బంద్ ప్రశాంతం
మిన్నంటిన నిరసనలు
ఎన్జీవోల బంద్ విజయవంతం
వైఎస్సార్సీపీ పూర్తి సహకారం
మూతపడిన ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు
ప్రధాన కూడళ్లలో మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు
పార్లమెంట్లో రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు గురువారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలను ఏపీ ఎన్జీవోలు మూయించారు. కలెక్టరేట్ ఆవరణలో మోకాళ్లపై నడిచి కేంద్ర హోం మంత్రి షిండే దిష్టి బొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని నియోజక వర్గాల్లో ఆందోళనలు చేపట్టారు. టీడీపీ నాయకులు, న్యాయవాదులు, వైద్యులు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, విద్యార్థి నాయకులు నిరసనలతో హోరెత్తించారు.
సాక్షి, విశాఖపట్నం : సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు సీమాంధ్ర బంద్ గురువారం విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలను ఏపీ ఎన్జీవోలు మూయించారు. లోక్ సభలో ‘టి’ బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఎన్జీవోలు కలెక్టరేట్ ఆవరణలో మోకాళ్లపై నడిచి నిరసన వ్యక్తం చేశారు. అంతటితో ఆగక కేంద్ర మంత్రి షిండే దిష్టి బొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుఅన్ని నియోజకవర్గాల్లోనూ మద్దతు తెలిపాయి. భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ర్యాలీలు నిర్వహించి, ఏపీ ఎన్జీవోలకు మద్దతుగా నిలిచారు.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన అనకాపల్లి పట్టణ బంద్ విజయవంతమయింది. కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.
యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యాన నియోజకవర్గంలో గురువారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. యలమంచిలి మెయిన్‌రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. దిమిలి రోడ్డు జంక్షన్లో ఉన్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహశీల్దార్ కార్యాలయం మొయిన్‌రోడ్డుపై బైఠాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
అరకులోయలో నియోజకవర్గ సమన్వయకర్తలు కుంభా రవిబాబు, కిడారి సర్వేశ్వరరావుల ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు.
పాడేరులో నియోజకవర్గ సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధించి రాస్తారోకో చేశారు
మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త పూడి మంగపతిరావు ఆధ్వర్యంలో కె.కోటపాడులో, మరో సమన్వయకర్త బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో దేవరాపల్లిలో బంద్ నిర్వహించారు.
చోడవరంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఎన్జీవోల సమ్మెకు మద్దతు తెలిపారు.
పాయకరావుపేటలో నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకటరావు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.