breaking news
problems of farmers
-
కౌలు రైతుల కష్టాలు తీరేనా..?
గుర్రంకొండ: జిల్లాలో కౌలు రైతులు అప్పులు పాలై కష్టాల బాటలో బతుకు సాగిస్తున్నారు. వీరిని అన్ని విధాల ఆదుకొంటా మని ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటిమూటలుగానే మిగులు తున్నాయి. పథకాలన్నీ వీరికీ వర్తిస్తాయంటున్న ప్రకటనలు కాగి తాలకే పరిమితవుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో ఏ ఒక్క కౌలు రైతుకూ రుణం మంజూరు కాలేదు. రబీ సీజన్లోనూ అదే తీరు. తప్పనిసరిగా పంట రుణాలివ్వాలని జిల్లా అధికారులు చెబుతున్నా బ్యాంకులు బేఖాతరు చేస్తున్నాయి. ఎలాంటి భరోసా లేదంటూ బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. అప్పు చేసి పండిస్తే దిగుబడి మాటెలా ఉన్నా కనీసం గిట్టుబాటు ధర కూడా సంతృప్తికరంగా లేదు. దీంతో నష్టాలపాలవుతున్నారు. రబీ సీజన్లో కొందరు అధిక వడ్డీలకు ప్రయివేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేశారు. నెరవేరని లక్ష్యం కౌలురైతులకు 2014 నుంచి రుణ అర్హత గుర్తింపు సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. తొలి ఏడాది 3,458 మందికి సర్టిఫికెట్లు ఇవ్వగా 29 మందికి మాత్రమే బ్యాంకర్లు రుణాలు మంజూరు చేశారు. 2017లో 1,949 మందికిగాను 275 మంది రుణాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది 2,246 మంది గుర్తింపు కార్డులివ్వగా ఇప్పటివరకూ ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్ వెళ్లిపోయింది. రబీ సీజన్ ప్రారంభమైనా కౌలు రైతులకు నిరాశే ఎదురైంది. ఈ గుర్తింపు సర్టిఫికెట్లు నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. ఈ ఏడాది మేలోనే సర్టిఫికెట్లు జారీ చేసి బ్యాంకర్లను ఒప్పిస్తే ఫలితం ఉండేదని రైతులంటున్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసినా రుణాలివ్వకపోవడం దారుణ మని కౌలురైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రయివేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశారు. ఖరీఫ్‌లో పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. సాగు వ్యయం కూడా చేతికందక భారీగా నష్టపోయారు. రబీ సీజన్లో ఆశతో గుర్తింపు సర్టిఫికెట్లు తీసుకొని బ్యాంకులకు వెళుతున్న కౌలురైతులకు ఛీత్కారాలు, అవమానాలు ఎదురవుతున్నాయి. రెండు నెలలు గడుస్తున్నా రుణాలు ఇవ్వలేదు. 2017 రబీ సీజన్లో డీసీసీబీకి చెందిన బ్యాంకులు 275 మందికి రుణాలు మంజూరు చేశాయి. మిగిలిన బ్యాంకర్లు కాదు.. పొమ్మన్నారు. సాగుచేసే పంట ఆధారంగా రుణాలు ఇవ్వలేంటూ కచ్చితంగా చెప్పేస్తున్నారు. అప్పుల ఊబిలో కౌలు రైతులు.. పంట పండినా.. పండకపోయినా భూమి యజమానికి తప్పనిసరిగా కౌలు డబ్బులు చెల్లించాలి. కౌలురైతులు వేరుశెనగ సాగులో ఆరేళ్లుగా నష్టాలనే చవిచూ స్తున్నారు. పంట నష్టపరిహారం వచ్చిన వీరికి దక్కదు. భూమి యజమానికి చేరుతోంది. వీరికి ఎలాంటి సాయమూ అందలేదు. ప్రభుత్వ రాయితీలు, పరిహారం యజమానులకు చెందుతుండటంతో కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. కౌలురైతులకు రుణాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది సాగు నేస్తం పథకం ప్రవేశపెట్టింది. దీని జాడే లేదు. మేలోనే గుర్తింపు కార్డులు జారీచేసి ఈ పథకం కింద సింగిల్‌విండోల ద్వారా రుణాలు మంజూరు చేసి ఉంటే ప్రయోజనకరంగా ఉండేది. గత ఏడాది ఎంతో కొంత ఆదుకున్న డీసీసీబీ బ్యాంకులు ఈ ఏడాది చేతులెత్తేశాయి. ఆదుకునే వారేరీ? కౌలు రైతుల పరిస్థితి దారుణంగా మారింది. పంటలు పండక ఏటా నష్టపోతున్నాం. మమ్మల్ని ఆదుకునేవారు లేరు. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు అందడం లేదు. ఎక్కువ వడ్డీలకు అప్పు తెచ్చి సాగు చేస్తున్నాం. బాగా నష్టపోతున్నాం. వ్యవసాయం తప్ప మరే పని చేయలేకున్నాం. ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఆదుకుంటే బాగుంటుంది. – నరసింహులు, కౌలురైతు, గుర్రంకొండ -
రైతు సమస్యలకు పరిష్కారం చూపాలి
‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి సాక్షి, హన్మకొండ: రైతు సమస్యలకు పరిష్కారం చూపించేలా పార్లమెంటు ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చ జరగాలని సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి అన్నారు. వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అందించే శాంతిదూత అవార్డుకు 2015 సంవత్సరానికి ప్రవాస భారతీయురాలు దూదిపాల జ్యోతిరెడ్డి ఎంపికయ్యారు. వరంగల్‌లో ఆదివారం జరిగిన ఈ అవార్డు బహూకరణ కార్యక్రమానికి రామచంద్రమూర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విజయ్‌మాల్యా వంటి బడా పారిశ్రామిక వేత్తలు చేసిన అప్పులతో పోల్చితే... రైతులు చేసే అప్పులు చాలా చిన్నవని అన్నారు. అప్పుల పాలైన రైతులు, ఆత్మన్యూనతా భావానికి లోనై బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీగా జీవితం ప్రారంభించి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవోగా ఎదిగిన ప్రవాస భారతీయురాలు జ్యోతిరెడ్డి జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆశయాలు ఉండటం గొప్పకాదని, వాటిని ఆచరించడం గొప్పని అన్నారు. శాంతి స్థాపన కోసం వరల్డ్ పీస్ సంస్థ చేస్తోన్న కృషిని అభినందించారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ మహిళలందరికీ జ్యోతిరెడ్డి ఆదర్శప్రాయమన్నారు. జ్యోతిరెడ్డి అనుమతిస్తే ఆమె జీవిత గాథను నవలగా రాస్తానని జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ అన్నారు.