breaking news
Panchayati Raj branch
-
ప్రతాప్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం
అపోలో ఆస్పత్రుల చైర్మన్ జీవిత కథ ‘హీలర్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జానా సాక్షి, హైదరాబాద్: వైద్యరంగంలో డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి సేవలు చిరస్మరణీయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అపోలో ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి జీవిత చరిత్ర ‘హీలర్: డాక్టర్ ప్రతాప్ చంద్రరెడ్డి అండ్ ది ట్రాన్స్ఫార్మేషన్స్ ఆఫ్ ఇండియా’ పుస్తకావిష్కరణ బుధవారం ఇక్కడి అపోలో హెల్త్ సిటీలో జరిగింది. మంత్రి జానారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అపోలో ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం ద్వారా ప్రతాప్‌రెడ్డి విదేశీయులను ఆకర్షిస్తున్నారంటూ ఆయన సేవలను ప్రశంసించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. 1980 తర్వాత దేశానికి సూపర్‌స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత ప్రతాపరెడ్డికే దక్కుతుందన్నారు. 30 ఏళ్లుగా ప్రతాప్‌రెడ్డి 37 మిలియన్ల మంది రోగుల జీవితాల్లో వెలుగులు నింపారని పుస్తక రచయిత, చరిత్రకారుడు ప్రణ్య్గుప్తా కొనియాడారు. 600 పేజీలు గల ఈ హీలర్ పుస్తక ప్రతిని ప్రతాప్‌రెడ్డి కొన్ని రోజుల క్రితం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి అందించగా.. అధికారికంగా పుస్తకావిష్కరణ బుధవారం జరిగింది. అనంతరం తొలి ప్రతిని ప్రతాప్‌రెడ్డి తన సతీమణి సుచరితారెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి రాఘవరెడ్డి ఆదేశాల మేరకే ఒకప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చానన్నారు. గతంలో ఇక్కడి రోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా విదేశీ వైద్యులను ఆశ్రయించాల్సి వచ్చేదని, సకాలంలో వైద్యం అందక అనేక మంది మృత్యువాతపడేవారని చెప్పారు. దీంతో సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలను కార్డియాలజీ విభాగంలో ప్రారంభించినట్లు తెలిపారు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి అభివృద్ది చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ధరకే మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు రాంచరణ్, అపోలో డెరైక్టర్ సంగీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కష్టాల బాట.. నష్టాల మేట
సాక్షి, హైదరాబాద్: పంటలు.. పాడి.. ఇళ్లు.. రహదారులు.. ఒక్కటేమిటి వారం రోజులుగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు అన్నింటిని నిలువునా ముం చాయి. అనేక రంగాలను తీవ్రంగా దెబ్బతీశాయి. పంట నష్టం అయితే అంచనాలకు అందని స్థాయిలో ఉంది. ఆస్తులకూ భారీ నష్టం సంభవించింది. అధికారిక సమాచారం ప్రకారమే వర్షాలు, వ రదలతో 48,500 ఇళ్లు కూలిపోయాయి. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇళ్లు నేలమట్టం కావడంతో నిలువ నీడ కరువవడంతో వేలాది మంది అభాగ్యులు నీళ్ల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 1,400 పైగా చిన్న తరహా చెరువులు తెగిపోయాయి. దీనివల్ల చిన్నతరహా నీటి పారుదల శాఖతోపాటు వచ్చే రబీలో పంటలు సాగు చేసే రైతులకూ నష్టమే. గండ్లు పడటంతో చెరువుల్లో నీరంతా వృథాగా పోయింది. భవిష్యత్తులో పంటల సాగుకు నీరులేని దుస్థితి ఏర్పడింది. రహదారులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన 9,500 కి.మీ. పొడవునా రహదారులు పాడయ్యాయి. మత్స్యకారులకు చెందిన 1,500 బోట్లు, 3,300 వలలు దెబ్బతిన్నాయి. దీంతో వారు ఉపాధి కోల్పోయారు. 1,200 పత్తి యార్నులు, 156 పవర్‌లూమ్స్ దెబ్బతిన్నాయి. 28 వేల చేనేత మగ్గాల గుంతల్లో నీరు చేరింది. 1,900 పశువులు మృతి చెందాయి. ఇవి ప్రాథమికంగా ప్రభుత్వానికి అందిన అధికారిక లెక్కలు. పూర్తి స్థాయిలో అధికార బృందాలు గ్రామాల్లో పర్యటించి లెక్కలు కడితే ఈ నష్టం భారీగా పెరగనుంది. మరోవైపు ఈ వర్షాలు 53 మందిని పొట్టన పెట్టుకున్నాయి. నల్లబారిన తెల్ల బంగారం.. వర్షాలు, వరదలు ఖరీఫ్‌ను తుడిచిపెట్టాయి. 29 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. వాస్తవంగా దెబ్బతిన్న పంటల విస్తీర్ణం 35 లక్షల ఎకరాలు పైనే ఉంటుందని తెలుస్తోంది. పెట్టుబడుల కోసం అప్పులు చేసి పంటలు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అటు వరంగల్ నుంచి ఇటు శ్రీకాకుళం వరకూ ఏ జిల్లాకు వెళ్లినా నీటిలో నాని కుళ్లుతున్న పంటలు, మొలకలొచ్చిన వేరుశనగ, వరి, మొక్కజొన్న, నాని పోయి బూజు పట్టిన పత్తి చేలే కనిపిస్తున్నాయి. 15 లక్షల ఎకరాల్లో పత్తి పంట నీటమునిగింది. మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసిన పత్తి కూడా పూర్తిగా తడిసింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, నల్లగొండ, కరీంనగర్ తదితర జిల్లా ల్లో వరి పొలాల్లో ఇసుక తిన్నెలు మేట వేశాయి. అప్పోసొప్పో చేసి సాగు చేసిన పంటలు కళ్లముందే నీటి పాలుకావడంతో రైతులు కుమిలిపోతున్నారు. ఎరువుల ధరలు, కూలీ రేట్లు, సాగు ఖర్చులు భారీగా పెరగడంతో రైతుల అప్పులు తడిసిమోపెడయ్యాయి. బియ్యం ధరలపై ప్రభావం.. అధికారిక సమాచారం ప్రకారం 11.80 లక్షల ఎకరాల్లో వరి నీట మునిగింది. ఈ ప్రభావం బియ్యం ధరలపై పడనుంది. ప్రస్తుతం సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.50 నుంచి రూ.55 వరకూ ఉంది. ఈ ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలో వరి సాగైనందున కొత్త ధాన్యం వచ్చిన తర్వాత బియ్యం ధరలు తగ్గుముఖం పడతాయని అధికార వర్గాలు అంచనా వేశాయి. అయితే ఇప్పుడు పంటలన్నీ దెబ్బతినడం, ఉన్న పంట కూడా రంగు మారడం, నాణ్యత తగ్గడం వల్ల రాబోయే కాలంలోనూ బియ్యం ధరలు పెద్దగా తగ్గే అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు.