breaking news
palem bus
-
వోల్వో బస్సు బోల్తా.. ఐదుగురి మృతి
కోలారు(కర్ణాటక), న్యూస్‌లైన్/సాక్షి, నెల్లూరు: పాలెం బస్సు దుర్ఘటన మరువక ముందే మరో వోల్వో బస్సు ప్రయాణికుల పాలిట మృత్యుశకటంగా మారింది. ఇంకో గంట గడిస్తే గమ్యానికి చేరాల్సిన వారిలో ఐదుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నెల్లూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న వోల్వో బస్సు సోమవారం తెల్లవారు జామున కర్ణాటక రాష్ర్టం హొసకోటె వద్ద బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 28 మంది గాయపడ్డారు. మృతులందరూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావాసులే. మృతులు, గాయపడిన వారిలో అత్యధికులు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. శని,ఆదివారాలు సెలవు కావడం తో సొంత ఊళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు.. రాజేష్ ట్రావెల్స్‌కు చెందిన (కేఏ01ఏఏ7709) బస్సు ఆదివారం రాత్రి 10గంటలకు నెల్లూరు నుంచి 52 మంది ప్రయాణికులతో బెంగుళూరుకు బయలుదేరింది. తెల్లవారు జామున 5.30 గంటలకు బెంగళూరుకు 25 కిలోమీటర్ల దూరంలోని హొసకోటె సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై కుడివైపు ఉన్న డివైడర్‌ను ఢీకొంది. కొంతదూరం అలాగే రాసుకుంటూ వెళ్లి ఎడమ వైపునకు బోల్తాపడింది. ఆ తర్వాత కూడా 30మీటర్ల దూరం ముందుకు దూసుకెళ్లి నిలిచి పోయింది. దీంతో ఎడమవైపు సీట్లలో కూర్చున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రదీప్ బెంగుళూరులోని హాస్‌మాట్ ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ మృతి చెందారు. గాయపడిన వారిని సంఘటనా స్థలానికి సమీపంలోనే ఉన్న ఎంవీజీ వైద్య కళాశాల, బెంగుళూరులోని కొలంబియా ఏషియా, హాస్‌మాట్ ఆస్పత్రులకు తరలించారు. కాగా, డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా కుక్కల గుంపు అడ్డుగా రావడంతో కొద్దిగా కుడివైపుకు తీసుకోగానే బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కి కొంతదూరం దూసుకెళ్లి బోల్తాపడిందనిడ్రైవర్ వెంకటప్ప తెలిపాడు. నెల్లూరుకు చెందిన అనూష (25), విజయ్‌కుమార్(32), మానస్‌కుమార్(06), గూడూరుకు చెందిన ప్రదీప్(25), పొదలకూరు మండలం వావింటపర్తికి చెందిన ప్రసాద్(28)లను మృతులుగా గుర్తించారు. తప్పులతడకగా ప్రయాణికుల జాబితా బస్సులో ఎక్కిన ప్రయాణికుల జాబితా తప్పులతడకగా ఉంది. ఒకరి పేరున మూడు రిజర్వేషన్లు, జాబితాలోని ఫోన్నంబర్ల వ్యక్తులు ప్రయాణం చేయకపోవడం, ప్రయాణం రద్దు చేసుకున్న వారి వివరాలు తెలపకపోవడంతో అసలు బస్సులో ఎవరు ప్రయాణిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రూ.లక్షఎక్స్గ్రేషియా: ఎంవీజీ ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న క్షతగాత్రులను కర్ణాటక రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని, క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స చేయిస్తామన్నారు. బస్సు బీమా నుంచి కూడా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందుతుందని వెల్లడించారు. -
నడిస్తే.. నడవనీ
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : మహబూబ్‌నగర్ జిల్లా పాలెం బస్సు దుర్ఘటన బాధితుల ఆందోళనల నేపథ్యంలో వారం రోజులుగా రవాణా శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌పై దాడులు చేసి అనుమతుల్లేని బస్సులను సీజ్ చేస్తున్నారు. జిల్లా ఆర్టీఏ అధికారులు మాత్రం మొక్కుబడిగా రికార్డులుతనిఖీలు చేసి సరిపెడుతున్నారు. దీంతో గతంలో సీజ్ చేసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్లపై యథావిధిగా తిరుగుతున్నాయి. అవేవీ ఆర్టీఏ అధికారులకు వూత్రం కన్పించటంలేదు. దాడులు నిర్వహించినట్టు రికార్డుల్లో చూపించేందుకు నామమాత్రంగా అపరాధ రుసుము వసూలు చేసి మమ అనిపిస్తున్నారు. పది కేసుల నమోదు గతేడాది నవంబర్‌లో పాలెం దుర్ఘటన జరిగిన వెంటనే ఆర్టీఏ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను తనిఖీలు చేశారు. జిల్లాలోనూ దాడులు నిర్వహించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులపై 90 కేసులు నమోదు చేశారు. 70 బస్సులను సీజ్ చేశారు. అలా సీజ్ చేసిన బస్సులు యథావిధిగా రోడ్లపై తిరుగుతున్నాయి. పాలెం దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలు తమ ఆందోళనను ఉధృతం చేయడంతోపాటు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు కాంట్రాక్ట్ క్యారేజీ అనుమతులు తీసుకుని స్టేజి క్యారేజీలుగా తిప్పుతూ ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్నారని, చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉద్యమించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. నిబంధనలకు విరుద్ధం గా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అడ్డుకోవాలని ఆదేశించడంతో రవాణాశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్త దాడులకు దిగారు. వారం రోజులుగా దాడులు చేస్తున్న జిల్లా అధికారులు కేవలం 10 కేసులు మాత్రమే నమోదు చేశారు. అంటే ఎంత తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారో తెలుస్తోంది. జిల్లా నుంచి 20 ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన 150 బస్సులు నిత్యం హైదరాబాద్, విశాఖపట్నం, బెంగుళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళుతున్నాయి. జిల్లా కేంద్రం ఏలూరులో 20 వరకు ప్రైవేట్ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. ఏలూరుతో పాటు భీవువరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, కొవ్వూరు నుంచి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయి. జిల్లా నుంచి ప్రయాణించే ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఆర్టీసీకి కూడా లేనన్ని టికెట్ బుకింగ్ సెంటర్లు ఉన్నాయి. నిబంధనలకు పాతర ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు పాతర వేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ఇష్టారాజ్యంగా టికెట్ చార్జీలు పెంచి సొమ్ము చేసుకున్నారు. అదే రీతిలో ఈ సంక్రాతి సీజన్‌ను ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. లోపాయికారీ ఒప్పందాల వల్లే ఆర్టీఏ అధికారులు మొక్కబడిగా దాడులు చేసి సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.