breaking news
Producer BA Raju
-
సింపుల్‌గా బీఏ రాజు కుమారుడి వివాహం.. ఫోటోలు వైరల్
BA Raju Son Siva Kumar Marriage Pics Goes Viral: ప్రముఖ దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు, డైరెక్టర్ శివకుమార్ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. స్నేహితురాలు లావణ్యతో ఆయన ఈనె 22న ఆయన పెళ్లి జరిగింది. శివకుమార్‌కు చాలా ఇష్టమైన సంఖ్య 22. అందుకే ఆయన తొలి చిత్రానికి సైతం శివకుమార్ ’22’ అనే పేరే పెట్టారు. ఇక 2022, జనవరి22వ తేదీ, 22 గంటలకు పెళ్లి చేసుకోవడం విశేషం. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆయన వివాహం నిరాడంబరంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా శివకుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'పూణెకి చెందిన మరాఠీ అమ్మాయి, నా స్నేహితురాలు దండిగే లావణ్యతో వివాహం జరిగింది. మేం ఇద్దరం కలిసి మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి' అంటూ పేర్కొన్నారు. ఇక కొత్త జంటకు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కాగా పూరి జగన్నాథ్, వివి. వినాయక్ వంటి టాప్ డైరెక్టర్స్ వద్ద సహాయ దర్శకుడిగా చేసిన శివకుమార్.. శివకుమార్ ’22’అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. Today Got Married To My Bestie Dandige Lavanya , Marathi Girl From Pune Settled In Hyderabad . Need All Your Blessings As We Start Our New Journey Together. Thanks & Love You All ❤️ pic.twitter.com/bH8Yu1tos3 — Shiva Kumar B (@ShivaKumarB22) January 22, 2022 -
చిత్రసీమ ఆత్మబంధువు బి.ఎ. రాజు ఇకలేరు
ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్ఓ, నిర్మాత బి.ఎ. రాజు (61) ఇకలేరు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఉన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారని బి.ఎ. రాజు కుమారుడు, దర్శకుడు శివకుమార్ తెలిపారు. విజయవాడలో పుట్టిన బి.ఎ. రాజుకి హీరో కృష్ణ అంటే అభిమానం. కృష్ణ వద్ద పనిచేయాలని చెన్నై వెళ్లారు రాజు. కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పీఆర్ఓగా కెరీర్‌ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత కృష్ణ ప్రోత్సాహంతో సినీ జర్నలిస్ట్‌గా మారారు. జ్యోతిచిత్ర, ఆంధ్రజ్యోతి, ఉదయం, శివరంజని వంటి దిన, వార పత్రికల్లో జర్నలిస్ట్‌గా చేశారు. 1994లో తన భార్య, జర్నలిస్ట్ బి. జయతో కలసి ‘సూపర్‌హిట్’ వారపత్రికను ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర భాషల్లోని ఎందరో హీరోలు, నిర్మాతలు, దర్శకులకు, 1500 సినిమాలకుపైగా పీఆర్ఓగా చేశారు. నాటి తరంలో కృష్ణతో మొదలుపెట్టి ఆ తర్వాతి తరంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, ఆ తర్వాతి తరంలో ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్.. ఇలా పలువురు అగ్రకథానాయకుల చిత్రాలకు పీఆర్వోగా చేశారు. ‘కృష్ణగారి సినిమాలకు చేశాను.. వారి అబ్బాయి మహేశ్‌బాబు చిత్రాలకు చేస్తున్నాను.. భవిష్యత్తులో మహేశ్ అబ్బాయి గౌతమ్ హీరో అయినా తన సినిమాలకు కూడా చేస్తాను’ అంటుండేవారు రాజు. నిర్మాతగా మారి, తన భార్య జయ దర్శకత్వంలో ‘చంటిగాడు, గుండమ్మగారి మనవడు, వైశాఖం’ వంటి సినిమాలు నిర్మించారాయన. ‘ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్’ అధ్యక్షునిగానూ చేశారు బి.ఎ. రాజు. కాగా 2018లో రాజు భార్య, దర్శకురాలు జయ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు కుమారులు అరుణ్ కుమార్, శివకుమార్ ఉన్నారు. ఇద్దరూ సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. అరుణ్ కుమార్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు. శివ కుమార్ దర్శకుడు. తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘22’ సినిమా విడుదల కరోనా లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. ఇటు పాత్రికేయులకు అటు చిత్రసీమకు మధ్య వారధిగా ఉన్న రాజు హఠాన్మరణం పాత్రికేయులకు, చిత్రసీమకు ఓ షాక్. బి.ఎ. రాజు అంత్యక్రియలు శనివారం మహాప్రస్థానంలో జరిగాయి. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రాజు ఇక లేరంటే నమ్మశక్యంగా లేదని, అందరి ఆత్మబంధువులా మెలిగిన ఆయన లేని లోటు తీర్చలేనిదని పాత్రికేయులు, సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు. ప్ప్రముఖుల నివాళి మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని బి.ఎ. రాజు నాతో షేర్ చేసుకునేవారు. సంవత్సరాల క్రితం విడుదలైన క్లాసిక్స్‌కి సంబంధించిన కలెక్షన్స్, ట్రేడ్ రిపోర్టు రికార్డుల గురించి చెప్పగల గొప్ప నాలెడ్జ్ బ్యాంక్ ఆయన. ఎన్‌సైక్లోపిడియాలా సమాచారం అందించేంత ప్యాషన్ ఉన్న పత్రికా జర్నలిస్ట్. రాజుగారిలాంటి వ్యక్తి ఉండటం పరిశ్రమ అదృష్టం. – చిరంజీవి బి.ఎ. రాజుగారితో నాకు ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. ఇకపై ఆయన మన మధ్య ఉండరనే వార్త కలచివేసింది. – బాలకృష్ణ 37 సంవత్సరాలుగా నా శ్రేయోభిలాషి, ప్రియ మిత్రుడు బి.ఎ. రాజు లేని లోటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీరనిది. – నాగార్జున చెన్నైలో ఉన్నప్పటి నుంచే రాజుగారితో నాకు పరిచయం ఉంది. సినిమా అంటే తపన ఉన్న జర్నలిస్ట్ ఆయన. నిర్మాతగానూ నిలబడ్డారు ఆయన. – పవన్ కల్యాణ్ వృత్తిపరమైన అనుబంధం హద్దులు లేని ప్రేమతో వ్యక్తిగత అనుబంధంగా ఎలా మారుతుందో చూపించిన వ్యక్తి రాజుగారు. – సూర్య తెలుగు, తమిళ చిత్రాల మధ్య మంచి వారధి వేసిన బి.ఎ. రాజు గుర్తుండిపోతారు. – విక్రమ్ నేను అన్నయ్యలా భావించే రాజుగారి మరణం నన్నెంతగానో కలచివేసింది. నా కెరీర్ అంతా ఆయన నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. – విశాల్ బి.ఎ. రాజు.. నువ్వు లేని తెలుగు సినిమా మీడియా, పబ్లిసిటీ ఎప్పటికీ లోటే.. నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలు గుర్తుండిపోతాయి. – కె.రాఘవేంద్రరావు ఫిల్మ్ జర్నలిస్టుగా, 1500 సినిమాలకు పీఆర్వోగా చేసిన అనుభవం ఉన్న బి.ఎ. రాజులాంటి సీనియర్ వ్యక్తిని ఇండస్ట్రీ కోల్పోవడం బాధాకరం. – ఎస్.ఎస్. రాజమౌళి సూపర్‌స్టార్ కృష్ణగారి అభిమానుల ఉత్తరాలకు ప్రత్యుత్తరాలు ఇచ్చే వ్యక్తిగా బి.ఎ. రాజుగారు నాకు పరిచయం అయ్యారు. కృష్ణగారి ‘సింహాసనం’ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న రోజులవి. బి.ఎ. రాజు ‘కొడుకుదిద్దిన కాపురం’ సినిమా పోస్టర్స్ డిజైన్ చేస్తున్న సమయంలో నేను ‘శివ’ సినిమా పోస్టర్స్ డిజైనింగ్‌లో ఉన్నాను. బీఏ రాజుతో పాటు ఆయన చిరునవ్వు ఎప్పటికీ గుర్తుండిపోతుంది – దర్శకుడు తేజ బి.ఎ. రాజుగారు వేడుకల్లోనే కాదు... ఇబ్బందుల్లోనూ మాతో ఉన్నారు. సినిమాలంటే ఉన్న ప్రేమతోనే ఆయన కృష్ణగారికి దగ్గరయ్యారు. అదే ప్రేమను మహేశ్‌పైనా చూపించారు. మా సినిమాలకు సంబంధించిన ఏ చిన్న వేడుకయినా ఆయన పూలతో వచ్చేవారు. అలాంటిది ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్ని ఓ పువ్వును సమర్పించుకో లేనందుకు బాధగా ఉంది. మా హృదయాల్లో నిలిచే ఉంటారు. – నమ్రత నా జీవితంలో సానుకూలమైన ఆలోచనల కాంతిని వెలిగించిన వ్యక్తి బీఏ రాజుగారు. సినిమా హిటై్టనా.. ఫ్లాప్ అయినా ఆయన చెప్పే మాటలు కొత్త ఉత్సాహాన్ని నింపేవి. – సమంత -
అంతకు మించి హిట్ ఇవ్వాలనుకుంటున్నాం
- నిర్మాత బీఏ రాజు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కొద్ది మంది డైనమిక్ లేడీ డెరైక్టర్స్‌లో జయ. బి ఒకరు. ‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్లీ’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నఆమె తాజాగా ‘వైశాఖం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హరీష్, అవంతిక జంటగా ఆర్.జె సినిమాస్ పతాకంపై సూపర్‌హిట్ అధినేత బీఏ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బీఏ రాజు మాట్లాడుతూ -‘‘ ‘లవ్లీ’ చిత్రం ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అంతకంటే పెద్ద హిట్ సినిమా తీయాలనే తపనతో మంచి కథ కోసం గ్యాప్ తీసుకున్నాం. గతంలో మా బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ మంచి మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ‘వైశాఖం’లో పాటలు కూడా అందరికీ నచ్చుతాయి. రష్యా నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడ్డ కజికిస్థాన్‌లో ఈ చిత్రం కోసం మూడు పాటలను పదిహేను రోజుల్లో చిత్రీకరించాం. ఇప్పటివరకూ అక్కడ ఎవరూ షూటింగ్ జరపలేదు. సాయికుమార్, ఆమని, పృధ్వీ, కాశీ విశ్వనాథ్‌ల పాత్రలు ఆకట్టుకుంటాయి’’ అని చెప్పారు. దర్శకురాలు జయ మాట్లాడుతూ- ‘‘కజికిస్థాన్‌లో మైనస్ 4 డిగ్రీల టెంపరేచర్లో పాటలను చిత్రీకరించాం. కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. అపార్ట్మెంట్లోని వాళ్లు ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉంటే ఎంత హాయిగా ఉంటుందో సెంటిమెంట్ గా కాకుండా ఎంటర్టైనింగ్గా చూపిస్తున్నాం. కంట్రోల్ బడ్జెట్లో ఈ చిత్రం చేయాలనుకుంటే పెద్ద చిత్రంగా తయారవుతోంది. కథను నమ్మి రాజుగారు బడ్జెట్ విషయంలో రాజీపడటం లేదు. షూటింగ్ అరవై శాతం పూర్తయింది. అందరికీ నచ్చే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు. హీరో హరీష్, కెమేరామ్యాన్ వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీత దర్శకుడు డీజే వసంత్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ బి.శివకుమార్.