breaking news
Para medical jobs
-
వైద్య సేవల్లో ముందుండే.. పారామెడికల్!
పారామెడికల్ సిబ్బంది.. రోగ నిర్థారణలో, చికిత్సలో, వ్యాధిని తగ్గించి రోగికి ఉపశమనం కల్పించడంలో వీరి పాత్ర ఎంతో కీలకం. ఈసీజీ, స్కానింగ్‌లు, రక్త పరీక్షలు వంటి అనేక రకాలపరీక్షలు నిర్వహించి డాక్టర్లకు రిపోర్టులు ఇస్తారు. తద్వారా వ్యాధి నిర్థారణలో వైద్యులకు సహాయపడతారు. సంబంధిత పారామెడికల్ కోర్సులను పూర్తిచేయడం ద్వారా ఆయానైపుణ్యాలు సొంతం చేసుకుంటారు. వాస్తవానికి ఇంటర్ బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్/ బీడీఎస్/ బీహెచ్ఎంఎస్/ నర్సింగ్/ బీవీఎస్సీ/ఫార్మసీ/ఆయూష్ కోర్సులను లక్ష్యాలుగా చేసుకుంటారు. వీటితోపాటు ‘పారామెడికల్ కోర్సుల’నూఎంపికచేసుకోవచ్చు. తద్వారా తక్షణం ఉపాధికి మార్గం వేసుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ పూర్తిచేసుకున్నఅభ్యర్థులకు అందుబాటులో ఉన్న పారామెడికల్కోర్సుల గురించి తెలుసుకుందాం... పారా మెడికల్ కోర్సులు పారామెడికల్‌కు సంబంధించి డిగ్రీ స్థాయి కోర్సులు » డిప్లొమా కోర్సులు » సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ స్థాయి పారామెడికల్ కోర్సులు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ, ఓటీటీ (ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ)లో బీఎస్సీ; డయాలసిస్ టెక్నాలజీలో బీఎస్సీ; ఎంఎల్టీ(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)లో బీఎస్సీ; ఎక్స్–రే టెక్నాలజీలో బీఎస్సీ; రేడియోగ్రఫీలో బీఎస్సీ; మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలో బీఎస్సీ; మెడికల్ రికార్డ్ టెక్నాలజీలో బీఏఎస్ఎల్పీ; ఆప్తాల్మిక్ టెక్నాలజీలో బీఎస్సీ; బీఎస్సీ ఆడియాలజీ; స్పీచ్ థెరపీలో బీఎస్సీ; ఆప్టోమెట్రీలో బీఎస్సీ; అనస్తీషియా టెక్నాలజీలో బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ♦ పైన పేర్కొన్న పలు బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల కాల వ్యవధి 3 ఏళ్లు. వీటిల్లో కొన్ని కోర్సుల కాల వ్యవధి 4 ఏళ్లుగా ఉంది. ♦ అర్హత: బయాలజీ సబ్జెక్టుతో 10+2 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ స్థాయి పారామెడికల్ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. పారామెడికల్ డిప్లొమా కోర్సులు ఫిజియోథెరపీలో డిప్లొమా, ఆక్యుపేషనల్ థెరపీలో డిప్లొమా, డాట్(డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ), డయాలసిస్ టెక్నాలజీలో డిప్లొమా; డీఎంఎల్టీ(డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), ఎక్స్–రే టెక్నాలజీలో డిప్లొమా, రేడియోగ్రఫీలో డిప్లొమా, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ నర్సింగ్ కేర్ అసిస్టెంట్, ఏఎన్ఎం, జీఎన్ఎం, ఆప్తాల్మిక్ టెక్నాలజీలో డిప్లొమా, డీహెచ్ఎల్ఎస్ (డిప్లొమా ఇన్ హియరింగ్ అండ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్), అనస్తీషియా టెక్నాలజీలో డిప్లొమా, డిప్లొమా ఇన్ డెంటల్ హైజినిస్ట్, గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో డిప్లొమా, కమ్యూనిటీ హెల్త్‌కేర్‌లో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ♦ పారామెడికల్ డిప్లొమా కోర్సుల కాల వ్యవధి ఒక ఏడాది నుంచి 3 ఏళ్ల మధ్య ఉంటుంది. ♦ అర్హత: డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి, ఇంటర్ చదివిన విద్యార్థులు అర్హులు. సర్టిఫికేట్ పారామెడికల్ కోర్సులు ఎక్స్–రే టెక్నీషియన్లో సర్టిఫికేట్, ల్యాబ్ అసిస్టెంట్/టెక్నీషియన్లో సర్టిఫికేట్, డెంటల్ అసిస్టెంట్‌లో సర్టిఫికేట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్‌లో సర్టిఫికేట్, నర్సింగ్ కేర్ అసిస్టెంట్‌లో సర్టిఫికేట్, ఈసీజీ, సీటీ స్కాన్ టెక్నీషియన్లలో సర్టిఫికేట్, డయాలసిస్ టెక్నీషియన్లో సర్టిఫికేట్, గృహ ఆధారిత ఆరోగ్య సంరక్షణలో సర్టిఫికేట్, గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో సర్టిఫికేట్,హెచ్ఐవీ, కుటుంబ విద్యలో సర్టిఫికేట్, న్యూట్రీషన్, పిల్లల సంరక్షణలో సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ∙సర్టిఫికేట్ పారామెడికల్ కోర్సుల కాల వ్యవధి 6నెలల నుంచి 2 ఏళ్ల మధ్య ఉంటుంది. వీటికి కనీస అర్హత పదో తరగతి. ప్రవేశాలు బైపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, నిమ్స్, ఆయా రాష్ట్రీయ, కేంద్రీయ యూనివర్సిటీలు ప్రతిఏటా విడుదల చేసే నోటిఫికేషన్లకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించడం ద్వారా తమకు నచ్చిన పారామెడికల్ కోర్సుల్లో చేరే వీలుంది. పలు పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్హతలో సాధించిన మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. వేతనాలు పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు కెరీర్ ప్రారంభ దశలో.. పారామెడికల్ టెక్నీషియన్లుగా పనిచేయాలి. వారికి జీతం సుమారు రూ.5,000 నుంచి రూ.8,000 ఉంటుంది. కార్పొరేట్ ఆసుపత్రులలో పనిచేస్తే జీతం రూ.8000 నుంచి రూ.12,000 వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా నెలవారీ జీతం రూ. 30,000 వరకు ఉండవచ్చు. ఉపాధి మార్గాలు ♦ ఈ కోర్సులు పూర్తిచేసినవారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాలు, ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమైన సంస్థలలో ఉద్యోగాలు పొందవచ్చు. ♦ పారామెడికల్ కోర్సులు చేసినవారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. దేశంలోనే కాకుండా..యూఎస్ఎ, యూఎఈ, యూకె, కెనడా వంటి విదేశాలలో కూడా డిమాండ్ పెరుగుతోంది. నర్సింగ్ హోమ్, హాస్పిటల్, క్లినిక్‌లు, ఆరోగ్య విభాగాల్లో ఉద్యోగాలతోపాటు సొంతంగా క్లినిక్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. -
వైద్యారోగ్యశాఖలో 2,101 పోస్టులు
- భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా - కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిన స్టాఫ్ నర్సులు, పారామెడికల్ ఉద్యోగాలు సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో 2,101 పారా మెడికల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేసేందుకు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టు తదితర పారామెడికల్ పోస్టులే కావడం గమనార్హం. వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. డీఎంఈ పరిధిలో 474, వైద్య విధాన పరిషత్‌లో 270, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం విభాగంలో 1,357 పోస్టులున్నాయి. శాశ్వత నియామకాలు జరిపే వరకు ఈ ఉద్యోగులు కొనసాగుతారని ఉత్తర్వులో తెలిపారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొందరు కలెక్టర్ల నుంచి వచ్చిన విన్నపం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఇవీ... డీఎంఈ పరిధిలో... పోస్టులు సంఖ్య స్టాఫ్ నర్సులు 279 గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్లు 121 గ్రేడ్–2 ఫార్మసిస్టులు 74 మొత్తం 474 వైద్య విధాన పరిషత్ పరిధిలో.. పోస్టులు సంఖ్య నర్సింగ్ 129 ల్యాబ్ టెక్నీషియన్లు 51 గ్రేడ్–2 ఫార్మసిస్టులు 48 రేడియోగ్రాఫర్లు 42 మొత్తం 270 ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం పరిధిలో.. పోస్టులు సంఖ్య స్టాఫ్ నర్సులు 1,109 గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్లు 131 గ్రేడ్–2 ఫార్మసిస్టులు 100 ఎల్టీ మలేరియా 17 మొత్తం 1,357