breaking news
Pre-paid
-
మొబైల్ కనెక్షన్ మార్పు సులభతరం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ యూజర్లు .. పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ–పెయిడ్‌కు, ప్రీ–పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మారడాన్ని సులభతరం చేసే దిశగా టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సిమ్ మార్చక్కర్లేకుండా వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధృవీకరణ ద్వారా ఈ ప్రక్రియ జరిగేలా టెలికం శాఖకు (డాట్) ప్రతిపాదించింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆధారాలు (పీవోసీ) ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్లకు డాట్ సూచించింది. పీవోసీని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు డాట్ ఏడీజీ సురేశ్ కుమార్ మే 21న జారీ చేసిన నోట్లో పేర్కొన్నారు. టెల్కోల ప్రతిపాదన ప్రకారం.. కనెక్షన్‌ను మార్చుకోదల్చుకున్న వారు తమ సర్వీస్ ప్రొవైడర్‌కు ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్, వెబ్సైట్, అధీకృత యాప్ ద్వారా అభ్యర్ధన పంపాల్సి ఉంటుంది. దీన్ని ఆమోదిస్తూ .. టెలికం సంస్థ ఒక ప్రత్యేక ఐడీ, ఓటీపీని మొబైల్ యూజరుకు పంపిస్తుంది. ఈ ఓటీపీ 10 నిమిషాల దాకా చెల్లుబాటు అవుతుంది. ఓటీపీని ధృవీకరిస్తే.. కనెక్షన్ మార్పునకు యూజరు సమ్మతించినట్లుగా టెలికం సంస్థ పరిగణిస్తుంది. ఏ తేదీ, సమయం నుంచి మార్పు అమల్లోకి వస్తుందనేది సమాచారం అందజేస్తుంది. ఇలా కనెక్షన్ స్వరూపం మారే క్రమంలో గరిష్టంగా అరగంట పాటు మాత్రమే సర్వీసుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని డీవోటీ తన నోట్లో పేర్కొంది. -
ఇకపై చెల్లదు..
‘ప్రీయాక్టివేషన్’ దందాకు బ్రేక్! సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు సిమ్‌కార్డు తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి ‘ప్రీ పెయిడ్’ పక్కాగా అమలుకు ఆదేశాలు కేంద్రానికి ఏడాది గడువు ఇచ్చిన న్యాయస్థానం నగరంలో యథేచ్ఛగా లభిస్తున్న ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల దుర్వినియోగానికి మచ్చుతునకలివి. పోలీసు రికార్డుల్లోకి కొన్నే ఎక్కుతున్నా... బయటపడని ఉదంతాలు ఎన్నో ఉంటున్నాయి. నేరగాళ్ళతో పాటు అసాంఘికశక్తులు, ఉగ్రవాదులకు కలిసి వస్తున్న ఈ దందాకు ఇకపై చెక్ పడనుంది. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. – సాక్షి, సిటీబ్యూరో సినిమాపై మోజుతో సాయి, రవి, మోహన్ అనే యువకులు టెన్త్ క్లాస్ విద్యార్థి అభయ్‌ను కిడ్నాప్ చేయాలని పథకం వేశారు. బేగంబజార్ ప్రాంతం నుంచి రెండు ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డులు కొన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మరో రెండు ఖరీదు చేశారు. ఈ సిమ్స్ అన్నీ వేరే వ్యక్తుల పేర్లతో, గుర్తింపుతో ఉన్నవే. వీటిని వినియోగించే అభయ్ కుటుంబీకులతో బేరసారాలు చేశారు. ఆ కిడ్నాప్, హత్య కేసు దర్యాప్తు క్లిష్టంగా మారడానికి ఈ సిమ్కార్డులూ ఓ కారణమే. జేకేబీహెచ్ పేరుతో హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఐదుగురు ఉగ్రవాద అనుమానితుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు పట్టుకున్నారు. ఈ ముష్కరులు తమ కుట్రలు అమలు చేయడంలో భాగంగా సంప్రదింపులు జరుపుకునేందుకు ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల్నే ఆశ్రయించారు. ముఠాలో కీలకంగా వ్యవహరించిన ఫహద్ ఈ తరహాకు చెందిన తొమ్మిది సిమ్‌కార్డుల్ని చార్మినార్ బస్టాప్ ఎదురుగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఔట్లెట్లో ఖరీదు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఫీల్డ్ వెరిఫికేషన్‌నూ పక్కాగా చేయాల్సిందే.. కేవలం గుర్తింపులు తీసుకుని సిమ్కార్డ్స్ ఇచ్చే విధానం అమలైనా పూర్తి స్థాయి ఫలితాలు ఉండవన్నది పోలీసుల మాట. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బోగస్ ధ్రువీకరణల్ని తీసుకువచ్చే నేరగాళ్లు వాటి ఆధారంగా సిమ్‌కార్డుల్ని తేలిగ్గా పొందవచ్చని చెప్తున్నారు. ఈ దందాను అరికట్టాలంటే సిమ్‌కార్డ్ జారీ తర్వాత, యాక్టివేషన్‌కు ముందు సర్వీస్ ప్రొవైడర్లు కచ్చితంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే విధానం ఉండాలని అభిప్రాయపడుతున్నారు. పోస్ట్‌పెయిడ్ కనెన్షన్ మాదిరిగానే ప్రీ–పెయిడ్‌ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తరవాత యాక్టివేట్ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయని వివరిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు వినియోగదారుడు అందించిన ఆధార్ కార్డ్ వివరాలు, పూర్వాపరాల ను తనిఖీ చేసే మెకానిజం ఆయా సర్వీస్ ప్రొవైడర్లు ఏర్పా టు చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు పట్టించుకోని ఔట్లెట్స్.. సెల్‌ఫోన్ వినియోగదారుడు ఏ సర్వీసు ప్రొవైడర్ నుంచి అయినా సిమ్‌కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సిమ్‌కార్డులు దుర్వినియోగం కాకుండా, నేరగాళ్లకు ఉపయుక్తంగా ఉండకూడదనే ఈ నిబంధనల్ని రూపొందించారు. ప్రస్తుతం నగరానికి చెందిన అనేక మంది సిమ్కార్డ్స్ రిటైలర్లు, తాత్కాలిక ఔట్లెట్ నిర్వాహకులు తమ దగ్గరకు సిమ్‌కార్డుల కోసం వచ్చే సాధారణ కస్టమర్ల నుంచి గుర్తింపులు తీసుకుని సిమ్‌కార్డు విక్రయిస్తున్నారు. పనిలో పనిగా వారికి తెలియకుండా స్కానింగ్, జిరాక్సు ద్వారా ఆయా గుర్తింపుల్ని పదుల సంఖ్యలో కాపీలు తీస్తున్నారని స్పష్టమవుతోంది. వీటి ఆధారంగా ఒక్కో వినియోగదారుడి పేరు మీద దాదాపు 100 నుంచి 150 సిమ్‌కార్డులు (కనెక్షన్లు) ముందే యాక్టివేట్ చేస్తున్నారు. ఇది డీఓటీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. నామ్‌కే వాస్తే చర్యలతో హడావుడి.. దేశ భద్రతను పెనుముప్పుగా మారడంతో పాటు నేరగాళ్లకు కలిసి వస్తున్న ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల వ్యాపారం నగరంలో జోరుగా సాగుతోంది. అభయ్ కేసులో నిందితుల్ని అరెస్టు చేసినప్పుడు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఆ వ్యవహారాలు సాగిస్తున్న వ్యక్తులు, ముఠాలపై స్పెషల్‌డ్రైవ్స్ చేపడతామనీ పేర్కొన్నారు. నాలుగైదు రోజుల పాటు శాంతిభద్రతల విభాగం అధికారులతో పాటు ప్రత్యేక విభాగాలూ రంగంలోకి దిగి, సెల్‌ఫోన్ దుకాణాలు, సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన తాత్కాలిక ఔట్‌లెట్స్‌లో వరుస తనిఖీలు చేశాయి. ఈ ‘స్పెషల్ డ్రైవ్’లో ఎంతమంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించారో తెలియదు కానీ... వారం రోజులకే ఈ విషయాన్ని మర్చిపోవడంతో అక్రమార్కులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అనారోగ్యకర పోటీ నేపథ్యంలో.. సర్వీసు ప్రొవైడర్ల మధ్య ఉన్న అనారోగ్యకర పోటీతో ఈ ప్రీ–యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల దందా మరింత పెరిగింది. రిటైలర్లతో పాటు సిమ్‌కార్డుల డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ వ్యవహారాన్ని జోరుగా సాగిస్తుండటంతో అనామకులు, నేరగాళ్ల చేతికి సిమ్స్ చేరుతున్నాయి. రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చే సిమ్‌కార్డు దరఖాస్తులను పూర్తిస్థాయిలో సరిచూసి, అనుమానాస్పదమైన వాటి యాక్టివేషన్‌ను 24 గంటల్లో కట్ చేయాల్సిన బాధ్యత సర్వీస్ ప్రొవైడర్లపై ఉన్నప్పటికీ వారు కూడా పట్టించుకోకపోవడమేగాక, టార్గెట్లు ఇచ్చి మరీ ప్రీ–యాక్టివేటెడ్ కార్డులు విక్రయానికి ప్రోత్సహిస్తున్నారనే అనుమానం వ్యక్త మవుతున్నాయి. సర్వీసు ప్రొవైడర్ల మధ్య నెలకొన్న అనారోగ్యకర పోటీనే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏడాది గడువిచ్చిన సుప్రీం కోర్టు.. దేశంలో సిమ్‌కార్డుల దుర్వినియోగాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి మొబైల్ వినియోగదారులు గుర్తింపును కచ్చితంగా రిజిస్టర్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి స్పష్టం చేసింది. పోస్ట్ పెయిడ్తో పాటు ప్రధానంగా ప్రీ–పెయిడ్ కనెక్షన్లు ఇచ్చేందుకు, అవి కలిగి ఉన్న వారికి ఆధార్ నమోదు తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది. దుర్వినియోగం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రీ–పెయిడ్ కనెక్షన్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేంద్రానికి ఏడాది గడువు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఈలోపు తమ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ప్రీ–యాక్టివేషన్ దందాకు పూర్తిస్థాయిలో చెక్ పడుతుందని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. -
జియో ఎఫెక్ట్: వోడాఫోన్ 'డబుల్ ధమాకా'
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఉచిత సేవలు మార్చి 2017 వరకు పొడిగించడంతో దేశీయ టెలికం కంపెనీలు కూడా దిగి వస్తున్నాయి. తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు గాను ఆఫర్లను సమీక్షించుకుంటూ , కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో్ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ముందుగా మేల్కోగా తాజాగా ఈ ఉచిత సేవలను మరో టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ బుధవారం ప్రకటించింది. జియో ఎఫెక్ట్ తో 'డబుల్ డాటా' ను ప్లాన్ ను వెల్లడించింది. రూ.255 పైన అందుబాటులో ఉన్న అన్ని ప్లాన్ పై ఉన్న 4జీ డాటాపై డబుల్ డాటా ను ఉచితంగా అందిస్తోంది. తద్వారా 50 శాతం ధరలు తగ్గించింది. ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి: రూ.255 రీ చార్జ్ పై 2 జీబీ 4జీ డాటా అందిస్తోంది. ఇప్పటివరకు 1 జీబీ మాత్రమే. అలాగే రూ.459 రీ చార్జ్ పై 6 జీబీ 4జీ డాటా, రూ.559 రీ చార్జ్ పై 8 జీబీ 4జీ డాటా, రూ. 999 ప్లాన్ లో 20 జీబీ, రూ. 1999 ప్లాన్ లో 40 జీబీ అందుబాటులోకి తీసుకొంచ్చింది. ఈ ప్లాన్ లు అన్నింటికి 28 రోజుల వాలిడిటీ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న పధకాల్లో వోడాఫోన్ 4జీ ప్రీపెయిడ్ వినియోగదార్లకు డబుల్ డేటా ప్రయోజనాలను అందిస్తున్నట్టు ప్రకటించింది. వోడాఫోన్ వినియోగదారులకు మెరుగైన మొబైల్ ఇంటర్నెట్ అనుభవాన్ని అందించేందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు వోడాఫోన్ ఒక ప్రకటనలో తెలిపింది. సూపర్ నెట్ 4 జీ అనుభవం తమ కసమర్లకు అందించనున్నామనే విశ్వాసాన్ని ఢిల్లీ-ఎన్సీఆర్ బిజినెస్ హెడ్, అపూర్వ మెహ్రోత్రాపై వ్యక్తం చేశారు. -
ఎయిర్టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లందరికీ సెకను ప్లాన్
న్యూఢిల్లీ: ఇకపై తమ ప్రీ-పెయిడ్ కస్టమర్లందరికీ పే-పర్-సెకన్ ప్లాన్లను వర్తింపచేయనున్నట్లు టెలికం సంస్థ భారత్ ఎయిర్టెల్ వెల్లడించింది. తద్వారా తమ నెట్‌వర్క్‌ను వినియోగించుకున్నంత సమయానికి మాత్రమే కస్టమర్లు చెల్లిం చినట్లవుతుందని పేర్కొంది. కాల్ అంతరాయాలు (కాల్ డ్రాప్స్) వల్ల కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయా అన్న కోణాన్ని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ పరిశీలిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. కాల్ డ్రాప్స్ పెరుగుతున్న నేపథ్యంలో నిమిషానికి లెక్కగట్టే చార్జీ ప్లాన్లను పరీక్షించాల్సివుందంటూ టెలికం కార్యదర్శి రాకేశ్ గార్గ్ ఇటీవల ప్రకటించారు. నిముషం ప్లాన్ ప్రకారం కొద్ది సెకన్లు మాట్లాడిన తర్వాత కాల్‌కు అంతరాయం ఏర్పడితే పూర్తి నిమిషానికి చార్జీ పడుతుంది. ఇలా కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయన్న అనుమానాల్ని అటు ట్రాయ్, ఇటు టెలికం శాఖ వ్యక్తంచేసిన తరువాత తాజాగా ఎయిర్టెల్ అన్ని కనెక్షన్లకు సెకనుకు లెక్కగట్టే ప్లాన్లను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. గత 3-4 నెలలుగా కాల్ డ్రాప్స్ సమస్య బాగా ఎక్కువయ్యింది. ప్రధాని మోదీ సైతం ఈ అంశంపై ఆందోళన వ్యక్తపర్చారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కూడా. 2015 జూన్ నాటికి ఎయిర్టెల్ మొత్తం కస్టమర్లలో 94.4 శాతం మంది ప్రీ-పెయిడ్ వినియోగదారులే ఉన్నారు. సాధారణంగానే తమ ప్లాన్లలో సింహభాగం సెకను ఆధారితమైనవేనని, కాల్ డ్రాప్స్ వల్ల తమకు అదనపు ప్రయోజనం చేకూరదని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ ఇటీవలే పేర్కొన్నారు. ప్రీ-పెయిడ్ వినియోగదారులందర్నీ పర్-సెకన్ ప్లాన్‌లోకి తీసుకొస్తున్నట్లు ఎయిర్టెల్ డెరైక్టర్ అజయ్ పూరి తెలిపారు.