breaking news
penalty payment
-
రిటర్నులకు ఇంకా చాన్సుంది..!
ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు (ఐటీఆర్) గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. ఏదైనా కారణాలతో గడువు లోపు రిటర్నులు సమర్పించలేకపోతే.. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కొంత పెనాల్టీ చెల్లించడం ద్వారా ఆదాయపన్ను చట్టం నిబంధనల కింద రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఇందుకు డిసెంబర్ 31 వరకూ గడువు ఉంది. ఇక గడువు ముగియడానికి చివరి గడియల్లో హడావుడిగా రిటర్నులు దాఖలు చేసిన వారు సైతం, అందులో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సరిచేసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఈ విషయంలో పన్ను చెల్లింపుదారులు ఏం చేయాలన్నది చూద్దాం. – సాక్షి, బిజినెస్ డెస్క్ఈ ఏడాది రిటర్నుల దాఖలుకు ఆదాయపన్ను శాఖ అదనపు సమయం ఇచ్చింది. జూలై 31గా ఉన్న గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. చివరి రోజుల్లో ఈ–ఫైలింగ్ పోర్టల్‌పై సాంకేతిక సమస్యలు రావడంతో సెప్టెంబర్ 16 వరకు రిటర్నులు సమర్పించేందుకు అవకాశం ఇచ్చింది. అయినా సరే సకాలంలో రిటర్నులు సమర్పించని వారు ఇప్పుడు బిలేటెడ్ (ఆలస్యంగా) ఐటీఆర్‌ను సెక్షన్ 139(1) కింద సమర్పించొచ్చు. ఇందుకు డిసెంబర్ 31 వరకు అవకాశం ఉంటుంది. కాకపోతే పెనాల్టీ కట్టాలి. అంతేకాదు, ఒకవేళ పన్ను చెల్లించాల్సి ఉంటే, వడ్డీతోపాటు కట్టేయాలి. సెక్షన్ 234ఎఫ్ కింద.. ఆదాయం రూ.5 లక్షలకు మించని వారు రూ.1,000 బిలేటెడ్ రిటర్నుల ఫీజు కింద చెల్లించాలి. ఆదాయం రూ.5 లక్షలు మించితే రూ.5,000 చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు.. సెక్షన్ 234ఏ కింద నికరంగా చెల్లించాల్సిన పన్నుపై, గడువు ముగిసిన నాటి నుంచి నెలవారీ ఒక శాతం చొప్పున వడ్డీని చెల్లించాలి. అప్పటికే సంబంధిత పన్ను చెల్లింపుదారు పాన్‌పై నమోదైన టీడీఎస్, ముందస్తు పన్ను చెల్లింపులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నికరంగా చెల్లించాల్సిన మొత్తంపైనే వడ్డీ పడుతుందని బీడీవో ఇండియా ఎల్ఎల్పీ ట్యాక్స్ పార్ట్నర్ ప్రీతి శర్మ తెలిపారు. అసలు చెల్లించాల్సిన తేదీ నుంచి, రిటర్నులు సమర్పించే తేదీ వరకు ఈ వడ్డీని పరిగణనలోకి తీసుకుంటారు. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద పన్ను బాధ్యత రూ.10,000కు మించి ఉంటే అందులో 90 శాతాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగియక ముందే చెల్లించాలని (ముందస్తు పన్ను) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రకారం.. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నికర పన్ను మొత్తంలో 90 శాతాన్ని ముందుగా చెల్లించడంలో విఫలమైతే అప్పుడు సెక్షన్ 234బీ కింద నిబంధనలు అమలవుతాయి. వీటి కింద ఆర్థిక సంవత్సరం ముగిసిన మర్నాటి నుంచి (ఏప్రిల్ 1) పన్ను మొత్తంపై వడ్డీ రేటు అమల్లోకి వస్తుంది. ఇక సెక్షన్ 234సీ కింద సంబంధిత త్రైమాసికం చివరి తేదీ నాటికి ముందస్తు పన్ను చెల్లించడంలో విఫలమైనా, లేదా తక్కువ చెల్లించినా.. అప్పుడు క్వార్టర్ వారీ పరిశీలన తర్వాత వడ్డీ రేటు అమలు చేస్తారు. ఒకవేళ త్రైమాసికం వారీ ముందస్తు పన్ను చెల్లింపుల్లో విఫలమై, ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కూడా గడువులోపు రిటర్నులు సమర్పించి, పన్ను బకాయిని వడ్డీ సహా చెల్లించలేకపోతే.. అలాంటి సందర్భాల్లో ఈ మూడు సెక్షన్ల (234ఏ, బీ, సీ) కింద మూడు రెట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ప్రీతి శర్మ వివరించారు. దీంతో చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా పెరిగిపోతుంది. ఈ భారం వద్దనుకుంటే నిబంధనల ప్రకారం సకాలంలో చెల్లించడమే చక్కని మార్గం. జాప్యం చేస్తే నష్టమే.. గడువులోపు రిటర్నులు దాఖలు చేసినట్టయితే పాత, కొత్త పన్ను విధానాల్లో తమకు అనుకూలమైన దాన్ని (తక్కువ పన్ను భారం పడే) ఎంపిక చేసుకోవచ్చు. కానీ, గడువు దాటితే విధిగా కొత్త పన్ను విధానం కిందే సమర్పించగలరు. అంతేకాదు సెక్షన్ 10ఏ, 10బీ, 80–1ఏ, 80–ఐబీ, 80–ఐసీ, 80–ఐడీ, 80–ఐఈ కింద వ్యాపార, మూలధన నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకోవడం కుదరదు. గడువులోపు రిటర్నులు సమర్పించిన వారికే ఈ నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ‘‘గడువు తర్వాత కొత్త పన్ను విధానం కింద రిటర్నులు వేసేట్టు అయితే స్వీయ నివాసానికి సంబంధించి నష్టాలను లాభాలతో సర్దుబాటు చేసుకునేందుకు లేదా తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు అనుమతి ఉండదు. అద్దెకు ఇచ్చిన నివాసం రూపంలో నష్టం ఏర్పడితే, కేవలం క్యారీ ఫార్వార్డ్ (తదుపరి ఆర్థిక సంవత్సరాలకు ) చేసుకునేందుకే అవకాశం ఉంటుంది’’ అని ప్రీతి శర్మ తెలిపారు. అలస్యంగా డిసెంబర్ 31లోపు దాఖలు చేసినప్పటికీ, సాధారణ ఐటీఆర్ మాదిరే మదింపు చేస్తారు. నికరంగా పన్ను చెల్లించాల్సిన వారే రిటర్నులు వేయాలని లేదు. పన్ను చెల్లించేంత ఆదాయం లేని వారు సైతం బిలేటెడ్ రిటర్నుల పత్రాన్ని సమర్పించడం ద్వారా నిబంధనలను పాటించొచ్చు. దీనివల్ల టీడీఎస్ లేదా టీసీఎస్‌లు ఉంటే నిబంధనల కింద పెనాల్టీ చెల్లించి, వాటి రిఫండ్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.ఇలా సమర్పించొచ్చు.. ఈ–ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. ‘ఈ–ఫైల్’ విభాగంలో ‘ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్’ అన్న దగ్గర క్లిక్ చేయాలి. అక్కడ అసెస్మెంట్ సంవత్సరాన్ని ఎంపిక చేసుకుని, ‘రివైజ్డ్ రిటర్న్ అండ్ సెక్షన్ 139(5)’పై క్లిక్ చేయాలి. తొలుత సమర్పించిన ఐటీఆర్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్‌ను పేర్కొనడం మర్చిపోవద్దు. ఆఫ్‌లైన్‌లో పేపర్ రూపంలో (80 ఏళ్లకు పైబడిన వారు) రిటర్నులు దాఖలు చేసిన వారు ఆన్లైన్లో సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు. తిరిగి భౌతిక రూపంలోనే సమర్పించాల్సి ఉంటుంది. సవరణ రిటర్నులను డిసెంబర్ 31 (2024–25 సంవత్సరానికి సంబంధించి) వరకు ఎన్ని పర్యాయాలు అయినా సమర్పించొచ్చు. ఇందుకు ఎలాంటి పెనాల్టీ చెల్లించక్కర్లేదు. రిఫండ్ ప్రాసెస్ అయిన తర్వాత కూడా సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. సాధారణ రిటర్నుల మాదిరే సవరణ రిటర్నులు వేసిన తర్వాత 30 రోజుల్లోపు ధ్రువీకరించడం తప్పనిసరి. అప్పుడే అది మదింపునకు వెళుతుంది.వివిధ వర్గాల వారికి రిటర్నుల గడువు → వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ఆడిటింగ్ అవసరం లేని అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ (ఏవోపీ), బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (బీవోఐ) రిటర్నులు దాఖలు చేయాల్సిన గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. → ఆడిట్ అవసరమైన వ్యాపార సంస్థలు రిటర్నుల సమర్పణ గడువు అక్టోబర్ 31. → సవరణ, బిలేటెడ్ రిటర్నుల సమర్పణ గడువు డిసెంబర్ 31. → 2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి అప్డేటెడ్ రిటర్నుల దాఖలు గడువు 2030 మార్చి 31. డిసెంబర్ 31నాటికి దాఖలు చేయకపోతే..? డిసెంబర్ 31లోపు ఆలస్యపు రిటర్నులు సమర్పించడంలోనూ విఫలమైతే ఏమవుతుంది? అన్న సందేహం ఏర్పడొచ్చు. అలాంటి కేసుల్లో ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు జారీ కావొచ్చు. సకాలంలో రిటర్నులు వేయడం ద్వారానే చట్టపరిధిలో ఎన్నో మినహాయింపులు, ప్రయోజనాలకు అర్హత ఉంటుంది. లేదంటే వీటిని కోల్పోయినట్టే. రుణాలకు, ఆదాయ ధ్రువీకరణకు, వీసా ప్రాసెసింగ్‌కు ఐటీ రిటర్నులు రుజువుగా పనికొస్తాయన్నది గుర్తు పెట్టుకోవాలి. రిటర్నుల్లో సవరణలు.. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు ఇటీవలి కాలంలో కొంత సులభంగా మారినప్పటికీ, ఇంకా కొంత సంక్లిష్టమనే చెప్పుకోవాలి. అన్ని ఆర్థిక లావాదేవీలు, ఆదాయం, పెట్టుబడులు, మూలధన లాభాలు/నష్టాలు, డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, విదేశీ పెట్టుబడులు ఇలా ఎన్నో వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. టీడీఎస్, టీసీఎస్ ఏవైనా ఉంటే సరిచూసుకోవాలి. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)ను చూసుకున్న తర్వాత అందులో ఏవైనా తప్పులుంటే ఆదాయపన్ను శాఖకు రెక్టిఫికేషన్ (దిద్దుబాటు) అభ్యర్థన నమోదు చేయాలి. ఇంత సుదీర్ఘ ప్రక్రియలో కొన్ని తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు. లేదా ఫలానా ఆదాయం లేదా ఆర్థిక లావాదేవీల వివరాలను వెల్లడించడం మర్చిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కనుక రిటర్నులు సమర్పించిన అనంతరం ప్రతి ఒక్కరూ ఒక్కసారి సమగ్రంగా పరిశీలించుకోవడం మంచిది. ఏవైనా తప్పులుంటే, వాటిని సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 31లోపు ఈ పనిచేయొచ్చు. ఐటీఆర్ పత్రం సరైనది ఎంపిక చేసుకోకపోవడం, వ్యక్తిగత వివరాల్లో తప్పులు, బ్యాంక్ ఖాతా వివరాల్లో తప్పులు, కొన్ని ఆదాయాలను వెల్లడించకపోవడం, మినహాయింపులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోకుండా పన్ను రిటర్నులు వేసి, అధిక పన్ను చెల్లించడం.. విదేశీ పెట్టుబడులు, ఆదాయాలు, ఇ–సాప్లు.. ఎలాంటి ఆధారాల్లేకుండా మినహాయింపులను క్లెయిమ్ చేసుకున్న సందర్భాల్లో సవరణ రిటర్నులు సమర్పించొచ్చు. ముఖ్యంగా విదేశీ ఆస్తులు, ఆదాయాలను వెల్లడించకపోతే ‘బ్లాక్‌మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్, 2015’ కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అప్పటికే సమర్పించిన రిటర్నులను ఆదాయపన్ను శాఖ మదింపు చేయడం ముగిసిపోతే సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు. → సెక్షన్ 143 (1) కింద ఐటీఆర్ ప్రాసెస్ (ఇనీíÙయల్/ప్రాథమిక) అయినప్పుడే సవరణ రిటర్నులను డిసెంబర్ 31లోపు లేదా తుది ప్రాసెసింగ్‌కు ముందు సమర్పించుకునేందుకు అనుమతి ఉంటుంది. → ఒకవేళ డిసెంబర్ 31 కంటే ముందుగానే సెక్షన్ 143 (3) కింద ఐటీఆర్ తుది మదింపు ముగిసినట్టయితే సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు. ఇటువంటి సందర్భంలో సెక్షన్ 139(8ఏ) కింద ఐటీఆర్–అప్డేటెడ్ సమర్పించుకోవచ్చు.డిసెంబర్ 31 తర్వాత కూడా.. గడిచిన ఆర్థిక సంవత్సరానికి తర్వాతి ఆర్థిక సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. 2024–25కు 2025–26 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. అసెస్మెంట్ సంవత్సరం డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్నులు లేదా సవరణ రిటర్నులు సమర్పించుకోవచ్చు. అప్పటికీ అది చేయలేకపోతే, ఆ తర్వాత ఉన్న ఏకైక మార్గం అప్డేటెడ్ రిటర్నులు (ఐటీఆర్–యూ) సమర్పించడం. అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన నాటి నుంచి 48 నెలల వరకు (నాలుగేళ్లు) ఇందుకు అవకాశం ఉంటుంది. అసలు టర్నులు దాఖలు చేయకపోయినా లేక సమర్పించిన రిటర్నుల్లో తప్పులను గుర్తించినా లేదా ఏవైనా ఆదాయ, ఆస్తుల వివరాలు వెల్లడించడం మర్చిపోయినా లేదా సవరణ రిటర్నుల్లోనూ తప్పులను గుర్తించిన సందర్భాల్లో.. ఐటీఆర్–యూ దాఖలు చేసుకోవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139(8ఏ) ఇందుకు అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా ఆదాయపన్ను చెల్లించాల్సిన బాధ్యత కలిగి, రిటర్నులు సమర్పించని వారు లేదా సమర్పించినా సమగ్ర వివరాలు వెల్లడించని వారు తప్పకుండా ఐటీఆర్–యూ దాఖలు చేసి, పెనాల్టీ, వడ్డీ సహా పన్నును చెల్లించడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులను ఎంత ఆలస్యంగా దాఖలు చేశారు, చెల్లించాల్సిన పన్ను ఎంతన్నదాని ఆధారంగా.. అసలుకి 25 శాతం, 50 శాతం, 60 శాతం లేదా 70 శాతం వరకు అదనపు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా అంతకాలానికి వడ్డీ, పెనాల్టీలను కూడా సమర్పించుకోవాలి. -
మినిమం బ్యాలెన్స్ లేదంటే జరిమానా.. తప్పించుకోవడం ఎలా?
పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానా(penalty) చెల్లించాలనేలా బ్యాంకు సిబ్బంది చెబుతుంటారు. అకౌంట్ నిర్వహణ, ఏటీఎం కార్డు ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీలు.. వంటి వాటికోసం సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. లేదంటే నిబంధనల ప్రకారం తిరిగి అకౌంట్(Bank Account) వినియోగించినప్పుడు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందికి ఒకటికి మించిన బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. దాంతో ప్రధానంగా ఉన్న అకౌంట్లోనే లావాదేవీలు(Transactions) నిర్వహిస్తూ మిగతావాటి జోలికి వెళ్లడంలేదు. దాంతో కొన్ని రోజుల తర్వాత తిరిగి ఆ అకౌంట్లో లావాదేవీలు చేయాలంటే జరిమానా చెల్లించడం తప్పడం లేదు. కొన్ని చిట్కాలు పాటించి జరిమానా భారాన్ని తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే..సేవింగ్స్ ఖాతాలో అవసరమైన మినిమం బ్యాలెన్స్(Minimum Balance) ఎల్లవేళలా ఉండేలా చూసుకోవాలి. సగటు నెలవారీ బ్యాలెన్స్ (MBA)ను ఎలా లెక్కిస్తారో మీ బ్యాంకు సిబ్బందిని అడిగి తెలుసుకోండి. దాని పరిమితికి మించి లావాదేవీలు నిర్వహించడానికి ప్రయత్నించాలి.ఉదాహరణకు, మీ మినిమం బ్యాలెన్స్ రూ.10,000 అయితే అవసరమైన ఎంఏబీని మెయింటెన్ చేయడానికి నెలలోపు ఆరు రోజుల పాటు రూ.50,000 మీ అకౌంట్లో ఉండాలి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నవారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ నిబంధనలు ప్రతి బ్యాంకును అనుసరించి మారుతుంటాయి. మీ బ్యాంకులో ఎంఏబీ నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా అకౌంట్లో నగదు ఉంచుకోవాలి.జీరో బ్యాలెన్స్ ఖాతాలుబేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీఏ) అని కూడా పిలువబడే ఈ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాకు మారేందుకు ప్రయత్నించాలి. చాలావరకు సాలరీ అకౌంట్లు ఈ తరహా ఖాతాలుగా ఉంటాయి. ఈ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.రెగ్యులర్ మానిటరింగ్అకౌంట్ బ్యాలెన్స్ అవసరమైన కనీస స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసుకోవాలి. బ్యాలెన్స్ ట్రాక్ చేయడంలో మీకు సహాయపడటానికి అలర్ట్‌లు లేదా రిమైండర్లను సెట్ చేసుకోవాలి. ఏదైనా కారణాలతో డబ్బు కట్ అయిన వెంటనే అలెర్ట్ వచ్చేలా ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి, మినిమం బ్యాలెన్స్ పాటించవచ్చు.ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్స్అవసరమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మీరు తరచూ లావాదేవీలు చేసే ప్రధాన అకౌంట్ నుంచి బ్యాలెన్స్ తక్కువగా ఉన్న సేవింగ్స్ అకౌంట్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్లను సెట్ చేసుకోవాలి.ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలుఖాతాను మూసివేయడంఎంత ప్రయత్నించినా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించలేకపోతే, ప్రస్తుత ఖాతాను మూసివేసి, జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందించే బ్యాంకుతో అనుసందానమై కొత్త ఖాతా తెరవడానికి ప్రయత్నించండి. -
మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాపై యురోపియన్ కమిషన్ భారీ జరిమానా విధించింది. యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను మెటాకు ఏకంగా 800 మిలియన్ యూరోలు(840 మిలియన్ డాలర్లు-రూ.6,972 కోట్లు) పెనాల్టీ విధించింది. మెటా తన మార్కెట్ గుత్తాధిపత్యాన్ని వినియోగించుకుని ఆన్లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ వ్యాపారంలో పోటీ వ్యతిరేక విధానాలను అవలంబించిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది.‘యూరోపియన్ యూనియన్ యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా సంస్థపై దాదాపు రూ.6,972 కోట్లమేర పెనాల్టీ విధించాం. నిబంధనలకు విరుద్ధంగా ఫేస్బుక్ మార్కెట్ స్పేస్‌ను వినియోగించుకుంటుంది. ఫేస్బుక్లో తనకు పోటీగా ఉన్న ఇతర ప్రకటన ఏజెన్సీలకు సంబంధించి ఆన్లైన్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్‌పై అననుకూల వ్యాపార పరిస్థితులను అమలు చేసింది. ఫేస్బుక్ వినియోగదారులకు మార్కెట్‌స్పేస్ యాక్సెస్ ఇస్తూ పోటీ వ్యతిరేక విధానాలను అవలబింస్తుంది. దాని ద్వారా ఫేస్బుక్ తన మార్కెట్ గుత్తాధిపత్యంతో నిబంధనలను దుర్వినియోగం చేస్తోంది. దాంతోపాటు చట్టవిరుద్ధంగా ఫేస్బుక్ వినియోగదారులకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రకటనలను జొప్పిస్తోంది’ అని యురోపియన్ కమిషన్ ఆరోపించింది.ఇదీ చదవండి: తగ్గేదేలే.. మరోసారి పని గంటలపై నారాయణ మూర్తి వ్యాఖ్యలుకంపెనీ స్పందనయురోపియన్ కమిషన్ లేవనెత్తిన ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేవని మెటా తెలిపింది. ఈ అంశంపై అప్పీలుకు వెళుతామని స్పష్టం చేసింది. మెటా తన ప్రకటనదారుల నిబంధనలకు కట్టుబడి ఉందని తెలిపింది. వినియోగదారులు ఫేస్బుక్ మార్కెట్‌ప్లేస్‌ను అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడుతుందని చెప్పింది. అందులో కంపెనీ ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. -
నల్లధనం వెల్లడికి కౌంట్‌డౌన్...
రేపటి నుంచి 4 నెలలు స్పెషల్ విండో న్యూఢిల్లీ: నల్లధనం వివరాలను ప్రభుత్వానికి వెల్లడించి పన్ను, జరిమానా చెల్లింపు ద్వారా తప్పును సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్న పథకం బుధవారం నుంచీ ప్రారంభం కానుంది. ఆదాయం వెల్లడి పథకం 2016 కింద జూన్ 1 నుంచీ ప్రారంభమవుతున్న ఈ విండో నాలుగునెలలు అమల్లో ఉంటుంది. ప్రకటిత ఆదాయంపై పన్ను, జరిమానాతో కలిసి 45 శాతం చెల్లింపుల ద్వారా నల్లడబ్బు కలిగి ఉన్నవారు... సమస్య నుంచి బయటపడేందుకు ఈ స్కీమ్ అవకాశం కల్పిస్తోంది. నిర్ణయ మొత్తం పన్నును నవంబర్ 30వ తేదీలోపు చెల్లించాల్సి ఉంటుంది. అధికార ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కు సంబంధించిన ఆన్లైన్ ద్వారా కానీ లేక వివిధ ప్రాంతీయ ప్రిన్సిపల్ కమిషనర్ కానీ ద్వారా డిక్లరేషన్‌ను సమర్పించవచ్చు. కాగా కార్యక్రమంపై అవగాహనను పెంపొందించేందుకు మంగళవారం (మే 31వ తేదీ) సాయంత్రం 7 గంటలకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) అధికారులు ‘టాకెథాన్’ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించనున్నారు.


