వేశ్యతో కిరాయి హంతకుడి ప్రేమాయణం.. కాక్రోచ్ సెన్సార్ పూర్తి
అవార్డు విన్నర్ దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన బలమైన సామాజిక థీమ్‌తో కూడిన చిత్రం ‘కాక్రోచ్’. తాజాగా ఈ మూవీ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై బి. బాపిరాజు, ముతుకి నాగ సత్యనారాయణలు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ (A) సర్టిఫికెట్ మంజూరు చేసింది.‘సమాజంలోని చీకటి మూలలను, అవినీతి, భ్రష్టుత్వాన్ని కఠినంగా చిత్రీకరించిన ఈ చిత్రం... అడ్డురోడ్లపై జీవనం సాగించే వేశ్యకు, ఒక కిరాయి హంతకుడికి మధ్య ఏర్పడిన స్వచ్ఛమైన ప్రేమ, స్నేహాన్ని చూపిస్తుంది. సమాజం చీత్కరించే మురికి మనుషుల మధ్య సాగే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ద్వంద్వ విలువలు, విలువల ద్వంద్వత్వాన్ని ప్రశ్నిస్తూ... కాక్రోచ్‌ను చంపితే చప్పట్లు కొడుతూ, సీతాకోక చిలుకలపై కవితలు రాసే సమాజ మనస్తత్వాన్ని ఈ చిత్రం ఎండగట్టనుంది’ అని దర్శకుడు తెలిపారు. సున్నిత మనస్కులు మరియు పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండాలని దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బి. బాపిరాజు పత్రికా ప్రకటన ద్వారా కోరారు. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ , మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేష్, మల్లిక, ఎఫ్ఎమ్ బాబాయ్, రాజు, బాలాజీ, ఎల్బీ రమణ, ఆర్కే సింగ్, పూజా, పొట్టి మూర్తి, ప్రసాద్, రేలారే రఘు బృందం, జానీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి మొదటి వారంలో విడుదల కానుంది.