breaking news
Professor Jaya Shankar
-
తెలంగాణ ఆత్మ ప్రొఫెసర్ జయశంకర్
తెలంగాణ రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యంగా యావత్ కాలాన్ని ఉద్యమంలో గడిపిన కొత్తపల్లి జయశంకర్.. వరంగల్ జిల్లాలోని అక్కంపేటలో 1934 ఆగష్టు 6వ తేదీన మహాలక్ష్మి, లక్ష్మీకాంతరావు దంపతులకు జన్మించారు. హనుమకొండ, వరంగల్‌లో ప్రా«థమిక, ఉన్నత విద్య అభ్యసించి, బెనారస్, అలీగడ్ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులు పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. బీఈడీ చదివారు. తెలుగు తోపాటు ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో పట్టు సాధించారు. ఇంటర్మీడియట్ లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలంటూ నినదించి 1952లో ’ముల్కి‘ విధానాలు వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమానికి నడుం బిగించారు. అధ్యాపకులుగా సీకేఎం కళాశాలలో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వచ్చే అనేక ప్రయోజనాలను విద్యార్థులకు నూరిపోసి చైతన్య దీపం వెలిగించారు. విశాలాంధ్రకు వ్యతిరేకంగా లాఠీదెబ్బలు తిన్నారు. 1954 లోనే విద్యార్థి నేతగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనానికి వ్యతిరేకంగా ‘ఫజిల్ ఆలీ‘ కమిషన్‌కు నివేదిక సమర్పించిన ధీశాలి. 1969లో పదిమంది మేధావులతో ఆర్.సత్యనారాయణ, శ్రీధరస్వామి తదితరులతో ఒక టీం ఏర్పాటు చేసి, తెలంగాణ సాధనకు వ్యూహాలు రచింపజేసిన మేధావి. ‘తెలంగాణ జనసభ‘ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆవశ్యకత గురించి అనేక రచనలను, ఎన్నో డాక్యుమెంట్లను రూపొందించి ప్రచురించారు. చిన్నతనం నుండి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, అసమానతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘తెలంగాణ రావాలి!..మా తెలంగాణ మాగ్గావాలి!!‘‘అని నినదించాడు. ‘స్వయంపాలనలో శాసిస్తాం... కానీ ప్రస్తుతం ఇతరుల పాలనలో యాచిస్తున్నాం‘ అని బాధపడేవారు. 1975–79 వరకూ సీకేఎం కళాశాలకు ప్రిన్సిపాల్‌గా, 1979–81 వరకూ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా, 1982–91 వరకూ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ రిజిస్ట్రార్‌గా, 1991–94 వరకూ కాకతీయ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. 1999–2000 మధ్య కాలంలో అమెరికా పర్యటించి, అనేక తెలుగు వారి సభల్లో పాల్గొని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమ ఆవశ్యకతను తెలిపి, రాష్ట్ర ఏర్పాటుకు మంచి వాతావరణాన్ని నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తెలంగాణలో ఏమి జరుగుతుంది, వక్రీకరణలు–వాస్తవాలు, తల్లడిల్లుతున్న తెలంగాణ (వ్యాస సంపుటి), తెలంగాణ (ఇంగ్లిష్) తదితర రచనలు చేశారు. తెలంగాణ ఐక్య వేదిక వ్యవస్థాపకుడుగా పనిచేశారు. 2009లో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన చారిత్రక నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవిశ్రాంత కృషి చేసి, తాను కలలు కన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చూడకుండానే, 2011 జూన్ 21న కన్నుమూశారు. ఆయన ఆశయాలు, దిశా నిర్దేశనంతో కేసీఆర్ ఆధ్వర్యంలో, ఉద్యమకారులు, ప్రజానీకం సహకారంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, ప్రస్తుతం దేశంలో ఒక మార్గదర్శి రాష్ట్రంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాఫ్ట్వేర్ రంగాల్లో ముందుకు సాగుతోంది. ఆయనపై గౌరవంతోనే కేసీఆర్ ఒక జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని పేరు పెట్టి గౌరవించారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశించిన తెలంగాణ.. ప్రజల గుండెచప్పుడు కావాలని ఆశిద్దాం.... –ఇ. ప్రసాదరావు వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 99482 72919 (నేడు ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా) -
బహ్రెయిన్‌లో జయశంకర్ సార్ జయంతి వేడుకలు
తెలంగాణా జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి 83వ జయంతి వేడుకలను బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నేతలు జయశంకర్ సారుకు నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకొని అనంతరం ఆండాల్స్ గార్డెన్ లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మూడో విడత హరితహారం తెలంగాణకు మణిహారంగా సీఎం కేసీఆర్ స్ఫూర్తితో దీనిని విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు బహ్రెయిన్‌లో హరితహారం చేపట్టారు. బహ్రెయిన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ లు మాట్లాడుతూ.. జయశంకర్ సార్ మహోన్నతమైన వ్యక్తి అని సార్ సేవలను కొనియాడారు. ప్రతీ సామాజిక అంశంపై సార్ పరిశీలన చాలా గొప్పగా ఉండేదని.. ఆయన చేసిన భావజాల వ్యాప్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. జయశంకర్ సార్ పిలుపుతో ఊరూరా కేసీఆర్ లాంటి నేతలు తయారై ఉద్యమాన్ని ముందుకు నడిపారని గుర్తు చేసుకున్నారు. సార్ జయంతి వేడుకలను గల్ఫ్ దేశాల్లో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, సెక్రెటరీలు సుమన్ అన్నారం, రవిపటేల్ దెశెట్టి, జాయింట్ సెక్రెటరీలు సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, ప్రమోద్ బోలిశెట్టి, తదితరులు పాల్గొన్నారు. -
జయశంకర్ కలలు కన్నట్టే అభివృద్ధి
తెలంగాణ సిద్ధాంతకర్తను స్మరించుకున్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌ను ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. జయశంకర్ 5వ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ వస్తే తప్ప ఇక్కడి ప్రజల బతుకులు బాగుపడవనే విషయాన్ని ఆయన ఎప్పుడూ చెబుతుండే వారని చెప్పారు. జయశంకర్ సార్ కలలు కన్నట్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, పురోగమిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో నివాళి ఆచార్య జయశంకర్ 5వ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.