breaking news
Prices of milk
-
పాడి రైతులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాడి రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తూ అమూల్ సంస్థ తాజాగా మరోసారి పాల సేకరణ ధరలను పెంచింది. లీటర్‌కు గరిష్టంగా గేదె పాలపై రూ.4.51, ఆవు పాలపై రూ.1.84 చొప్పున.. కనిష్టంగా గేదె పాలపై రూ.2.26, ఆవు పాలపై రూ.0.11 చొప్పున పెంచింది. కిలో వెన్నపై రూ.32, ఘన పదార్థాలపై రూ.11 మేర పెంచింది. ఈ పెంపు రాయలసీమ పరిధిలోని ఆరు జిల్లాలకు ఆదివారం నుంచి వర్తించనుంది. తద్వారా 65 వేల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న పాల వెల్లువ పథకం కింద అమూల్ తరఫున రాయలసీమలో కైరా యూనియన్, కోస్తాంధ్రలోని సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలను సేకరిస్తున్నాయి. ఇటీవలే సబర్కాంత్ యూనియన్ పాల సేకరణ ధరలను పెంచింది. తాజాగా కైరా యూనియన్ పాల సేకరణ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.71.47, ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించగా.. తాజా పెంపుతో కలిపి ఏడు దఫాలు పాల సేకరణ ధరలు పెరిగాయి. కైరా యూనియన్ ప్రస్తుతం లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.84.26, ఆవు పాలకు రూ.42.27 చొప్పున చెల్లిస్తోంది. తాజా పెంపుతో లీటర్‌కు గరిష్టంగా గేదె పాలకు రూ.87.77, ఆవు పాలకు రూ.42.38 చొప్పున రాయసీమ జిల్లాల పరిధిలోని పాడి రైతులకు కైరా యూనియన్ చెల్లించనుంది. 30 నెలల్లో 8.50 కోట్ల లీటర్ల సేకరణ జగనన్న పాల వెల్లువ పథకం 2020 డిసెంబర్లో మూడు జిల్లాల్లో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 17 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించింది. 14,845 మంది రైతులతో మొదలైన ఈ ఉద్యమంలో 2.96 లక్షల మంది భాగస్వాములయ్యారు. వంద గ్రామాలతో మొదలై 3,549 గ్రామాలకు విస్తరించింది. 2116 ఆర్బీకేల పరిధిలోని 76వేల మంది నుంచి రోజూ సగటున 1.72 లక్షల లీటర్ల చొప్పున పాలు సేకరిస్తోంది. 8.50 కోట్ల లీటర్ల పాలను సేకరించగా.. పాడి రైతులకు రూ.378.26 కోట్లు చెల్లించారు. లీటర్‌పై రూ.4 అదనంగా లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వగా.. అంతకు మించి ప్రస్తుతం లీటర్‌కు గేదె పాలకు రూ.15 నుంచి రూ.20 వరకు, ఆవు పాలకు రూ.10 నుంచి 15 వరకు అదనంగా ప్రయోజనం చేకూరుతోంది. అమూల్ రాకతో పోటీ పెరిగి ప్రైవేట్ డెయిరీలు సైతం సేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా పాడి రైతులకు రూ.3,395.18 కోట్ల మేర అదనంగా లబ్ధి చేకూరింది. -
అమూల్ పాల ధర పెంపు: ఏకంగా లీటరుకు 3 రూపాయలు బాదుడు
న్యూఢిల్లీ: అమూల్ కంపెనీ తన వినియోగదారులకు మరోసారి షాకిచ్చింది. ఫిబ్రవరి 3 నుండి అమూల్ పాల ధరలు లీటరుకు రూ. 3 పెంచేసింది. పెరిగిన ధరలు అన్ని వేరియంట్లపై వర్తిస్తాయని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ తాజా ప్రకటన ప్రకారం, లీటరు అముల్ తాజా పాలు లీటరు ధర రూ. 54 గాను, అమూల్ ఆవు పాలు లీటరు ధర రూ.56గా ఉంది. గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 2022లో దీపావళికి ముందు ఫుల్ క్రీమ్ మిల్క్, తాజా, గోల్డ్, గేదె పాల ధరలను లీటరుకు 2 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే.గత 10 నెలల్లో పాల ధరలు రూ.12 పెరిగాయి. అంతకు ముందు ఏడేళ్ల పాటు పాల ధర పెరగలేదు. ఏప్రిల్ 2013 , మే 2014 మధ్య పాల ధరలు లీటరుకు రూ.8 చొప్పున పెరిగాయి. వేసవిలో పాల ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి. దీనివల్ల పాల కంపెనీలు పశువుల కాపరులకు అధిక రేట్లు చెల్లించాల్సి వస్తోంది. అందుకే రానున్న రోజుల్లో పాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
పాల ధర మళ్లీ పెరిగింది..
రూ.2 పెంచిన అమూల్, మదర్ డెయిరీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మళ్లీ పాల ధరలు పెరిగాయి. భారత్‌లో దిగ్గజ బ్రాండ్ అయిన అమూల్ లీటరుకు రూ.2 పెంచింది. ఈ పరిణామంతో వెంటనే మదర్ డెయిరీ సైతం లీటరుకు రూ.2 అధికం చేసింది. దీంతో ఈ బ్రాండ్ల టోన్డ్ మిల్క్ ధర తెలుగు రాష్ట్రాల్లో రూ.40కి చేరింది. ప్రస్తుతం నందిని బ్రాండ్ టోన్డ్ మిల్క్‌ను కర్నాటక కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) లీటరుకు రూ.36కు విక్రయిస్తుండగా, ప్రభుత్వ కంపెనీ అయిన విజయ రూ.38కి అమ్ముతోంది. ప్రైవేటు కంపెనీలు రూ.40 ఆపై ధరలోనే విక్రయిస్తున్నాయి. ధర విషయంలో అమూల్, మదర్ డెయిరీ బాటలో మిగిలిన కంపెనీలు నడుస్తాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.