breaking news
pt warrent
-
మంగళవారం దొంగ.. ప్రత్యేక డిజైన్ రాడ్ వాడతాడు
సాక్షి, సిటీబ్యూరో: కేవలం మంగళవారాలు మాత్రమే చోరీలు చేసే చోరశిఖామణి మహ్మద్ సమీర్ ఖాన్ కోసం రెండు రాష్ట్రాల పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఇతడిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న వారు అతడిని తరలించేందుకు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్లు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క తాళాలు పగుల కొట్టడం కోసం సమీర్ ఖాన్ ఖరీదు చేసిన ప్రత్యేక రాడ్ పోలీసులను సైతం ‘ఆకర్షిస్తోంది’. అతడికి ఇది ఎక్కడిది? ఎలా సమీకరించుకున్నాడు? అనే విషయాలు ఆరా తీయాలని నిర్ణయించారు. ఈసారికి సిటీలో రెండే చోరీలు... సమీర్ పఠాన్, షోయబ్ అనే మారుపేర్లు ఉన్న సమీర్ ఖాన్ 2008లో తొలిసారిగా సెల్‌ఫోన్ చోరీ కేసులో ఎస్సార్‌నగర్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. అప్పటి నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వరుసపెట్టి నేరాలు చేస్తూ జైలుకు వెళ్లి వస్తున్నాడు. 2011లో ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, 2014లో గోల్కొండ, ఆర్సీపురం, మల్కాజ్గిరి, కుషాయిగూడ, కీసర ఠాణాల పరిధిల్లో నేరాలు చేసిన ఇతడిపై ఇప్పటి వరకు ఇతడిపై 30 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలోని కలబురిగీ, బీదర్, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోనూ నేరాలు చేశాడు. గత ఏడాది నవంబర్‌లో బెంగళూరు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఈ కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత సైతం నగరంతో పాటు గుల్బర్గా, బీదర్‌ల్లో 15 చోరీలు చేశాడు. వీటిలో నగరంలో డబీర్‌పుర, అంబర్పేట్ ప్రాంతాల్లో రెండు మాత్రమే ఉన్నాయి. నాడు ఫెరోజ్... నేడు షోయబ్... ఇతడికి దృష్టి లోపం ఉండటంతో కేవలం పగటిపూట మాత్రమే... అదీ సహాయకుడితో కలిసే దొంగతనానికి వెళ్తాడు. గతంలో ఫెరోజ్ అనే వ్యక్తితో కలిసి దొంగతనాలు చేశాడు. తాజాగా జైల్లో పరిచయమైన ఓల్డ్ మలక్‌పేట వాసి మహ్మద్ షోయబ్‌ను తన అనుచరుడిగా మార్చుకున్నాడు. అతడితో కలిసే 15 చోరీలకు పాల్పడ్డాడు. విజయవాడ, కృష్ణలంకలో ఫెరోజ్‌తో కలిసి గత ఏడాది అక్టోబర్‌లో చోరీ చేశాడు. నవంబర్‌లో బెంగళూరు పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఈ విషయం బయటపెట్టలేదు. దీంతో ప్రస్తుతం మిగిలిన 12 కేసులతో పాటు ఇందులోనూ వాంటెడ్‌గా ఉన్నాడు. నగరంలో అరెస్టుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా పోలీసులు పీటీ వారెంట్ల దాఖలు చేసుకుని తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ రాడ్స్‌తో అనర్థాలే... ఎంపిక చేసుకున్న ఇంటి తాళం పగులగొట్టేందుకు సమీర్ ప్రత్యేక డిజైన్‌తో కూడి రాడ్ వాడతాడు. చూడటానికి ముఖ్మల్ క్లాత్ ఫినిషింగ్ ఉన్న అరడుగు గొట్టం మాదిరిగా ఇది కనిపిస్తుంది. పైన ఉన్న స్క్రూ తొలగించి లోపలి రాడ్‌ను బయటకు లాగితే ఏకంగా రెండు అడుగులు బయటికు వస్తుంది. సాధారణంగా ఇలా లాగితే పెద్దవిగా మారే రాడ్లు చాలా సున్నితంగా, గట్టిగా పట్టుకుంటే ఒంగిపోయేవిగా ఉంటాయి. అయితే ఈ రాడ్ మాత్రం ఏకంగా బలమైన తాళాలనూ పగులకొట్టేంత పటిష్టంగా ఉంది. ఇలాంటివి అసాంఘిక శక్తుల చేతిలో పడితే అనేక అనర్థాలు ఉంటాయని భావిస్తున్న పోలీసులు దాన్ని సమీర్ ఎక్కడ ఖరీదు చేశాడనే దానిపై దృష్టి పెట్టారు. ఈ కోణంలోనూ నిందితుడిని ప్రశ్నించాలని నిర్ణయించారు. -
ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు
సిద్దవటం : సిద్దవటం మండలం కనుమలోపల్లె వద్ద గతంలో జరిగిన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో బుధవారం పీటీ వారెంటుపై ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్ఐ లింగప్ప తెలిపారు. జూన్‌లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కనుమలోపల్లె వద్ద ఇద్దరు తమిళ కూలీలు పట్టుబడిన విషయం తెలిసిందేనన్నారు. ఈ మేరకు వారిని విచారించగా చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీనివాసులురెడ్డి, నెల్లూరుకు చెందిన సుదర్శన్, కడప జిల్లా బద్వేలుకు చెందిన సుబ్బారెడ్డి, రాయచోటికి చెందిన దర్బార్‌బాషా, కడపకు చెందిన చంద్రశేఖర్ హస్తమున్నట్లు విచారణలో తేలిందన్నారు. గతంలో ఎర్రచందనం కేసుల్లో కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వీరిని పీటీ వారెంటుపై బుధవారం అరెస్టు చేసి సిద్దవటం కోర్టులో హాజరుపరిచామని ఎస్ఐ తెలిపారు.