breaking news
Power Grid Towers
-
పవర్ గ్రిడ్ టవర్ పనుల్లో అపశృతి
కృష్ణా జిల్లా: చందర్లపాడు మండలం పొక్కునూరు గ్రామంలోని పవర్ గ్రిడ్ నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణ పనులు చేస్తుండగా ఇనుప పోల్ కూలి మీద పడటంతో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. గాయాలైన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితులంతా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పవర్ గ్రిడ్ టవర్ కూలీ పనుల నిమిత్తం వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. -
బాధితులకు న్యాయం చేయండి
పొలాల్లో ఏర్పాటు చేస్తున్న పవర్‌గ్రిడ్ టవర్స్ వల్ల రైతులు నష్టపోతున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ను ఆయన కలిశారు. ఒంగోలు టౌన్: పంట పొలాలగుండా ఏర్పాటు చేస్తున్న పవర్ గ్రిడ్ టవర్స్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మర్రిపూడి మండలంలోని గంగపాలెం, కూచిపూడి, రాజుపాలెం, అంకాపల్లి గ్రామాల్లో పవర్ గ్రిడ్ బాధిత రైతుల సమస్యలను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ విజయకుమార్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి ఎంపీ వివరించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి కృష్ణా జిల్లా నున్న వరకు ఏర్పాటు చేస్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల వల్ల జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. 400 కేవీ విద్యుత్ కలిగిన పవర్ గ్రిడ్ టవర్స్ వల్ల పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటాయని చెప్పారు. టవర్ నిర్మాణ ప్రదేశంలో భూమి వ్యవసాయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగపడదన్నారు. దానికితోడు హైటెన్షన్ లైన్లలో ప్రవహించే విద్యుత్ ఫ్రీక్వెన్సీ మూలంగా లైన్ల కింద పండించే పంటలు కూడా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం యాంత్రీకరణ లేకపోతే వ్యవసాయం చేయలేని తరుణంలో లైన్ల కింద వరి నూర్పిడి యంత్రం, శనగ నూర్పిడి యంత్రం పనిచేసే పరిస్థితులు లేవన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని, కొద్దిపాటి భూమి ఆ కుటుంబానికి ఆధారంగా ఉన్న సమయంలో పవర్ గ్రిడ్ టవర్స్, లైన్లు వారికి ఉపాధి లేకుండా చేసే ప్రమాదం ఉందన్నారు. కృష్ణా జిల్లాలోని రైతులు నష్టపరిహారం చెల్లించే వరకు నిర్మాణం చేపట్టనీయమని అడ్డుకోవడంతో అక్కడి కలెక్టర్ రైతులతో చర్చించి ఒక్కో టవర్‌కు 3.5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చేలా జీవో జారీ చేశారన్నారు. లైన్ల కింద ఉన్నవారు కూడా నష్టపరిహారం కోసం ఉద్యమిస్తున్నారన్నారు. ప్రకాశం జిల్లాలో మాత్రం రైతులకు ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మర్రిపూడి మండలంలోని పవర్ గ్రిడ్ బాధిత రైతులు మాట్లాడుతూ వీటివల్ల భవిష్యత్‌లో పంటలు సాగుచేసుకునే పరిస్థితులు లేవన్నారు. పంటలతోపాటు భూమికి కూడా నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ త్వరలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తానని, ఆ రోజు పవర్ గ్రిడ్ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, మర్రిపూడి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు.