breaking news
prathap kumar
-
వెటరన్ అథ్లెట్‌కు పెన్షన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ వెటరన్ అథ్లెట్, ఆసియన్ పతక విజేత చింత ప్రతాప్కుమార్కు ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున క్రీడా పెన్షన్ మంజూరు చేసిందని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ ప్రభాకరరెడ్డి తెలిపారు. సోమవారం శాప్ కార్యాలయంలో పెన్షన్ పత్రాన్ని ఆయనకు అందజేసి సత్కరించారు. ప్రతాప్‌కుమార్ 1975లో సౌత్ కొరియాలో జరిగిన 2వ ఆసియన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో 800 మీటర్లను 48 సెకన్లలో అధిగమించి రికార్డు కాంస్య పతకం సాధించారు. 1973లో మద్రాస్‌లో జరిగిన ఇండో రష్యన్ అథ్లెటిక్ టెస్టులో రెండో స్థానం, 1975లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన ట్రయాంగ్యులర్ 800 మీటర్ల పరుగులో మొదటి స్థానం, వివిధ అంతర్జాతీయ వెటరన్ మీట్లలో సత్తా చాటారు. ప్రతాప్‌కుమార్ జాతీయ స్థాయిలో 9 బంగారు, 6 వెండి, 2 కాంస్య పతకాలు సాధించారు. పేదరికంతో ఇబ్బంది పడుతున్న తనను గుర్తించి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయడంపై ప్రతాప్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. -
ఎఫ్ఐఆర్ వెనుక దురుద్దేశాలు లేవు
సాక్షి, అమరావతి : అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంలో అప్పటి అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని దర్యాప్తు అధికారి టీవీవీ ప్రతాప్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. పోలీసులకు అందిన ఫిర్యాదులోని అంశాలు విచారణార్హమైన నేరానికి సంబంధించినవైతే, తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాల్సిందేనని చెప్పారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరడంతో పాటు, దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక సమ్మతిని తెలియచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి గత ఏడాది మార్చి 23న రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి శ్రీనివాస్ గత ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దమ్మాలపాటి కోరిన ఉత్తర్వులే కాకుండా ఏకంగా దర్యాప్తుతో సహా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి (మీడియాను కూడా నియంత్రిస్తూ గ్యాగ్ ఆదేశాలు) ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నాలుగు వారాల్లో కేసు తేల్చాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, ఈ నెల 5 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఏసీబీ, తదితరులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఏసీబీ తరఫున దర్యాప్తు అధికారి టీవీవీ ప్రతాప్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. దర్యాప్తు జరగాల్సిందే.. సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్ట నిబంధనలకు అనుగుణంగా సదుద్దేశంతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కౌంటర్లో వివరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రోజునే దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించిందని, అధికరణ 226, సీఆర్పీసీ 482 కింద ఉన్న అధికారాలను, దర్యాప్తును హైకోర్టు అడ్డుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు తీర్పుల ద్వారా చెప్పిందన్నారు. 2014 జూలైలోనే ఎక్కడ రాజధాని రానుందో ప్రజలందరికీ తెలుసున్న వాదన వాస్తవం కాదని, 2014 డిసెంబర్ వరకు రాజధాని ఖరారు కాలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘అమరావతి భూముల అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయడం అన్నది ప్రభుత్వం పాలనాపరంగా తీసుకున్న నిర్ణయం. దానికీ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు ఎలాంటి సంబంధం లేదు. ఆస్తి కొనుగోలు చేసే హక్కుకు, చట్ట వ్యతిరేకంగా ఆస్తిని సమీకరించడానికి చాలా తేడా ఉంది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అనేక అంశాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది. అందువల్ల దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలి’ అని కోర్టును కోరారు. -
చిన్నారులకు కరాటేలో శిక్షణ
హైదరాబాద్: కరాటేలో క్రీడలో భాగంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ‘కొబుడో’ క్రీడలో ఇటీవల చిన్నారులకు ప్రత్యేకంగా శిక్షణా శిబిరం నిర్వహించారు. నిజాంపేటలోని మాపుల్స్ స్కూల్లో ఈ కార్యక్రమం జరిగింది. రెన్షీ కోలా ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంప్‌ను కోచ్ తన్నీరు మోహన్ పర్యవేక్షించారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ కోచ్ క్యోషి సీఎస్ అరుణ్ మాచయ్య, క్యోషి కేఎస్ రామ్‌కుమార్ ఈ శిక్షణా శిబిరానికి హాజరై చిన్నారులకు కొబుడోలో సూచనలిచ్చారు. ఇందులో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.