breaking news
PG Vinda
-
మెరుగైన సినిమాలే లక్ష్యంగా ‘సినిమాటిక్ ఎక్స్’ : పి.జి. విందా
తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ఎందరో గొప్ప దర్శకులు, ప్రతిభగల సాంకేతిక నిపుణులు ఉన్నారు. అలాగే హైదరాబాద్ సినీ రంగానికి అనువైన చోటు. షూటింగ్ కి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి, షూటింగ్ కోసం రావాలంటే అందరికీ అనువుగా ఉంటుంది. అయితే అన్నీ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సాంకేతికంగా వెనకబడిపోయాం. అందుకే హైదరాబాద్‌లో సినిమాటిక్ ఎక్స్పో నిర్వహించాం. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎక్విప్ మెంట్ గురించి ముందే తెలుస్తుంది. దాంతో సాంకేతికంగా ఇంకా మెరుగైన సినిమాలను అందించగలం’ అన్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు పి.జి విందా. సరికొత్త సాంకేతికతను పరిచయం చేయడంతో పాటు, యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమాటిక్ ఎక్స్పో రెండో ఎడిషన్‌కు మంచి స్పందన లభిచింది. ఈ నేపథ్యంలో తాజాగా పి.జి విందా మీడియాతో ముచ్చటిస్తూ ‘సినిమాటిక్ ఎక్స్పో’గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..2004 వచ్చిన గ్రహణం చిత్రంతో సినిమాటోగ్రాఫర్ గా నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి మీడియా నాకు ఇస్తున్న సపోర్ట్ ను మరువలేను. గ్రహణం సినిమాటోగ్రఫీకి నాకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. నిజానికి ఆ సమయంలో డిజిటల్ అంతగా లేదు. ఇండియాలో తొలుత డిజిటల్ చిత్రీకరణ జరుపుకున్న సినిమాల్లో గ్రహణం ఒకటి. రాబోయే ఐదు, పదేళ్లలో డిజిటల్ దే హవా ఉంటుందని అప్పుడే చెప్పాను. నా అంచనానే నిజమైంది.నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయం నేర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే, దాని గురించి తెలుసుకోవడానికి దేశ విదేశాలు వెళ్తుంటాను. ముఖ్యంగా విదేశాల్లో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ ఎక్స్పో లు, ఎగ్జిబిషన్ లు నిర్వహిస్తుంటారు. మన దేశంలో ప్రత్యేకంగా సినీ పరిశ్రమ కోసం ఆ స్థాయి ఎక్స్పో లు లేవు. అదే ఈ సినిమాటిక్ ఎక్స్పో కు బీజం పడేలా చేసింది.తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో మేము నిర్వహించిన సినిమాటికా ఎక్స్పో మొదటి ఎడిషన్ కి గొప్ప స్పందన లభించింది. ఆ ఉత్సాహంతోనే రెండో ఎడిషన్ ని మరింత అద్భుతంగా నిర్వహించాలని నిర్ణయించాము. దీనికి ఏకంగా విశేష స్పందన లభించి, ఏకంగా 38 వేల మంది హాజరు కావడం అనేది ఆసియాలోనే రికార్డు.ఫిల్మ్ మేకింగ్ పై ఇప్పుడు ఎందరో ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. అందుకే సినిమాటికా ఎక్స్పో ద్వారా సాంకేతికతను పరిచయం చేయడం మాత్రమే కాకుండా, యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి తగు సూచనలు చేస్తూ సెమినార్లు నిర్వహించాము. సుదీప్ ఛటర్జీ, సత్యాంశు సింగ్, ఇంద్రగంటి మోహన కృష్ణ వంటి సినీ ప్రముఖులు.. స్టోరీ రైటింగ్, సినిమాటోగ్రఫీ గురించి ఎంతో నాలెడ్జ్ ని పంచారు.ఈ స్పందన చూసిన తర్వాత సినిమాటికా ఎక్స్పో మూడో ఎడిషన్ ను మరింత ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాము. పలు అంతర్జాతీయ సంస్థలు సైతం రావడానికి అంగీకారం తెలిపాయి.తెలుగు సినీ ప్రముఖుల నుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. రామ్ గోపాల్ వర్మ గారు, సందీప్ రెడ్డి వంగా గారు సహా అందరి మద్దతు ఉంది. అలాగే ప్రభుత్వం మరియు భాష, సాంస్కృతిక శాఖ మద్దతుతో ఈ సినిమాటిక్ ఎక్స్పో ని మరో స్థాయికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము.తెలుగు సాహిత్యం కోసం మా వంతు సహకారం అందించడంతో పాటు, యువ ప్రతిభ కోసం భవిష్యత్ లో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము. -
సినిమా రివ్యూ: రోమియో
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ రాసిన ప్రేమ కథ అంటూ భారీ బిల్డప్ కారణంతో చిత్రంపై ప్రేక్షకులు, అభిమానులు భారీగానే 'రోమియో' ఆశలు అంచనాలు పెట్టుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో సినీ ప్రేమికులకు రోమియో చాలా కాలంగానే దూరంగా ఉన్నాడు. ఎట్టకేలకు అక్టోబర్ 10(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోమియో ఎలాంటి ఫలితాన్ని చవిచూశాడనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కథ: న్యూయార్క్ లో ఉండే సమంత(అడోనిక)కు ఒంటరిగా ట్రావెలింగ్ చేయడమంటే అంటే చాలా ఇష్టం. ఇంట్లోవాళ్లను ఒప్పించి యూరప్ పర్యటనకు వెళ్తుంది. యూరప్ పర్యటనలో భాగంగా ఇటలీలోని రోమ్ చేరుకుంటుంది. రోమ్ నగరంలో సమంతను కిట్టు (సాయిరాం శంకర్) చూసి వెంటాడటం ప్రారంభిస్తాడు. ప్లాన్ ప్రకారం సమంతకు దగ్గరై పాస్ పోర్ట్ ను తన దగ్గరే పెట్టుకుని ఏడిపిస్తుంటాడు. కావాలనే తన పాస్ పోర్ట్ తన వద్ద పెట్టుకుని ఏడిపిస్తున్నాడని తెలుసుకున్న సమంత.. కిట్టూని నిలదీస్తుంది. దాంతో కిట్టు తన ఫ్యాష్ బ్యాక్ ను చెపుతాడు. అయితే కిట్టు ఫ్లాష్ బ్యాక్ కు, సమంతకు లింకేమిటి? ఈ చిత్రంలో అతిధి పాత్రలు పోషించిన రవితేజ, ఆలీ, జయసుధ, నాగబాబులకు పాత్రల ఎంటీ? కిట్టు, సమంతల కథ చివరకు ఏమైందనేదే 'రోమియో' సినిమా. ఆకట్టుకునే అంశాలు: యూరప్, ముఖ్యంగా రోమ్ నగర అందాలు పీజీ విందా ఫోటోగ్రఫి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిరాశ పరిచే అంశాలు: కనీస స్థాయిలో కూడా దర్శకుడి ప్రతిభ ఆకట్టుకోకపోవడం తలా తోకాలేని కథ పట్టులేని కథనం నటీనటుల పనితీరు విశ్లేషణ: కిట్టూగా పూరి సోదరుడు సాయిరాం శంకర్, సమంతగా అడోనికలు నటించారు. కథలో దమ్ము లేకపోవడంతో, కథనం సాదాసీదాగా ఉండటం, తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఎలాంటి ట్విస్టులు లేకపోవడం ప్రేక్షకుడ్ని ఓ స్థాయిలోనూ ఆకట్టుకోని విధంగా ఉంది. హీరో కారెక్టర్ ఎంటో, యూరప్ ఎందుకెళ్లాడో అనే చిన్న లాజిక్ ను కూడాదర్శకుడు పట్టించుకోలేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసే అంశాల్లో ఒకటి. కనీసం వైజాగ్ లో పద్దుతో హీరో ప్రేమ కథను ఫ్లాష్ బ్యాక్ లో చూపించగలిగి ఉండే కొంత సమంజసంగా ఉండేదేమో. ఇక మధ్య మధ్యలో రవితేజ, ఆలీ కనిపించడం కొంత ఊరటతోపాటు, కొంత హాస్యాన్ని పండించినా..సినిమాకు బలంగా మారుతుందని చెప్పడం కష్టమే. ఓ సినిమా కన్నా ట్రావెల్ గైడ్ గానే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకే దర్శకుడు దృష్టి సారించారా అనిపిస్తుంది. సినిమా కంటే యూరప్ అందాలే ప్రేక్షకుడికి కొంత ఊరటనిచ్చాలే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాలంటే పీజి విందా ఫోటోగ్రఫి మాత్రమే. ఇక సునీల్ కాశ్యప్ సంగీతం కూడా అంతంతమాత్రేమే. పాటలు కూడా ఆలరించలేకపోయాయి. కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా మారలేకపోయింది. పూరి రాసిన ప్రేమకథ ఇంత నాసిరకంగా ఉంటుందా? లేదా ఆయన చెప్పిన కథను తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యారా అనే ప్రశ్న ప్రేక్షకుడిని వెంటాడటం చాలా కామన్ పాయింట్ గా మిగిలింది. పూరి మదిలో మెదిలిన 'రోమియో' ప్రేక్షకులను ఆకట్టుకోవడమనేదా అనే మిలియన్ డాలర్ ప్రశ్నే అని చెప్పవచ్చు. -రాజబాబు అనుముల