breaking news
Public prosicuter
-
బాబు సేవలో పబ్లిక్ ప్రాసిక్యూటర్
సాక్షి, విశాఖపట్నం: అతనొక పబ్లిక్ ప్రాసిక్యూటర్. సరిగ్గా ఏడాదిన్నర క్రితం పీపీగా నియమితులయ్యారు. ఇతని పదవీకాలం 2020 వరకు ఉంది. అంతకుముందు టీడీపీ సర్కార్ హయాంలోనే రెండుసార్లు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ)గా పనిచేశారు. పైగా ప్రతి నెలా ప్రభుత్వం నుంచి రూ.20 వేలకు పైగా గౌరవ వేతనం తీసుకుంటున్నారు కూడా. విశాఖ నగరానికి చెందిన పి.ఎస్.నాయుడు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్నారు. ఇంతటి కీలక పదవిలో పని చేస్తున్న ఏ వ్యక్తి అయినా పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఆర్టికల్ – 21లో రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. కానీ ఇవేమీ తమకు పట్టనట్టుగా పీపీగా పనిచేస్తున్న పీఎస్ నాయుడు టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచార కార్యక్రమంలో తలమునకలవుతున్నారు. అంతేకాదు... తునిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఎన్నికల ప్రచారసభలో సీఎంతో కలిపి వేదిక పంచుకున్నారు. ఇది ముమ్మాటికీ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఎన్నికల నోడల్ అధికారులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే 27 శాతం ఐఆర్ ఇస్తామని, సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను స్వాగతించిన సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు రామాంజనేయులను విధులను నుంచి సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇలా టీడీపీ ఎన్నికల ప్రచారంలో అధికారికంగా పాల్గొంటున్న పీపీ పీఎస్ నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి. -
సీబీఐ హైదరాబాద్ జోన్ పీపీకి పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర నేర పరిశోధన సంస్థ(సీబీఐ) తరఫున హైదరాబాద్ జోన్‌కు పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)గా వ్యవహరిస్తున్న తోట వెంకటరమణకు బుధవారం పదోన్నతి లభించింది. ఈయన్ను సీబీఐ ముంబై జోన్‌కు డిప్యూటీ లీగల్ అడ్వైజర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన రమణ 1995లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ద్వారా సీబీఐలో పీపీగా ఎంపికయ్యారు. ఆపై సీనియర్ పీపీగా పదోన్నతి పొందడంతోపాటు వరుసగా రెండుసార్లు కేంద్రం నుంచి ఉత్తమ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవార్డును అందుకున్నారు. వోక్స్వ్యాగన్, అబ్దుల్ కరీం తెల్గీ నిందితుడిగా ఉన్న నకిలీ స్టాంపుపేపర్ల కుంభకోణాల కేసులతోపాటు మాఫియా డాన్ అబూ సలీం నిందితుడిగా ఉన్న నకిలీ పాస్‌పోర్ట్ కేసులోనూ రమణ సీబీఐ తరఫున న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.