breaking news
P.B. Srinivas
-
ఓ గాయకుడి కలం సవ్వడి
కొత్త పుస్తకం గాయకుడిగా సుపరిచితులైన స్వర్గీయ పి.బి. శ్రీనివాస్ కలానికి కూడా బోలెడంత పదునుంది. 1963 - 64 ప్రాంతంలో అప్పటి ప్రముఖ మాసపత్రిక ‘జ్యోతి’లో ఆయన తన రచనా పటిమను ప్రదర్శించారు. ఆనాటి సుప్రసిద్ధ తెలుగు సినీ సంగీత దర్శకులనూ, వారి పనితీరునూ ఆహ్లాదకరంగా అక్షరాలలో ఆవిష్కరించారు. యాభయ్యేళ్ళ తరువాత తాజాగా పుస్తకరూపంలో వచ్చిన అప్పటి ఆ వ్యాసాల నుంచి కొన్ని మల్లెలు... సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వర్రావు గారు భలే తమాషా మనిషి, విచిత్రమైన వ్యక్తి. ఎవరితోనైనా ఇట్టే పరిచయం చేసేసుకుని సరదాగా మాటాడేయగలిగే శక్తి ఆయనది. ఆ ధోరణిలో నవ్వుతూ నవ్వుతూనే నసాళానికి అంటిపోయే జోకులు బ్రేకుల్లేకుండానే స్వీట్ కేకుల్లా తెగవేయగలిగే నేర్పు ఉంది. ఒకరోజు మేం రిహార్సల్సు చేస్తూండగా వీరికీ, వీరి అన్నగారైన హనుమంతరావుగారికీ ఒక చిత్ర విచిత్రమైన సంభాషణ జరిగింది. మాటల సందర్భంలో రా.రా. నౌషాదునీ, నౌషధ సంగీతాన్ని తెగ పొగడసాగారు. వీరి అన్నగారు ‘‘ఏమిటోయ్! నువ్వు చాలా గొప్పవాడవని మన ప్రొడ్యూసర్లు నిన్ను గౌరవించి పిలిస్తే నువ్వేమిటి ఇలా ఎవరెవరో నౌషాదు గురించీ, వాళ్ళ గురించీ లంకించుకున్నావూ’’ అని సాగదీశారు. తన తమ్ముణి అక్కడివాళ్లెక్కడ అపార్థం చేసుకుంటారోనన్న భయంతో. దానికి రా.రా. గారేమన్నారో తెలుసా? ‘‘నౌషాఁదుగారు గొప్పవాళ్ళన్నాం గాని, మనం కాఁవఁన్నామా? ఎవరి గొప్పవారిదే. ఒకరి గొప్పతనాన్ని చెప్పుకున్నందువల్ల తప్పూ లేదు. మనం తగ్గీపోము’’ అన్నారు. (ఈ ‘‘మనం’’ అనేది వారు తరచూ ‘‘నేను’’ అనే మాటకి బదులు వాడుతూ వుండే ఊతపదం.) ఇదీ వారి సామర్థ్యం. ఎవరేమాట అన్నా, వెంటనే దానికి టంకంపొడిలా అతుక్కునేలా జవాబిస్తారు. మాస్టర్ వేణు సంగీతకారులే కాక, గాయకులు కూడా. వీరి హాబీలలో ముఖ్యమైనది ఇంగ్లిషు, హిందీ చిత్రాలు చూడ్డం. నౌషద్ సంగీతమిస్తే చాలు, ప్రథమ శ్రేణికి చెందిన చెత్త చిత్రమైనా సరే చూసి ఆనందించి మరీ చక్కా వస్తారు. మరో ముఖ్యమైన హాబీ ‘పియానో’ వాయించడం. అలాగే పదిహేను వాద్యాల్లో ప్రావీణ్యం సంపాయించారు. హార్మోనియాన్ని మాష్టర్ చేశారు. పాటలకి వరసలు కూర్చేటప్పుడు, పాటలలోని మాటలలోని అక్షరానికీ అక్షరానికీ మధ్య లక్ష సంగతులు ఇరికించడానికే ప్రయత్నిస్తారు వీలైనంతవరకూ, అర్థం చెడనంతవరకూ, ఈ సంగతులనేకంగా మరాఠీ బాణీలో ఉంటాయి. ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ చేతనైనందువల్లనే, వీరికి ‘రికార్డింగు’ సమయంలో సౌకర్యం. పని సుకరం. మాస్టర్ వేణు మనసుపైనే కాక వారి సంగీతం పైన కూడా నౌషాదు ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన్నికైన రాగాల ఎన్నికలో, వాద్యప్రయోగాలలో. వేణు ఫ్లూట్, క్లార్నెట్టు కాంబినేషన్, వయోలిన్ల కో ఆర్డినేషనంతా నౌషాద్ బాణీయే. లోకవ్యవహారంలో ఆయన (పెండ్యాల) నాగేశ్వరరావే కానీ, సంగీత లోకవ్యవహారంలో ఆయన పేరు రాగేశ్వరరావు. అంతే కాదు; ఓర్పు, నేర్పు, కూర్పులకు ఆయన పెట్టింది పేరని పి.బి. శ్రీనివాస్ తీర్పు. టేకుల సెలక్షన్లో పెండ్యాల చూపే శ్రద్ధాసక్తులు నిర్మాత తిలక్గారి కంపెనీలు - అనగా ‘అనుపమా’లు. రాత్రిళ్ళు రికార్డింగులు జరిగేటప్పుడు గూడా పాడిన మేము, వాద్యాలు బజాయించిన ఆర్కెస్ట్రా బృందం అలిసిపోయి ఇంటికి దౌడు తీసినా, తెల్లవారిపోతున్నా సరే, ఇసుమంతయు విసుగొందక చేయించిన ఇరవై టేకులూ విని, ప్రతీ టేకులోనూ, తనకి నచ్చిన తునకలు (బిట్స్) అన్నీ గుర్తించి పెట్టుకుని, వాటినన్నిటినీ కలిపి, మొత్తం మీద నీటైన టేకొకటి తయారించుకుంటారు. ‘అత్తా ఒకింటి కోడలు’ చిత్రానికి, జిక్కిగారు నేనూ బృందసహాయంతో ఆలపించిన ‘పైలా పైలా పచ్చీసు’ పాటే దీనికి తిరుగులేని తార్కాణం. ఆ రోజున ఖర్మం కొద్దీ ఒక్క టేకూ పూర్తిగా తృప్తిగా రాలేదు. ‘రిదం’లో కాంప్లికేషన్ వల్లనైతేనైం, నిద్రాముద్రితాలైన ముఖాలతో జోగుతూ ఉండడం వల్లనైతేనేం, తాళంలో ఒకరు చేరితే మరొకరు చేరేవారు కారు. ఎలాగో ఇసకలోంచి నూనె పిండినట్టుగా, కొన్ని టేకులు టేకాము. మంచి పాట చెడిపోయిందనే బాధతోనే బయలుదేరాము ఇళ్ళకి. కానీ, చివరికి ఏం చేశారో, ఎలా సాధించారో కాని, మేము పిక్చర్లో ఆ పాట విన్నప్పుడదిరి పోయాం. ఇంత చక్కని టేకెక్కడ దొరికింది ఈయనకని. డిఫెక్ట్సన్నీ ఎఫెక్ట్స్గా మారిపోయాయి పెండ్యాల చేతిలో. కె.వి. మహదేవన్ పదింటికి రికార్డింగు ప్రారంభిస్తారు. పదకొండింటికల్లా ‘‘ప్యాకప్’’ అంటారు. చకచకా సాగిపోతుంది వీరి ‘వర్కు’ కొనసాగేవరకు. మధ్య మధ్య పకపకలతోనూ వికవికలతోనూ దద్దరిల్లుతుండడం కూడా కద్దు - రికార్డింగు హాలు. మహాదేవన్ గారితో పనిచేయడం మహా సుళువు. ఈజీ కంపోజింగులో కడుంగడు నేర్పరులు. ‘పొన్నిత్తిరునాళ్’ అనే తమిళ చిత్రానికి ‘ఏన్ శిరిత్తాయ్ ఎన్నైప్పార్తు (నన్ను జూచి నగవేటికి)’ వరస కట్టడానికి కూర్చున్నారు. నన్ను రిహార్సల్సుకి పిలిపించిన పిదప, ఆనాడే శ్రీ బడే గులామ్ ఆలీఖాన్ పాట విని ప్రభావితుడనైయున్న నేను నాలో నేనే ‘పహాడి’ రాగాన్ని సన్నగా గొణుగుకుంటున్నా. అదే రాగంలో అర నిమిషంలో అక్కజమందేలా అమర్చేశారు. ఆ పాట హిట్టయింది. -
గీత స్మరణం
పల్లవి : ఆమె: అది ఒక ఇదిలే అతనికే తగులే సరికొత్త సరసాలు సరదాలు చవిచూపెలే ఆహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే లాలలాలలాలలాలలలా ॥ అది ఒక ఇదిలే... చరణం : 1 అతడు: మెచ్చాను వచ్చాను ఏమేమో తెచ్చాను అహ నచ్చాను అన్నావా ఏమైనా ఇస్తాను అని పలికిందిరా... చె లి కులికుందిరా... ఎద రగిలిందిరా మతి చెదిరిందిరా చెదిరిందిరా... అది ఒక ఇదిలే ఆమెకె తగులే సరికొత్త సరసాలు సరదాలు చవిచూపెలే ఆహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే అది ఒక ఇదిలే... చరణం : 2 ఆ: సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడు (2) అహ మొగ్గల్లే ఉన్నావు విరబూయమన్నాడు మది పులకించెను... మరులొలికించెను... నను మరిపించెను తగుననిపించెను అనిపించెను... అది ఒక ఇదిలే... చరణం : 3 అ: నడకేది అన్నాను నడిచింది ఒకసారి అహ నడుమేది అన్నాను నవ్వింది వయ్యారి నా వద్దున్నదే... తన ముద్దన్నదీ... చేకొమ్మన్నదీ నీ సొమ్మన్నది... సొమ్మన్నది ఆ: ఎండల్లే వచ్చాడు మంచల్లే కరిగాను ఆహా వెన్నెల్లు కురిశాడు వేడెక్కిపోయాను ఇది బాధందునా ఇది హాయందునా ఏది ఏమైననూ నే తనదాననూ తనదాననూ... ॥ చిత్రం : ప్రేమించిచూడు (1965) రచన : ఆచార్య ఆత్రేయ సంగీతం : మాస్టర్ వేణు గానం : పి.బి.శ్రీనివాస్, పి.సుశీల