breaking news
Personal Assistants
-
టీచర్లను పీఏలు, పీఎస్లుగా కొనసాగించొద్దు
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు అక్టోబర్ 1 నుంచి పాఠశాలల విధుల్లో చేరాలని టీచర్లకు ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధుల వద్ద పీఏలు, పీఎస్లుగా కొనసాగే విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో సదుపాయాలలేమి, ఉపాధ్యాయుల కొరతపై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారించింది. ఉపాధ్యాయులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు పీఏలు, పీఎస్లుగా కొనసాగేందుకు వీల్లేదని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలా కొనసాగడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఉపాధ్యాయులు పీఏ, పీఎస్లుగా కొనసాగే విధానం దేశంలో ఎక్కడైనా ఉందా? అని అదనపు సొలిసిటర్ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించగా.. ఎక్కడా లేదని ఆయన సమాధానమిచ్చారు. దీంతో ఈ తరహా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్ని వారంలోగా పాఠశాలలకు కేటాయించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఇలాంటి ఉపాధ్యాయులంతా అక్టోబర్ 1 నుంచి పాఠశాలల్లో విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ సందర్భంగా తమ పిల్లల చదువుల నేపథ్యంలో పీఏలు, పీఎస్లుగా ఈ ఒక్క ఏడాది కొనసాగేందుకు అనుమతించాలని ఉపాధ్యాయులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో వారి పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. టీచర్లను పీఏలు, పీఎస్లుగా కొనసాగిం చేందుకు అంగీకరిస్తే.. రాజ్యాంగాన్ని కాపాడాలన్న బాధ్యతను ‘సుప్రీం’ పాటించనట్లేనని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. -
అప్పుడు తలదించుకుని కూర్చుంటా: గడ్కరీ
పుణే: మంత్రుల వద్ద పనిచేసే కొంతమంది వ్యక్తిగత సహాయకుల అత్యుత్సాహంతో ఒక్కోసారి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. టీ కంటే దాన్ని మరిగించిన పాత్రే వేడిగా ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో గడ్కరీ ప్రసంగిస్తూ వ్యక్తిగత సహాయకుల కారణంగా తాను కూడా ఇబ్బంది పడిన ఘటనలను గురించి చెప్పుకొచ్చారు. 'ఇటీవల రైల్లో నాగ్‌పుర్‌కు ప్రయాణిస్తున్నప్పుడు స్టేషన్ మేనేజర్‌కు తన పీఏ ఫోన్ చేసి, రైలును మొదటి ప్లాట్‌ఫామ్ పైకి తీసుకురావాలంటూ నాకు తెలియకుండానే కోరాడు. నా కాలికి గాయం అయిందని చెప్పాడ'ని గడ్కరీ పేర్కొన్నారు. మంత్రులు ఎప్పుడైనా మాజీలు కావచ్చనీ, వారికోసం పోలీసులు అత్యుత్సాహంతో ట్రాఫిక్ ను ఆపడం ఇబ్బందికరమన్నారు. 'ఇలాంటి సందర్భాల్లో కారులో తలదించుకుని కూర్చుంటాను. ప్రజల తిట్లు, ఛీత్కారాలు తప్పించుకునేందుకు ఈవిధంగా చేస్తాన'ని వెల్లడించారు. స్వలాభం చూసుకోకుండా ప్రజల కోసం పనిచేయాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన ఉద్బోధించారు.