‘ఫార్మసీ క్రికెట్’ విజేత జొన్నలగడ్డ సిద్ధార్థ
నరసరావుపేట రూరల్: ఏఎంరెడ్డి ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహించిన మూడు జిల్లాల ఫార్మసీ అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్లో జొన్నలగడ్డ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. రన్నరప్‌గా చేబ్రోలు హానుమయ్య ఫార్మసీ కళాశాల జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న జొన్నలగడ్డ సిద్ధార్థ కళాశాల జట్టు 12 ఓవర్లలో 77 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చేబ్రోలు హానుమయ్య కళాశాల జట్టు 12 ఓవర్లలో 59 పరుగులకే అలౌట్ అయింది. బహుమతి ప్రదానోత్సవ సభలో కళాశాల కార్యదర్శి అట్లూరి శాంతి, డైరెక్టర్ గున్నం చంద్రశేఖర్ విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతిగా రూ.5వేలు, ట్రోఫీ, ద్వితీయ బహుమతిగా రూ.3వేలు, ట్రోఫీని విజేతలకు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ సుదాకరభాబు, అధ్యాపకులు పాల్గొన్నారు.