breaking news
prasanna kumar mahanti
-
2 రాష్ట్రాల పటిష్ట పునాదికి సంస్కరణలు
‘సాక్షి’కి సీఎస్ మహంతి ప్రత్యేక ఇంటర్వ్యూ రాష్ట్ర విభజనలో, ఇరు రాష్ట్రాల సుపరిపాలనలో కీలక పాత్ర పోషిస్తా అవసరం లేని సంస్థలు, శాఖల మూత... మరికొన్ని విలీనం ఫైళ్లు ఇంటికి తీసుకెళ్లడంపై నిషేధం... ఉద్యోగులు ఇక రాజకీయాలు వదిలేయాలి సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల పటిష్ట పునాదికి సంస్కరణలు చేపట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి తెలిపారు. విభజన నేపథ్యంలో సీఎస్‌గా మరో 4 నెలల పొడిగింపుతో మహంతి ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీలు, కేటాయింపులో కీలక పాత్ర పోషించనున్నారు. ఇరు రాష్ట్రాల్లో సుపరిపాలన తీసుకురావడానికి అవసరమైన సంస్కరణలు చేపట్టడానికి కృషి చేయనున్నారు. నిజానికి శుక్రవారం పదవీకాలం పూర్తి కావాల్సి ఉంది. అయితే రాష్ట్ర విభజన సమయంలో కంటిన్యుటీ ఉండాలనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి మహంతి పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించింది. ఈ సందర్భంగా మహంతి సాక్షితో ప్రత్యేకంగా వూట్లాడారు. వివరాలు ఆయున మాటల్లోనే... కేంద్ర సర్వీసులో కార్యదర్శి హోదా పదోన్నతి వచ్చినప్పటికీ సీఎం కోరిక మేరకు రాష్ట్ర సర్వీసుకు వచ్చాను. వచ్చాక మూడు నెలలు మాత్రమే ప్రశాంతంగా ఉంది. తరవాత తుపాన్లు, వరదలు, ఉత్తరాఖండ్ దుర్ఘటన, తెలంగాణ ఉద్యోగులు, సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెలకు తోడు రాజకీయ అనిశ్చితి కూడా నెలకొంది. వీటన్నింటినీ అధికార యంత్రాంగం బాగానే అధిగమించింది. అధికారులకు ఎప్పుడూ అజెండా ఉండకూడదు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాలి. విభజన అంత సులభతరం కాదు. సుదీర్ఘ కాలం పడుతుంది. ఇరు రాష్ట్రాలు అవసరమైన సంస్కరణల తో ముందే గట్టి పునాది నిర్మించుకోవాలి. అందుకోసం సుదీర్ఘకాలం పని చేస్తాను. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహాయంతో సంస్కరణలు, సుపరిపాలనకు మార్గదర్శకాల రూపకల్పన చేస్తా. ఇందుకు 30 మంది యువకులతో పరిశోధనా విభాగాన్ని ఏర్పాటు చేస్తాను. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పలు శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు అవసరం లేదు. వాటిని ఇరు రాష్ట్రాలు మూసేసుకోవాలి. ఉదాహరణకు ఆర్థిక శాఖలో ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన విభాగాలున్నాయి. పరిశ్రమల శాఖలో నలుగురు ఐఏఎస్ అధికారులతో విభాగాలున్నాయి. విభజన తర్వాత అంతమంది అవసరం లేదు. అలాగే కొన్ని శాఖలను విలీనం చేయాలి. కొన్ని కార్పొరేషన్లలో, శాఖల్లో అవసరానికి మించి ఉద్యోగులున్నారు. మరికొన్నింట్లో ఉద్యోగుల కొరత ఉంది. వీటిని సంస్కరణల ద్వారా సరిచేయూలి. విభజన సమయంలో అధికారులెవరూ ఇళ్లకు ఫెళ్లు తీసుకువెళ్లరాదు. దీనిపై నిషేధం విధించాం. ఫైళ్లు తీసుకువెళ్లడంపై నిఘా కోసం జీఏడీ, ప్రత్యేక భద్రత, విజిలెన్స్‌తో కమిటీ ఏర్పాటు. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల మంజూరు సంఖ్య 376. ప్రస్తుతం 299 మందే ఉన్నారు. దీంతో 77 మంది ఐఏఎస్‌ల కొరత ఉంది. విభాగాలు విలీనం, సంస్కరణల ద్వారా కొరతను అధిగమిస్తాం. ఐఏఎస్‌లకు ఆప్షన్స్ అడుగుతారు. అయితే కొంతమంది ఐఏఎస్‌ల్లో ఆందోళన ఉంది. తమిళనాడుకు చెందినవారు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందినవారు తెలంగాణలో పనిచేయడానికి సుముఖత చూపుతున్నారు. ఉద్యోగుల విభజన, ఆస్తులు, ఆప్పుల పంపిణీ, ఉమ్మడి రాజధానిలో ఇరు రాష్ట్రాల పాలన చాలా క్లిష్టతరం. ఇందుకు చాలా పని చేయాల్సి ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోను, మరి కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేయాలి. సచివాలయంతో పాటు కొన్ని రంగాల్లో అధికారులు విభజన చేసినట్టు వస్తున్న వార్తలు నిజం కాదు. అధికారులు ప్రతిపాదనలను తయారు మాత్రమే చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. విభజనోద్యమం సందర్భంగా ప్రభుత్వోద్యోగులు క్రమశిక్షణారహితంగా వ్యవహరించారు. వారిక రాజకీయాలు వదిలి నియమావళి ప్రకారం, బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలి. ‘మీ సేవ’లో వక్ఫ్‌బోర్డు సేవలు రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సంబంధించిన నాలుగు సేవలను ఇకపై మీ సేవ ద్వారా కూడా పొందవచ్చు. మీ సేవలో వక్ఫ్ బోర్డు సేవలను శుక్రవారం సీఎస్ మహంతి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఒమర్ జలీల్ లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై వక్ఫ్ బోర్డు ఆస్తుల ధ్రువీకరణ, వక్ఫ్ బోర్డు సంస్థల మేనేజింగ్ కమిటీల ధ్రువీకరణ, ముతవల్లీల నియామక ధ్రువీకరణ, వక్ఫ్ పరిధిలోని సంస్థల పర్యవేక్షకులకు అందించే ఆర్థిక సహాయ ధ్రువీకరణ పత్రాలను మీ సేవలో నిర్ణీత రుసుము చెల్లించి పొందవచ్చని జలీల్ తెలిపారు. -
మరో 4 నెలలు మహంతి
సీఎస్‌గా పొడిగించిన కేంద్రం తొలుత సీఎస్‌గా ఐవైఆర్ నియామకానికి ఫైలు రెడీ ఐవైఆర్‌కు అభినందనలు తెలిపిన దిగ్విజయ్, కేవీపీ, రఘువీరా రాష్ట్రపతి పాలన నిర్ణయంతో చక్రం తిప్పిన మహంతి రంగంలోకి మాంటెక్ సింగ్ అహ్లువాలియా, జైరాం రమేశ్ దీంతో ఐవైఆర్‌కు మొండిచేయి... మహంతికి పొడిగింపు సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక్కరోజు కూడా కొనసాగనని, పదవీకాలం పొడిగింపు కోరబోనని పేర్కొన్న ప్రసన్నకుమార్ మహంతి రాత్రికి రాత్రే చక్రం తిప్పారు. మరో ముఖ్యమంత్రిని నియమిస్తే పదవీకాలం పొడిగింపును కోరకూడదని, రాష్ట్రపతి పాలన విధిస్తే సీఎస్‌గా కొనసాగాలనేది మహంతి అభిప్రాయం. అయితే శుక్రవారం రాత్రి రాష్ట్రపతి పాలన విధిస్తున్నారని తెలియడంతో సీఎస్ మహంతి ఒక్కసారిగా పావులు కదిపి పొడిగింపు సాధించారు. వాస్తవానికి కొత్త సీఎస్ ఎంపిక కోసం ఫైలును శుక్రవారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌కు పంపించారు. కొత్త సీఎస్‌గా ఐ.వై.ఆర్. కృష్ణారావు నియామకానికి కేంద్ర అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ స్వయంగా ఐ.వై.ఆర్.కు ఫోన్ చేసి అభినందించారు. అలాగే కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, శ్రీధర్‌బాబు ఫోన్ ద్వారా ఐవైఆర్‌కు అభినందనలు తెలిపారు. కానీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని తెలియడంతో సీఎస్‌గా తానే కొనసాగేందుకు మహంతి రాత్రికి రాత్రి పావులు కదిపారు. తనకు సన్నిహితుడైన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాను గురువారం రాత్రి రంగంలోకి దింపారు. ఇప్పటివరకు రాష్ట్ర విభజన అంశాలను స్వయంగా మహంతి చూసినందున కంటిన్యుటీ లేకపోతే విభజన సమయంలో చిక్కులు వస్తాయని, అలాగే విభజన సమయంలో ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి సీఎస్‌గా ఉండటమే మంచిదంటూ అహ్లువాలియా ప్రధాన మంత్రి కార్యాలయంలోని పులోక్ చటర్జీతో మాట్లాడారు. దీంతో ప్రధాన మంత్రి కార్యాలయం సీఎస్‌గా మహంతిని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా రాష్ట్ర పర్యటనలో ఉన్న జైరాం రమేశ్‌తో అహ్లువాలియా మాట్లాడి గవర్నర్ నరసింహన్ దగ్గరకు పంపించి సీఎస్‌గా మహంతి కొనసాగింపునకు అవసరమైన కారణాలను వివరింపచేశారు. ఫలితంగా ఐవైఆర్ నియామకానికి బ్రేక్ పడింది. సీఎస్‌గా మహంతి పదవీ కాలాన్ని జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలను జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ కూడా సీఎస్‌గా మహంతి 4 నెలలు కొనసాగుతారని ఉత్తర్వులు జారీ చేసింది. -
వారం రోజుల్లో విభజన సమాచారం సిద్ధం
హైదరాబాద్: వారం రోజులలో రాష్ట్ర విభజనకు సంబంధించిన సమాచారం సిద్దం చేయాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. రాష్ట్ర విభజన విషయాలపై సచివాలయంలో మహంతి ఆధ్వర్యంలో ముఖ్య కార్యదర్శుల కీలక సమావేశం జరిగింది. సమావేశం జరిగే సమయంలోనే కేంద్ర హొం శాఖ కార్యదర్శి మహంతితో ఫోన్లో మాట్లాడారు. సచివాలయ విభజన, ప్రాంతల వారీగా ఫైళ్ల విభజన, విభజనకు పట్టే సమయం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. విభజన అనుకూలంగా సమస్త సమాచారాన్ని వారంరోజుల్లో సిద్ధం చేయాలని మహంతి అధికారులకు చెప్పారు. శాఖల వారీగా అప్పులు, ఆస్తుల వివరాలు అందజేయాలన్నారు. ప్రాంతాల వారీగా అధికారులను కూడా గుర్తించమని చెప్పారు. అదేవిధంగా ఫైళ్ల విభజనను పూర్తి చేయాలని మహంతి ఆదేశించారు. కేంద్ర హోంశాఖ రేపు ఢిల్లీలో సమావేశమై విభజన తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. మహంతి ఇచ్చే సమాచారం ఆధారంగా ఆ తేదీనికి ఖరారు చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కూడా రేపు ఢిల్లీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.