచిపోయిన కీలకపోస్టుల పదోన్నతులు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు ‘కల్పన’గానే మిగిలిపోతున్నది. హెల్త్‌కార్డుల జారీకి స్పష్టమైన నిబంధనల కోసం ఎదురుచూపులు.... ఆశల లోకంలో విహరింపజేస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటన, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.... పాఠశాలల పనివేళల మార్పుతో ఇబ్బందులు.. ఇలా ఎన్నో హామీలపై గత పాలకుల వాగ్దానాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నల్లగొండలో పలువురు ఉపాధ్యాయులు, సంఘ నేతలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ కలుసుకున్నారు. ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కౌన్సిల్లో మీ గొంతుకనవుతానని భరోసా ఇచ్చారు. నల్లగొండ నుంచి పూల రవీందర్ వీఐపీ రిపోర్ట్... పూల రవీందర్ : ఏమండీ నర్సింహారెడ్డి గారు.. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులెదురవుతున్నాయి? కోమటిరెడ్డి నర్సింహారెడ్డి : సీఎం కేసీఆర్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనడం సంతోషమే. పాఠశాలల్లో నీళ్లున్నా తెచ్చే వారు లేరు. అటెండర్లు, స్వీపర్లను నియమించాలి. మౌలిక వసతులు కల్పించాలి. పూల : హెల్త్‌కార్డులు ఎలా ఉండాలనుకుంటున్నారు? అలుగుపల్లి పాపిరెడ్డి : హెల్త్కార్డ్స్పై స్పష్టమైన నిబంధనలివ్వాలి. ఎయిడెడ్ వారికీ కార్డులివ్వాలి. వారికి 010 పద్దు కింద జీతాలివ్వాలి. 2013 జూలై నుంచి పీఆర్సీని వర్తింపజేస్తూ వెంటనే ప్రకటించాలి. పూల :ప్రభుత్వం నుంచి ఏం కావాలనుకుంటున్నారు? జెల్లా చంద్రమౌళి : ఉమ్మడి సర్వీసురూల్స్ సమస్య పరిష్కారం కాకపోవడంతో గత పదేళ్లుగా ప్రమోషన్లు నిలిచిపోయాయి. వెంటనే డిప్యూటీ ఈఓ, ఎంఈఓ, లెక్చరర్ పోస్టుల్లో పదోన్నతులివ్వాలి. పూల : తెలంగాణ పునర్నిర్మాణానికి మీ సూచన? మునగాల సోమయ్య : కామన్ స్కూల్ విధానాన్ని అమలుపర్చాలి. వేర్వేరు యాజమాన్యాల పరిధి నుంచి అన్ని స్కూళ్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. పూల : మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం బాగున్నాయా? నంద్యాల మోహన్‌రెడ్డి : మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం సరఫరా ముదావహం. పిల్లలు ఇష్టంగా తింటున్నారు. వారికి సరిపడే రీతిలో బియ్యం కోటా పెంచాలి. పాఠశాలల పనివేళలను సవరించాలి. పూల ః పీఈటీల సమస్యలున్నాయా? పి.కృష్ణమూర్తిగౌడ్ : హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ స్థాయి పీఈటీలను, ప్రైమరీ స్కూళ్లలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలి. గ్రౌండ్ ఉంటేనే ప్రైవేట్ స్కూళ్లను ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలి. పూల ః పండిట్లు ఏం ఆశిస్తున్నారు? ఎండీ. యూసుఫుద్దీన్ : 2009 నుంచి పండిట్ల సమస్యను పాలకులు నాన్చుతున్నారు. తెలుగు, ఉర్ధూ, హిందీ పండిట్ల పోస్టుల అప్‌గ్రేడేషన్ ఫైల్‌కు మోక్షం కల్పించాలి. పూల ః మీకున్న సమస్యలేమిటి? కె.రాజారామ్: జీఓ 342 ఎస్సీ, ఎస్టీలు వేతనంతో కూడిన రెండేళ్ల ఉన్నత చదువులకున్న అవకాశాన్ని తొలగించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇలాంటివి పునరుద్ధరించాలి. పూల:ఎలాంటి వేతన సవరణను కోరుకుంటున్నారు? సుంకరి భిక్షంగౌడ్ : 63 శాతం ఫిట్మెంట్తో కూడిన వేతన సవరణను అమలు చేయాలి. 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, 1996 డి.యస్సీలో నియమితులైన ఉపాధ్యాయులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి. పూల : హెడ్మాస్టర్ల సమస్యల పరిస్థితి ఏమిటి? సీహెచ్.చంద్రశేఖర్ : పాఠశాలల్లో కంప్యూటర్లు ఇతర విలువైన పరికరాలుంటున్నాయి. వాచ్మన్లను నియమించాలి. నాన్‌టీచింగ్, పరిశుభ్రత సిబ్బందిని రిక్రూట్ చేయాలి. పూల ఃనాలుగో తరగతి ఉద్యోగుల ఇబ్బందులేమిటి? మర్రి యాదయ్యగౌడ్ : 112 జీఓను సవరించాలి. చాలాకాలం నుంచి పనిచేస్తున్న కాంటింజెంట్ స్వీపర్లు, పార్ట్‌టైమ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి. పూల : వృత్తి విద్య ఉపాధ్యాయులేమంటున్నారు? ఎండీ.కరీం : 8వ తరగతి వరకే రెగ్యులర్ కోర్సులు బోధించాలి. ఆ తర్వాత ఉపాధి యోగ్యమైన వృత్తి వి ద్యా కోర్సులను అందరు విద్యార్థులకు అందించాలి. పూల : హెల్త్‌కార్డులపై ఏం సూచనలిస్తారు? వెంకులు : హెల్త్ స్కీమ్ కోసం ఉపాధ్యాయుల నుంచి ప్రతి నెలా కంట్రిబూషన్ స్వీకరించి నాణ్యమైన వైద్య సేవలందించే విధంగా హెల్త్‌కార్డులు జారీ చేయాలి. పూల :ప్రభుత్వ విద్యా రంగాన్ని ఎలా బలోపేతం చేద్దాం? ఎస్ఎం అలీం : ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం సీఎం కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచే మంచి విద్యనందించేందుకు తరగతికో ఉపాధ్యాయుడిని నియమించాలి. పూల : సెల్ఫోన్ల నిషేధంపై మీ అభిప్రాయం? వెంకటేశ్వర్లు : సెల్ఫోన్లను నిషేధించినంత మాత్రాన పాఠశాలలో ఉదో పెద్ద మార్పును ఆశించలేం. దుర్వినియోగం కాకుండా నిఘా ఉంచితే చాలు. పూల: మహిళా ఉపాధ్యాయుల సమస్యలను వివరిస్తారా? కాలం నారాయణరెడ్డి : పాఠశాలల్లో మహిళా టీచర్లకు టాయిలెట్లు లేవు. మౌలిక వసతులను కల్పించాలి. పాఠశాలల పనివేళలను సవరించాలి. విద్యారంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా.. విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధి చూపుతున్నది. సీఎం కేసీఆర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డిల సహకారంతో సమస్యలను అధిగమించి అభివృద్ధి పథంలో నడిపిస్తా. గత 60 సంవత్సరాల్లో పరిష్కారానికి నోచుకోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. కామన్ సర్వీస్ రూల్స్‌కు త్వరలోనే సానుకూల ఫలితం రానున్నది. మధ్యాహ్న భోజన పధకంలో సన్నబియ్యం పట్ల విద్యార్థులు ఆకర్శితులవుతున్నారు. కడుపు నిండా భోజనం అందించేందుకు బియ్యం కోటా పెంచేందుకు కృషి చేస్తాం. విద్యార్థుల నమోదును పెంచితే తరగతులు పెరుగుతాయి. టీచర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. పీఆర్సీ, హెల్త్‌కార్డుల జారీ, అందరినీ మెప్పించే విధంగా సీఎంతో చర్చిస్తాం. ఇంకా పలు సమస్యలను కౌన్సిల్లో చర్చించి ప్రభుత్వంతో పరిష్కరించేందుకు కృషి చేస్తాం. పూల రవీందర్ హామీలు.. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు కృషి, త్వరలోనే ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ ఏర్పాటు. విద్యార్థుల సంఖ్య పెరిగితే తరగతికో ఉపాధ్యాయుడి నియామకానికి ప్రత్యేక కృషి. పండిట్లు, పీఈటీల అప్‌గ్రెడేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తి 398 టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్లు, 1996 డీ.ఎస్సీ నియమిత టీచర్లకు జరిగిన నష్టం భర్తీ. పాఠశాలల పనివేళల మార్పు, మధ్యాహ్న భోజనంలో బియ్యం కోటా పెంచడం. మెరుగైన పీఆర్సీ, కార్పొరేట్ వైద్యం అందే హెల్త్‌కార్డులు.