breaking news
press club meeting
-
డాక్టర్లకు లయన్స్ క్లబ్ సభ్యుల సంఘీభావం
సాక్షి, హైద్రాబాద్ : ఇటీవల భారతదేశంలో డాక్టర్లపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ...మల్టిపుల్ డిస్ట్రిక్స్ -320 పరిధిలో తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లోని 500 లయన్స్క్లబ్లలో ఉన్న 19వేల మంది సభ్యులు డాక్టర్లకు సంఘీభావం తెలిపారు.డాక్టర్లు ప్రాణదాతలని, మానవ జాతి రక్షణకు కంకణం కట్టుకున్న సేవాదురంధరులని, వారిపై దాడి హేయమైందని అన్నారు. దేశ వ్యాప్తంగా లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు వైద్యశిబిరాల ద్వారా నిరుపేదలకు వలందిస్తూ సహాయ సహకారాలను అందిస్తున్నారని 320 డిస్ట్రిక్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్, ఎండీ ఎస్.నరేందర్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో 102 సంవత్సరాలుగా మానవాళికి సేవలందిస్తున్నాయని, అంతేకాకుండా తమ సభ్యులతో పాటు ఆయా దేశాల్లో వైద్యవృత్తిలో ఉన్న డాక్టర్లు కూడా తమ సహకారాన్ని అందించడం ముదావహమని నరేందర్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, సెక్రటరీ డాక్టర్ సంజీవ్‌సింగ్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని స్థానిక లయన్స్ క్లబ్‌ల సహకారంతో అట్టడుగు వర్గాలకు, నిరుపేదలకు వైద్య శిబిరాలు నిర్వహించి సహాయమందించడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని మల్టిపుల్ డిస్ట్రిక్ట్-320 లయన్స్ క్లబ్‌ల సభ్యులకు తెలిపారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్ ఆర్. సునీల్‌కుమార్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని 60శాఖల్లోని 16వేల మంది స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను నిరసించి వారికి నైతిక మద్దతు తెలిపామన్నారు. వైద్యవృత్తిలో ఉన్న డాక్టర్లకు తగు భద్రత కల్పించి, డాక్టర్లపై దాడులకు పాల్పడుతున్నవారిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సమావేశంలో లయన్స్ క్లబ్‌ల ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, అసోసియేషన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ పి.రఘురాం మాట్లాడుతూ వైద్యవృత్తి పవిత్ర మైనదని, ఎక్కడో ఓ పొరపాటు జరిగినంత మాత్రాన మొత్తం వైద్యులందరినీ బాధ్యులను చేసి దాడులకు దిగడం సరికాదన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఏవీకే గోఖలే మాట్లాడుతూ..కోల్‌కతాతో పాటు ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఇలాంటి దాడులు జరగడం విచారకరమన్నారు. వైద్యులపై దాడులు జరగకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని గోఖలే కోరారు. తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి డాక్టర్ రవీందర్రావు, మల్టిపుల్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎం.ప్రమోద్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి మామిడాల శ్రీనివాస్,మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ సయ్యద్ జావీద్, సంయుక్త కార్యదర్శి బి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వడ్డెర సంక్షేమానికి కృషి
కడప రూరల్: ఈ ఏడాది వడ్డెర ఫెడరేషన్ ద్వారా ఏర్పాటైన సంఘాలకు రూ. 37 కోట్ల రుణాలు ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు ఆ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ దేవళ్ల మురళి అన్నారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన జిల్లా వడ్డెర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వడ్డెర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లాకు ఈ ఏడాది వడ్డెర ఫెడరేషన్‌కు మూడు యూనిట్లు మంజూరయ్యాయని, 50 యూనిట్ల మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. కొండ క్వారీల్లో యంత్రాలను వినియోగిస్తున్నారని, ఆ యంత్రాలను వడ్డెర్లకు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో వడ్డెర భవన్ ఏర్పాటుకు త్వరలో చర్యలు చేపడతామని వెల్లడించారు. వడ్డెర్ల సమస్యలను పరిష్కరించాలి ఈ సందర్భంగా వడ్డెర నాయకులు బత్తుల జానకిరాం, గురుప్రసాద్, నంద్యాల సుబ్బరాయుడు, గంపా తిరుపతి మాట్లాడుతూ వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలన్నారు. అలాగే జనాభా ప్రాతిపదికన వడ్డెర ఫెడరేషన్‌కు రూ. వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు. బత్తల లక్ష్మయ్య, రమణ, బెల్లంకొండ శ్రీనివాస్, శేఖర్, పెద్ద సంఖ్యలో వడ్డెర నాయకులు పాల్గొన్నారు.