breaking news
PCC Vice President Tulasi Reddy
-
టీడీపీ, బీజేపీలు తోడు దొంగలు
వేంపల్లె : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయమై పార్లమెంటు సాక్షిగా టీడీపీ, బీజేపీలు రాష్ట్రానికి అన్యాయం చేయడం శోచనీయమని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. నేను కుట్టినట్లు చేశా.. నీవు ఏడ్చినట్లు నటించు అని కూడగలుపుకొని ఆ రెండు పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం, దగా చేస్తున్నాయన్నారు. విశ్వసనీయతలేని బీజేపీ మాటమీద నిలబడక మోసగాళ్ల పార్టీగా నిరూపించుకుందన్నారు. టీడీపీ బీజెపీ చేతిలో కీలు బొమ్మగా మారిందన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీగా, కేంద్రంలో అధికారిగా భాగస్వామిగా ప్రత్యేక హోదాపై పోరాడాల్సిన బాధ్యత టీడీపీకి ఎక్కువగా ఉందన్నారు. అది విస్మరించి తెలుగు దద్దమ్మల పార్టీగా మారడం శోచనీయమన్నారు. బీజేపీ చేసిన మోసంలో, ద్రోహంలో టీడీపీ పాత్ర లేకుంటే ఆ పార్టీ కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ మంత్రులను తొలగించాలన్నారు. అలా చేయకపోవడం వల్ల టీడీపీని తెలుగు ద్రోహుల పార్టీ అనాల్సి వస్తోందన్నారు. ఏదీ ఏమైనప్పటికి ప్రత్యేక హోదా ఆంద్రప్రదేశ్ హక్కు అని.. సాధించేవరకు కాంగ్రెస్ పార్టీ విస్మరించదన్నారు. 2019లో ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు. సర్వే పిచ్చి తుగ్లక్ వ్యవహారం : ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న సాధికారిక సర్వే పిచ్చి తుగ్లక్ వ్యవహారం అని తులసిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన స్వగృహంలో కుటుంబ వివరాలను నమోదు చేసుకొనేందుకు ఆనిమేటర్లను అక్కడికి పిలిపించారు. దాదాపు 38నిమిషాలపాటు 80అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సర్వే సిబ్బంది తులసిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అంతా అయిపోయాక సర్వర్ పనిచేయలేదు. గత వారంలో కూడా ఇదే జరిగిందని తులసిరెడ్డి అన్నారు. సర్వే మొదలు పెట్టినప్పటి నుంచి చాలా సార్లు సాంకేతిక పద్దతులు మార్చారని.. ఇది పిచ్చి తుగ్లక్ వ్యవహారం కాక మరేమిటని ప్రశ్నించారు. -
ఎన్టీఆర్‌కు, బాబుకు పోలికే లేదు: తులసిరెడ్డి
వేంపల్లె: ఎన్టీఆర్, చంద్రబాబుకు పోలికే లేదని, వారి మధ్య సతీ సావిత్రికి, చింతామణికి ఉన్నంత తేడా ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం సందర్భంగా ఇతర పార్టీల వారు టీడీపీలో చేరదలుచుకుంటే ఆ పార్టీల పరంగా వచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేసిన తర్వాతనే టీడీపీలోకి రావాలని ఆనాడు ఎన్టీఆర్ తీర్మానం చేశారన్నారు. నేడు ఇందుకు విరుద్ధంగా చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు.